రెడ్ లైన్ దాటారు, సస్పెన్షన్ వేటు పడింది
చర్చ మొదలైన తర్వాత జీవో నెంబర్-1 రద్దుపై వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. ఆ తర్వాత రెడ్ లైన్ దాటి లోపలికి వచ్చారు. 11మందిని స్పీకర్ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీలో ఈరోజు కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. రెడ్ లైన్ దాటితే ఆటోమేటిక్ గా సస్పెన్షన్ వర్తిస్తుందని ఇదివరకే స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేయగా, అదే నిబంధన ప్రకారం ఈరోజు 11మంది టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటినుంచి టీడీపీ సభ్యులు ప్రతిరోజూ సస్పెండ్ అవుతూనే ఉన్నారు. ఈరోజు రెడ్ లైన్ నిబంధన ప్రకారం బయటకు వెల్లిపోయారు.
ప్రశ్నోత్తరాల సమయంలో రెడ్ లైన్ ఇవతలే నిలబడి నినాదాలు చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. చర్చ మొదలైన తర్వాత జీవో నెంబర్-1 రద్దుపై వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. ఆ తర్వాత రెడ్ లైన్ దాటి లోపలికి వచ్చారు. స్పీకర్ హెచ్చరించినా పట్టించుకోలేదు. పోడియం ఎక్కేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 11మందిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈరోజు సభలో రెండు అప్రాప్రియేషన్ బిల్లులతో సహా ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వీటిని శాసన సభ ఆమోదించింది. బోయ/వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిన దళితులను ఎస్సీలుగా పరిగణించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ప్రవేశ పెట్టిన మరో తీర్మానం కూడా ఆమోదం పొందింది. ఐదు బిల్లులతో పాటు.. ప్రభుత్వం ఈ రోజు సభలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ఈ రెండు తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుంది.