కెమికల్ ఫ్యాక్టరీలో మరో ప్రమాదం.. నలుగురికి గాయాలు

అనకాపల్లి జిల్లాలోనే ఈ దుర్ఘటన కూడా జరిగింది. పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో రసాయనం మీదపడి నలుగురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
Update: 2024-08-23 06:18 GMT

అచ్యుతాపురం సెజ్ ఘటన మరవకముందే, అనకాపల్లి జిల్లాలోని మరో కంపెనీలో ప్రమాదం జరిగింది. అయితే ఈ దుర్ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదు. నలుగురు ఉద్యోగులు గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. వారిని అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే పరామర్శించారు. కూటమి ప్రభుత్వం వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు స్వయంగా అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హోం మంత్రిని సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

అసలేం జరిగింది..?

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదంలో 17మంది మరణించిన విషయం తెలిసిందే. అదే జిల్లాలోని పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో ఇప్పుడీ ప్రమాదం జరిగింది. సినర్జిన్‌ యాక్టివ్‌ ఇంగ్రెడియంట్స్‌ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురికి గాయాలయ్యాయి. రియాక్టర్‌లో కెమికల్‌ నింపి ఛార్జింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. రియాక్టర్ రంధ్రం నుంచి ఆ కెమికల్ ఒక్కసారిగా ఉప్పొంగి పైకప్పుకి తాకింది. అది తిరిగి కార్మికులపై పడింది. ముగ్గురు కార్మికులు, కెమిస్ట్‌ గా పనిచేస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వెంట వెంటనే జరిగిన ఈ ఘటనలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇలాంటి దుర్ఘటనలను నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సేఫ్టీ ఆడిట్ విషయంలో కఠినంగా ఉండాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. 

Tags:    
Advertisement

Similar News