టీడీపీ వర్సెస్ ఎన్టీఆర్ టీడీపీ

ముఖ్యంగా యూనివ‌ర్సిటీ పేరు మార్పు విషయంలో నందమూరి వారసులు స్పందించిన ప్రతిసారీ వైసీపీనుంచి గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. చెప్పులేయించిన రోజు, పార్టీని లాగేసుకున్నరోజు ఈ వారసులంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.

Advertisement
Update:2022-09-25 07:43 IST

అప్పుడెప్పుడో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి కొన్నాళ్లు హడావిడి చేశారు లక్ష్మీపార్వతి. కానీ ఇప్పుడు మళ్లీ అసలైన ఎన్టీఆర్ టీడీపీ అనే ప్రస్తావన ఏపీ రాజకీయాల్లో వస్తోంది. అసలు టీడీపీ ఎవరిది, ఎవరు లాగేసుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ వారసులు ఏం చేస్తున్నారు.. పోనీ ఇప్పుడేమైనా చేశారా అనే ప్రశ్నలు కొత్తగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి టీడీపీ స్థాపన, చరిత్ర, పార్టీ పగ్గాల మార్పు అనేది గత చరిత్రే అయినా అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తానొకటి తలిస్తే..

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ అనే పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చివరకు అనేక మలుపులు తిరిగి టీడీపీ పుట్టుక దగ్గరకు వచ్చి ఆగింది. పేరు మార్పు వల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు కానీ, వైసీపీకి మాత్రం ఇది ఊహించని పొలిటికల్ మైలేజీ తెచ్చింది. టీడీపీకి ఊహకందని డ్యామేజీ చేసింది. అసలు టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఎందుకున్నాయి, నందమూరి వారి టీడీపీ నారావారి చేతుల్లోకి ఎందుకెళ్లిందనే చర్చ మొదలైంది.

ముఖ్యంగా పేరు మార్పు విషయంలో నందమూరి వారసులు స్పందించిన ప్రతిసారీ వైసీపీనుంచి గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. చెప్పులేయించిన రోజు, పార్టీని లాగేసుకున్నరోజు ఈ వారసులంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఆనాడు తండ్రి మరణానికి పరోక్షంగా కారణమైన వారంతా ఇప్పుడు తండ్రి పేరు మార్చారని బాధపడటం మొసలి కన్నీరు కాక ఇంకేంటని అంటున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబు దగ్గర ఉన్న పార్టీ పగ్గాలు లాక్కోవాలని సవాళ్లు విసురుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ నేరుగా ఎన్టీఆర్ నే టార్గెట్ చేశారు. ట్వీట్లు వేయడం కాదు, చంద్రబాబు ముందుకెళ్లి తొడగొట్టి పార్టీని తెచ్చుకోమంటూ సవాల్ విసిరారు. బాలకృష్ణపై కూడా ఇలాగే కామెంట్లు పడుతున్నాయి. తండ్రి మరణానికి కారణం అయిన చంద్రబాబుతో వియ్యం అందుకుని ఆయన దగ్గర బానిసలా ఉన్నారని, పౌరుషం ఉంటే పార్టీని తిరిగి నందమూరి వారి అధీనంలోకి తెచ్చుకోవాలని బాలయ్యను డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు బాగా కార్నర్ అయ్యారు. ఎన్టీఆర్ పేరెత్తే అర్హత చంద్రబాబుకి లేదంటున్నారు వైసీపీ నేతలు. గతంలో చంద్రబాబు, ఎన్టీఆర్ కి చేసిన అవమానాలన్నీ ఏకరువు పెడుతున్నారు. పేరు మార్చండి అని అడిగినందుకు చంద్రబాబుకి చాకిరేవు పెట్టేశారు. ఈ వ్యవహారంతో టీడీపీకి ఊహించని డ్యామేజీ జరిగిందనే చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News