`మిష‌న్ ఆయిల్ పామ్‌`పై ఏపీ ప్ర‌త్యేక దృష్టి - కొత్త‌గా 62,500 ఎక‌రాల్లో తోట‌ల విస్త‌ర‌ణ ల‌క్ష్యం

`మిష‌న్ ఆయిల్ పామ్‌`పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాది కొత్త‌గా మ‌రో 62,500 ఎక‌రాల్లో తోట‌లు విస్త‌రించాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించింది. `మిష‌న్ ఆయిల్ పామ్‌` దిశ‌గా రైతుల‌ను ప్రోత్స‌హించేందుకు రూ.104.15 కోట్ల నిధులు కేటాయించింది.

Advertisement
Update:2022-12-06 12:40 IST

దేశీయ మొక్క‌లు సాగు చేసే రైతుల‌కు హెక్టారుకు రూ.62 వేలు, విదేశాల నుంచి దిగుమ‌తి చేసే మొక్క‌ల సాగుకు రూ.71 వేలు స‌బ్సిడీగా అందిస్తోంది. బిందు సేద్యం కోసం రూ.24 వేలు, పంపు సెట్లు, డీజిల్ ఇంజిన్ల కోసం రూ.22,500 వేలు, బోర్ వెల్ త‌వ్వ‌కం కోసం రూ.50 వేలు, వ‌ర్మీ కంపోస్టు యూనిట్‌కు రూ.15 వేలు, ఆయిల్ చాప్ క‌ట్ట‌ర్‌కు రూ.2,500, ఆయిల్ పామ్ ప్రొటెక్టివ్ వైర్ మెష్‌కు రూ.20 వేలు, మోట‌రైజ్డ్ చిసెల్‌కు రూ.15 వేలు, అల్యూమినియం పోర్ట‌బుల్ లేడ‌ర్‌కు రూ.5 వేలు, చిన్న ట్రాక్ట‌ర్ కోసం రూ.2 ల‌క్ష‌ల చొప్పున అందిస్తోంది. ఈ విధంగా హెక్టారుకు రూ.4.04 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ‌మే ఆర్థిక సాయం అందించ‌నుంది.

విత్త‌న ఉత్ప‌త్తి ప్రాంతాలివీ...

ఆయిల్ పామ్ విత్త‌న ఉత్ప‌త్తిని రాష్ట్రంలోని ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్స్ ద్వారా చేస్తున్నారు. రాజ‌మహేంద్ర‌వ‌రం స‌మీపంలోని మోరంపూడి, ఏలూరు స‌మీపంలోని గోప‌న్న‌పాలెం, ముత‌న‌వీడులోని ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్స్‌లో వీటి ఉత్ప‌త్తి జ‌రుగుతోంది. వాటిని జిల్లాల వారీగా సాగుకు ముందుకొస్తున్న రైతుల‌కు పంపిణీ చేస్తున్నారు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఈ కార్య‌క్ర‌మానికి నెల్లూరు జిల్లాలో మొక్క‌ల పంపిణీకి శ్రీ‌కారం చుట్టారు.

ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే మొద‌టి స్థానంలో...

ఆయిల్ పామ్ సాగులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంది. క‌ర్నాట‌క‌, మిజోరాం రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 9.05 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ తోట‌ల సాగు జ‌రుగుతోంది. ఏపీలో 4.81 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు చేస్తుండ‌గా, క‌ర్నాట‌క‌లో 1.11 ల‌క్ష‌ల ఎక‌రాల్లో, మిజోరాంలో 80 వేల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ తోట‌లను సాగు చేస్తున్నారు.

గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ ఇవ్వ‌నంత‌గా...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ ఇవ్వ‌నంతగా త‌మ ప్ర‌భుత్వం చేయూత అందిస్తోందని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి చెప్పారు. అందుకే సాగు విస్తీర్ణంతో పాటు రైతుల సంఖ్య కూడా రాష్ట్రంలో బాగా పెరిగింద‌ని ఆయ‌న వివ‌రించారు. ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా ఆయిల్ ఎక్స్‌ట్రాక్ష‌న్ రేషియో ప్ర‌క‌టిస్తూ రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంద‌ని మంత్రి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News