నియోజకవర్గమే లేని నేత ఈ పవర్ స్టార్ మాత్రమేనేమో

సినిమాల్లో పవర్ స్టార్ గా పాపులరైన రాజకీయ నేత జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా లేదు.

Advertisement
Update:2022-10-12 11:40 IST

మామూలుగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంఎల్ఏగా పోటీచేయాలని అనుకున్న ఎవరైనా తమకంటు ఒక నియోజకవర్గాన్ని చూసుకుంటారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము గెలిచేట్లుగా ఆ నియోజకవర్గంలో గట్టి పునాదులు వేసుకుంటారు. ఒకసారి ఎంఎల్ఏగా టికెట్ వస్తే చాలు గెలిచినా, ఓడినా ఆ నియోజకవర్గం తన సొంతమే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం అందరు చూస్తున్నదే. అలాంటిది సినిమాల్లో పవర్ స్టార్ గా పాపులరైన రాజకీయ నేత జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా లేదు.

జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే అందరికీ పులివెందులే గుర్తుకొస్తుంది. చంద్రబాబునాయుడు పేరుచెప్పగానే కుప్పం అంటారు. చివరకు నారాలోకేష్ కూడా తాను మంగళగిరిలోనే పోటీచేయబోతున్నట్లు మహానాడులో ప్రకటించారు. పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులందరికీ బీ పారాలు ఇవ్వాల్సింది పవనే కదా. అలాంటి పవర్ స్టార్ పోటీచేసేందుకు నియోజకవర్గం ఒక్కటికూడా లేదంటే ఆశ్చర్యంగానే ఉంది.

పోయిన ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీచేసిన పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మరి వచ్చేఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీచేయబోతున్నారు ? ఇపుడిదే అంశం పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. పోయినచోటే వెతుక్కునే పనిలో ఉన్నారు కాబట్టి కచ్చితంగా పై రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుండి పోటీచేస్తారనే ప్రచారం జరిగింది. తర్వాత అవి మరుగునపడిపోగానే తిరుపతి నుండి పోటీచేస్తే లక్ష మెజారిటి ఖాయమని అక్కడి నేతలు చెప్పారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి పోటీచేయాలని పవన్ పై తూర్పు నియోజకవర్గం నేతలు ఒత్తిడి పెడుతున్నారు. ఇవేవీ కాదు కాకినాడ నుండే పోటీచేస్తారనే ప్రచారం జరిగింది. తర్వాత అదికాదు పిఠాపురం నుండే పోటీ అన్నారు.

ఇంతకీ పవన్ అసలు ఏ నియోజకవర్గం నుండి పోటీచేయబోతున్నారో కూడా తెలీటంలేదు. పోటీచేయబోయే నియోజకవర్గాన్ని రహస్యంగా ఉంచారా లేకపోతే ఎక్కడినుండి పోటీచేయాలో ఇంకా తేల్చుకోలేకపోతున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గం తప్ప ప్రచారంలో ఉన్న అన్నీ నియోజకవర్గాల్లోను వైసీపీ ఎంఎల్ఏలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తానికి పోటీకి పలానా నియోజకవర్గం అంటు లేని నేత ఎవరైనా ఉంటే పవన్ కల్యాణ్ ఒక్కరేనేమో.

Tags:    
Advertisement

Similar News