సీఎం జగన్‌కే మా ఓటు.. సైకిల్ గుర్తుకే మా ఓటు.. ఏంటీ గందరగోళం?
ఓ వృద్దురాలిని ఈ సంక్షేమ పథకాలన్నీ ఎవరిస్తున్నారని అడిగితే జగన్ అని చెప్పింది. మీ ఓటు ఎవరికి వేస్తారంటే జగన్‌కే వేస్తామంది. మన గుర్తు ఏమిటని అడిగితే సైకిల్ అనడంతో మంత్రి అవాక్కయ్యారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. 151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్థానాలు గెలిచి ప్రత్యర్థులను చిత్తు చేసింది. అయితే ఆ పార్టీ గుర్తు ఫ్యాన్ ఇంకా ప్రజల్లోకి పూర్తిగా వెళ్లలేదంటున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇంతకీ ఆయన మాట అనడానికి కారణాలేంటని విశ్లేషిస్తే.. ఇటీవల రెండు సందర్భాల్లో ఆయనకు ప్రజల నుంచి వస్తున్న సమాధానాలే కారణమని తెలుస్తోంది.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జ్యోతిబా పూలే కాలనీలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. ఓ వృద్దురాలిని ఈ సంక్షేమ పథకాలన్నీ ఎవరిస్తున్నారని అడిగితే జగన్ అని చెప్పింది. మీ ఓటు ఎవరికి వేస్తారంటే జగన్‌కే వేస్తామంది. మన గుర్తు ఏమిటని అడిగితే సైకిల్ అనడంతో మంత్రి అవాక్కయ్యారు. ఇలాంటి సందర్భమే గతంలో ఉత్తరాంధ్రలో ఒకరిద్దరు మంత్రులకూ ఎదురైంది.
మన గుర్తుపై మరింత ప్రచారం చేయాలి..
వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ అని ప్రజల్లో ఇంకా విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి ధర్మాన ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో గతంలో తెలుగుదేశానికి ఓట్లేసిన బడుగు బలహీనవర్గాల జనం.. ఇంకా సైకిలే తమ గుర్తు అనుకుంటున్నారని, విస్తృతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్‌కు ఓటేస్తామని చెబుతున్నారు కానీ, పార్టీ గుర్తు మాత్రం జనంలోకి వెళ్లలేదని వైసీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా వైసీపీ ఎన్నికల గుర్తు జనంలోకి ముఖ్యంగా వృద్ధులు, గ్రామీణ ప్రాంత నిరక్షరాస్యుల్లోకి మరింతగా వెళ్లాల్సిన అవసరం ఉందని అంటున్నారు.