వానజల్లు.. ఆరోగ్యం జరభద్రం..

బయట వర్షం పడుతున్నపుడు వేడిగా పకోడీలు తినాలని, అలాగే వేడివేడి కాఫీ, టీలు తాగాలని చాలామందికి ఉంటుంది కదా. అలాగే మసాలా దట్టించిన రుచికరమైన వంటకాలు సైతం తినాలనిపించవచ్చు. అయితే వర్షం వస్తున్నపుడు మనకు నచ్చిన ఆహారాలన్నీ తినేయవచ్చా.. అలా తినటం వలన ఏవైనా ఇబ్బందులు ఉంటాయా, వానాకాలం ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ అంశాలను తెలుసుకుందాం.. వర్షాకాలంలో అజీర్తి, నీటి ద్వారా వచ్చే వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. […]

Advertisement
Update:2022-07-13 06:12 IST

బయట వర్షం పడుతున్నపుడు వేడిగా పకోడీలు తినాలని, అలాగే వేడివేడి కాఫీ, టీలు తాగాలని చాలామందికి ఉంటుంది కదా. అలాగే మసాలా దట్టించిన రుచికరమైన వంటకాలు సైతం తినాలనిపించవచ్చు. అయితే వర్షం వస్తున్నపుడు మనకు నచ్చిన ఆహారాలన్నీ తినేయవచ్చా.. అలా తినటం వలన ఏవైనా ఇబ్బందులు ఉంటాయా, వానాకాలం ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ అంశాలను తెలుసుకుందాం..

వర్షాకాలంలో అజీర్తి, నీటి ద్వారా వచ్చే వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే వానాకాలంలో మనకు నచ్చినవన్నీ, నోటికి రుచిగా అనిపించినవన్నీ తినేయటం మంచిది కాదు. మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ‌ర్షాకాలంలో తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి.

– వానాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే బయటి ఆహారాలను తినకుండా ఉండటం మంచిది. రెస్టారెంట్, స్ట్రీట్ ఫుడ్ లను కాకుండా ఇంట్లో తయారైన ఆహార ప‌దార్థాల‌ను తినటం మేలు. వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్యాలు, అజీర్తి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది కనుక శుభ్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

– బయట వర్షం వస్తున్నప్పుడు బజ్జీ, పకోడీ వంటివి తినాలనిపిస్తుంది కానీ… వీటివలన కడుపు ఉబ్బరం, గ్యాస్టిక్‌ సమస్యలు రావచ్చు. వానాకాలం వాతావరణంలో తేమ వలన మన శరీరంలో జీవక్రియల వేగం తగ్గుతుంది. దాంతో పొట్టకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. అలాగే ఆహారం నుండి పోషకాలను తీసుకోవటం కూడా మన జీర్ణవ్యవస్థకు శ్రమగా అనిపిస్తుంది. కనుక వర్షాకాలం అజీర్తి సమస్యలకు దూరంగా ఉండాలంటే నూనె, మసాలాలతో తయారైన వంటకాలను ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు.

– వానాకాలం దాహం తక్కువగా ఉంటుంది. కనుక చాలామంది మంచినీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీనివలన డీహైడ్రేషన్ కి గురికావటం, దాంతో అలసట, నీరసం, రోగనిరోధక శక్తి తగ్గటం లాంటి సమస్యలు వస్తాయి. కనుక వానాకాలం కూడా తగినన్ని నీరు తాగాలి.

– వానాకాలం ఆహారం తాజాగా ఉండేలా చూసుకోవాలి. ముందుగానే కోసి ఉంచిన పళ్లను, మూతలు లేని ఆహార ప‌దార్థాల‌ను తీసుకోకూడదు. అలాగే క్యాబేజీ, క్యాలిఫ్లవర్ వంటివాటికి పురుగులు పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక వాటికి దూరంగా ఉండటం మంచిది. ఆకుకూరలను మరింత బాగా శుభ్రం చేసుకుని వాడాలి.

– వానాకాలం నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక చేపలు, సీఫుడ్ జోలికి పోకుండా ఉండటమే మంచిది.

– వానాకాలం ఉడికించ‌ని, పచ్చివి ఆహారంగా తీసుకోవటం మంచిది కాదు. ఇలా తినటం వలన వ్యాధికారక క్రిములు శరీరంలో ప్రవేశించి అవి మ‌న ఆరోగ్యంపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఉడికించ‌డం వలన కూరగాయల్లోని హానికరమైన క్రిములు నశిస్తాయి కనుక ఆరోగ్య స‌మ‌స్య‌లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వానాకాలం బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ జాగ్రత్త చాలా అవసరం.

– బయట ఫుడ్ తినాల్సి వస్తే తప్పకుండా వేడిగా ఉన్నవాటినే తినటం మంచిది. గుడ్డు, మాంసం వంటివి బాగా ఉడికించినవే తినాలి.

– కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయటకు వెళ్లినప్పుడు నీరు శుభ్రంగా ఉన్నాయో లేదో తెలియనప్పుడు వాటిని తాగటం మంచిది కాదు. సాధ్యమైనంత వరకు ఇంటి నుండి నీటిని తీసుకెళ్లటం ఉత్తమం.

– భోజనానికి ముందు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో చేతులను కడగటం అలవాటు చేసుకోవాలి. సబ్బు అందుబాటులో లేనప్పుడు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవటం మంచిది. శానిటైజర్ ని మనతో ఎప్పుడూ ఉంచుకోవటం మేలు.

– రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఏదైనా అనారోగ్యం నుంచి అప్పుడే కోలుకున్నవారు వానాకాలం ఈతకు దూరంగా ఉండటం మంచిది.

Tags:    
Advertisement

Similar News