ఏపీలో ఉద్యోగ సంఘాలు.. చీలికలు, పేలికలు

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ, ఉద్యోగులతో గొడవలెందుకని చర్చలకు పిలిపించింది ప్రభుత్వం. మంత్రి బొత్స, సలహాదారు సజ్జల నేతృత్వంలో చర్చలు జరిగాయి.

Advertisement
Update:2023-03-03 09:41 IST

ఇటీవల చీఫ్ సెక్రటరీని కలసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఏపీ జేఏసీ అమరావతి నాయకులు. ఈనెల 9నుంచి సెల్ డౌన్, పెన్ డౌన్ చేపడతామన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ, ఉద్యోగులతో గొడవలెందుకని చర్చలకు పిలిపించింది. మంత్రి బొత్స, సలహాదారు సజ్జల నేతృత్వంలో చర్చలు జరిగాయి. ఉద్యోగ సంఘాల తరపున ఏపీ జేఏసీ నాయకుడు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డితో చర్చించారు. ఈ చర్చల్లో తేలిందేమీ లేదు. ఈనెల 7న మరోసారి చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు నాయకులు.

ఉద్యమానికి సిద్ధం..

ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరిస్తోంది కదా, ఇంకా ఎందుకు ఉద్యమాలు అని మంత్రి బొత్స ప్రశ్నించారని తెలుస్తోంది. ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఆర్థిక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, జీపీఎఫ్, పీఎఫ్.. లోన్లు రావడం లేదని, ఆరోగ్య కార్డుల వల్ల ఉపయోగం లేదని చెప్పారాయన. తమ ఉద్యమం కొనసాగుతుందని, కార్యాచరణ నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.


ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు కూడా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులు, పోలీసులకు రెండేళ్లుగా ఆర్జిత సెలవుల డబ్బులు ఇవ్వడంలేదని, చర్చలతోనే సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామన్నారు.

నేను సీఎం జగన్ బంటునే..

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు బండి వెంకట్రామిరెడ్డి మాత్రం ఈ సమావేశంపై పూర్తి పాజిటివ్ గా స్పందించారు. సీపీఎస్‌ ఉద్యోగులపై పెట్టిన 1600 కేసులను ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు త్వరలో బదిలీలు నిర్వహిస్తామన్నారని, సర్వీసు నిబంధనలు రూపొందించి, పదోన్నతులు కల్పిస్తామన్నారని చెప్పారు. తాను సీఎం జగన్‌ బంటుని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాధినేత జగన్‌ కాబట్టి ఆయనకు తాను బంటునేనన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో బంటునే ఓడించలేని వాళ్లు.. అధినేత సీఎం జగన్‌ ను ఓడించగలరా? అని ప్రశ్నించారు.

ఒకరు గవర్నర్ ని కలుస్తారు, ఇంకొకరు కార్యాచరణ ప్రకటిస్తారు, మరొకరు చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని సెలవిస్తారు. చివరిగా మరో నేత తాను జగన్ బంటుని అంటూ అసలు విషయం చెప్పేస్తారు. ప్రస్తుతం ఏపీలో ఉద్యోగ సంఘాల నాయకుల తీరు ఇది. అటు ప్రభుత్వం మాత్రం ఓపీఎస్ కాదు జీపీఎస్ అంటూ బ్రేకులు వేస్తోంది. ఈ దశలో ఉద్యోగుల ఉద్యమాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News