ఏపీలో మరో అటాక్.. కొడాలి నాని మాజీ పీఏపై దాడి
ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దాడిగా దీన్ని ఎవరూ చూడటంలేదు. కొడాలి నాని మాజీ పీఏపై జరిగిన దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. కొడాలి నాని పేరు హైలైట్ కావడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది.
ఏపీలో మరో దాడి జరిగింది. అది పొలిటికల్ అటాక్ అనడానికి చాలా కారణాలున్నాయి, కానీ ఆ విషయంలో బాధితుడు కూడా సైలెంట్ గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని వద్ద పీఏగా పనిచేసిన ఆచంట లక్ష్మోజీ అనే ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరిగింది. ప్రస్తుతానికి గుర్తు తెలియని వ్యక్తుల దాడి అని మాత్రమే తెలుస్తోంది. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఇది కూడా పొలిటికల్ అటాక్ అని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అయితే ఈ ఎపిసోడ్ లో తప్పెవరిది అనేది తేలాల్సి ఉంది.
మచిలీపట్నం కలెక్టరేట్ లో పౌరసరఫరాల విభాగంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు ఆచంట లక్ష్మోజీ. గతంలో ఆయన కొడాలి నాని వద్ద ప్రభుత్వ పీఏగా పనిచేశారు. ఆ తర్వాత తిరిగి మాతృశాఖకు వచ్చేశారు, కలెక్టరేట్ లో విధులకు హాజరవుతున్నారు. మచిలీపట్నంలో విధులు ముగించుకుని గత రాత్రి గుడివాడ చేరుకున్న లక్ష్మోజీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి చేసింది ఎవరనేది తెలియడంలేదు. బాధితుడు లక్ష్మోజీ కూడా అనుమానితుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం గందరగోళంగా మారింది.
ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దాడిగా దీన్ని ఎవరూ చూడటంలేదు. కొడాలి నాని మాజీ పీఏపై జరిగిన దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. కొడాలి నాని పేరు హైలైట్ కావడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. దాడి చేసింది ఎవరు..? వారికి టీడీపీతో ఏమైనా సంబంధం ఉందా..? లేక వ్యక్తిగత దాడా..? అనేది తేలాల్సి ఉంది.