పవన్ పార్టీ జనసేన కాదు.. చంద్ర సేన
నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నాడని, అతడు పాదయాత్ర కాదు.. దూకుడు యాత్ర చేసినా ఎప్పటికీ నాయకుడు కాలేడు అని అంబటి ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ పార్టీ పేరు జనసేన కాదు.. చంద్రసేన అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఇవాళ అంబటి రాంబాబు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌లపై విమర్శలు చేశారు. నిన్న మొన్నటిదాకా సెంట్రల్ జైల్లో ఉండి ఆరోగ్యం బాగాలేదనే సాకుతో బయటకు వచ్చిన చంద్రబాబుకు వైసీపీని ఓడించే సత్తా ఉందా..? అని ప్రశ్నించారు.
చంద్రబాబు టికెట్లు వేస్తే పవన్ కళ్యాణ్ ఫ్లైట్లు ఎక్కుతుంటాడని, అతడి పార్టీ జనసేన కాదు.. చంద్రసేన అని విమర్శించారు. నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నాడని, అతడు పాదయాత్ర కాదు.. దూకుడు యాత్ర చేసినా ఎప్పటికీ నాయకుడు కాలేడు అని అంబటి ఎద్దేవా చేశారు. నారా లోకేష్‌కు స్పష్టంగా మాట్లాడటం కూడా రాదని, సోదరులు అనే పదాన్ని కూడా సౌదరులు అని పలుకుతుంటాడని, ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఎలా అవుతాడని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ.. ఏపీలో మాత్రం టీడీపీకే ఓటు వేయాలని చంద్రబాబు కోరడం.. నీతి, సిగ్గులేని రాజకీయమని అంబటి విమర్శించారు. చంద్రబాబు పల్లకి మోయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. కాపులు మాత్రం అందుకు సిద్ధంగా లేరని చెప్పారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్‌ను ఓడించే నాయకుడు లేడని అంబటి అన్నారు. చచ్చేదాకా జగనన్నతోనే తన ప్రయాణం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.