ఇంత దిగజారి మాట్లాడాలా..? ఇంత విషం కక్కాలా..?

"వారి పిల్లలు, మనవళ్ల చేతిలో ట్యాబులు ఉండొచ్చు, ల్యాప్ ట్యాపులు ఉండొచ్చు, స్మార్ట్‌ ఫోన్లు ఉండొచ్చు, కాని పేదల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, ల్యాప్ ట్యాపులు ఉండకూడదు, స్మార్ట్‌ ఫోన్లు ఉండకూడదు.. ఇదెక్కడి న్యాయం" అన్నారు సీఎం జగన్.

Advertisement
Update:2023-12-21 15:15 IST

పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలకు, ఎల్లో మీడియాకు ఎందుకంత కడుపుమంట..? అని సూటిగా ప్రశ్నించారు సీఎం జగన్. మార్పులు తీసుకువస్తున్న మన ప్రభుత్వంమీద వారంతా బురదజల్లుతున్నారని మండిపడ్డారు. పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని తాను ఆరాటపడుతుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, చంద్రబాబు, దత్తపుత్రుడు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వకూడదని అంటున్నారని, ట్యాబులు చేతిలో ఉంటే.. పిల్లలు చెడిపోతున్నారంటూ వార్తలు రాస్తున్నారని, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు జగన్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారాయన. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జగన్‌ బర్త్‌డే బహుమతి.. చెడగొడుతోంది మతి..

ఈనాడు టైటిల్ ని చదివి వినిపించి మరీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్. "జగన్‌ బర్త్‌డే బహుమతి.. చెడగొడుతోంది మతి" అని ఈనాడులో రాశారని, అలాంటి పేపర్‌ ను చదవొచ్చా అని ప్రశ్నించారు. ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఇంతగా దిగజారి రాతలు రాయాలా..? ఇంతగా దిగజారి మాట్లాడాలా..? పేదవర్గాల పిల్లలమీద ఇంతగా విషం కక్కాలా అని ప్రశ్నించారు సీఎం జగన్. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే.. ఇంత కడుపుమంట వద్దని చెప్తున్నానన్నారు.

"వారి పిల్లలు, మనవళ్ల చేతిలో ట్యాబులు ఉండొచ్చు, ల్యాప్ ట్యాపులు ఉండొచ్చు, స్మార్ట్‌ ఫోన్లు ఉండొచ్చు, కాని పేదల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, ల్యాప్ ట్యాపులు ఉండకూడదు, స్మార్ట్‌ ఫోన్లు ఉండకూడదు.. ఇదెక్కడి న్యాయం" అన్నారు సీఎం జగన్. వారి పిల్లల చేతులలో ఇవన్నీ ఉంటే చెడిపోరా అని ప్రశ్నించారు. పేదల పిల్లలు మాత్రం ట్యాబులు చేతిలో ఉంటే చెడిపోతారా అన్నారు. వారి పిల్లలు, మనవళ్లు ఇంగ్లిషు మీడియంలోనే చదవాలా..? పేద పిల్లలు ఇంగ్లిషులో చదవకూడదా, పేదలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే తెలుగు భాష అంతరించిపోతుందా అని ప్రశ్నించారు జగన్.

వారి పాలనలో మోసం జరిగిందని, ఇప్పుడు పేదలకు న్యాయం జరుగుతుందని, అందుకే వారికి కడుపు మంట అని విమర్శించారు సీఎం జగన్. మంచి చేసినవారిని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి అని చెప్పారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, ఒక బెంజికారు ఇస్తానంటూ ప్రతిపక్షాలు వాగ్దానాలు చేస్తాయని, మోసపోవద్దని ప్రజలను కోరారు. 

Tags:    
Advertisement

Similar News