ప్లీన‌రీ తిట్లు, పొగ‌డ్త‌ల‌కే ప‌రిమిత‌మైందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న ప్ర‌చారం నేప‌ధ్యంలో జ‌రిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి) ప్లీన‌రీ స‌మావేశాలు ఏ మేర‌కు లాభిస్తాయ‌నే అంశంపై చ‌ర్చ సాగుతోంది. రెండు రోజుల‌పాటు ఘ‌నంగా జ‌రిగిన పార్టీ ప్లీన‌రీ లో మహిళా సాధికారత, విద్య, డిబిటి పథకాలు, ఆరోగ్యం, పరిపాలన-పారదర్శకత వంటి ప‌లు తీర్మానాలను ఆమోదించింది.

Advertisement
Update:2022-07-12 11:26 IST
YSRCP Plenary 2022
  • whatsapp icon

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న ప్ర‌చారం నేప‌ధ్యంలో జ‌రిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి) ప్లీన‌రీ స‌మావేశాలు ఏ మేర‌కు లాభిస్తాయ‌నే అంశంపై చ‌ర్చ సాగుతోంది. రెండు రోజుల‌పాటు ఘ‌నంగా జ‌రిగిన పార్టీ ప్లీన‌రీ లో మహిళా సాధికారత, విద్య, డిబిటి పథకాలు, ఆరోగ్యం, పరిపాలన-పారదర్శకత వంటి ప‌లు తీర్మానాలను ఆమోదించింది.

మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీల‌లో 95 శాతం త‌మ మూడేళ్ళ పాల‌న‌లో అమ‌లు చేశామ‌ని పార్టీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌ల సంక్షేమం కోసం మ‌రింత ప‌ట్టుద‌ల‌గా, చిత్త‌శుద్ధితో కృషి చేస్తామ‌ని చెప్పారు. ఈ స‌మావేశాల‌కు అతి భారీగా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు హాజ‌ర‌య్యారు. పార్టీ స్థాపించిన 11యేళ్ళ‌లో ఎంతో సంద‌డిగా అట్ట‌హాసంగా ఉత్సాహంగా జ‌రిగింది. పార్టీ శ్రేణులంతా సంతోషించారు.

జ‌న‌స‌మీక‌ర‌ణే గీటురాయా..?

ఇంత భారీగా జ‌రిగిన స‌మావేశాల వ‌ల్ల పార్టీకి ఎంత మైలేజీ వ‌చ్చింది..దానిని ఎలా లెక్కిస్తారు.. దేని ప్రాతిప‌దిక‌న ఈ స‌మావేశాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అంచ‌నా వేస్తార‌నేది సామాన్యుడి మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌. జ‌నాన్ని చూసి విజ‌య‌వంతం అనుకుంటే దానిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోన‌వ‌స‌రం లేదు.

అధికారంలో ఉన్న పార్టీకి ఆ మాత్రం జ‌నం రావ‌డంలో కానీ ఊపు ఉండ‌డంలో కానీ ఏమీ ఆశ్చ‌ర్యం లేదు. విప‌క్ష పార్టీలు నిర్వ‌హించే ఇటువంటి ఏ కార్య‌క్ర‌మాల‌లోనైనా భారీ జ‌న‌సందోహం క‌న‌బ‌డితే ఆలోచించాల్సిన విష‌య‌మే కానీ దానిని పెద్ద‌గా లెక్క‌లోకి తీసుకోలేం. నిరాశ‌లో ఉన్నవారికి అది ఆక్సిజ‌న్ లా ఉప‌యోగ‌ప‌డుతుందే త‌ప్ప క‌ల‌లు సాకారం కాలేవు.

ఎందుకంటే జ‌న‌స‌మీక‌ర‌ణ సామ‌ర్ధ్యం ఈ విష‌యంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. వాహ‌నాలు ఏర్పాటు, జ‌నాల త‌ర‌లింపు, ఇత‌ర ఏర్పాట్ల వంటివి అధికారంలో ఉన్న వారికి ఇది తేలికైన ప‌నే. విప‌క్షాల కార్య‌క్ర‌మాల‌కి అడుగ‌డుగానా అడ్డంకులు ఎదుర‌వ‌డం వ‌ల్ల కొంచెం ఇది క‌ష్టం. జ‌న‌స‌మీక‌ర‌ణ ఆధారంగా బ‌లం పుంజుకున్నామ‌ని పూర్తిగా భావించ‌న‌వ‌స‌రంలేదు.

ఇది కేవ‌లం వాపు మాత్ర‌మే కానీ బ‌లం ఎంత మాత్రం కాద‌ని ఆ త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాలు రుజువు చేశాయి చాలా సంద‌ర్భాల్లో. అందువ‌ల్ల వైసీపీ కూడా ఇంత‌టి జ‌నాన్ని చూసి త‌మ‌కు పూర్తిగా ప్ర‌జామోదం ల‌భించిన‌ట్లేన‌ని భావిస్తే అది భ్ర‌మ మాత్ర‌మేన‌ని అంటున్నారు.

శాశ్వ‌త అధ్య‌క్ష ప‌ద‌వి పైనా..

వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ ను ఎన్నుకోవ‌డం పార్టీకి సంబ‌వంధించిన విష‌య‌మే అయినా అది చ‌ట్ట‌బ‌ద్ద‌మేనా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ద్ర‌విడ‌, క‌మ్యూనిస్టు పార్టీల్లో అధ్య‌క్ష స్థానం చాలా కాలం ఉండేది కాదు. అయితే ద్ర‌విడ పార్టీల‌కు వ‌చ్చే స‌రికి తొలినాళ్ళ‌లో అధ్య‌క్షుడు అనే 'భావ‌న' మాత్ర‌మే ఉండేది త‌ప్పప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలోనే కార్య‌క‌లాపాలు జ‌రిగేవి.

చాలాకాలం త‌ర్వాత అది క‌రుణానిధి హ‌యాంలో ఈ అధ్య‌క్షుడు అనే ఒర‌వ‌డి ప్రారంభ‌మైంది. పైగా శాశ్వ‌త అధ్య‌క్షుడు అంటే ఏ పార్టీకైనా ఏక‌వ్య‌క్తి పూజా విధానం పెచ్చుమీర‌డ‌మేన‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే చాలా పార్టీల‌లో ఈ వ్య‌క్తి పూజా విధానం పరాకాష్ట‌కు చేరిన విష‌యాల‌ను చూస్తున్నాం. ఇప్పుడు మ‌ళ్ళీ వైసిపి దీనిని ప్ర‌త్యేకంగా ఒక తెర‌పైకి తేవ‌డం ఎన్నిక‌ల సంఘం నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మంటున్నారు. ఈ శాశ్వ‌త అధ్య‌క్షుడి విష‌యం కూడా విమ‌ర్శ‌ల‌పాల‌వుతోంది.

హామీలు, ప‌థ‌కాలు

ఇక మూడేళ్ళ‌లో 95 శాతం హామీల అమ‌లులో కూడా ప్ర‌జ‌లు ఎంత మేర‌కు సంతోషంగా ఉన్నార‌నేది సందేహ‌మే. పెన్ష‌న‌ర్ల విష‌యంలో ఆ మ‌ధ్య కొంత‌మంది అర్హులైన వారిని కూడా తొల‌గించార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చినా వాటిని త‌ర్వాత స‌రిదిద్ద‌కుంది ప్ర‌భుత్వం. ఆ త‌ర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండానే వారికి పెన్ష‌న్లు అందుతున్నాయి. ఆ విష‌యంలో ప్ర‌స్తుతం విమ‌ర్శ‌లు లేవు. ఆటోవాలాల‌కు ఇస్తున్న ప‌దివేలు, అమ్మ ఒడి వంటి ప‌థ‌కాలు విష‌యంలో కొత్త‌ల్లో ఉత్సాహంగానే ఉన్నా ఆ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం సంతృప్తి క‌న‌బ‌డ‌డంలేదు. ఒక‌చేత్తో ఇచ్చి మ‌రో చేత్తో లాక్కున్న‌టు ఉంది ప‌రిస్థితి అని ఆటోవాలాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. అందుకు రోడ్ల దుస్థితి, ఇంధ‌న ధ‌ర‌లు, ఎడాపెడా చలానాల‌ను కార‌ణాలుగా చూపుతున్నారు.

ఇక అమ్మ ఒడి విష‌యంలో కూడా విద్యార్ధుల హాజ‌రుకు ఈ ప‌థ‌కాన్ని లింకు చేసి అమ‌లు చేస్తామ‌న‌డంలో కూడా అసంతృప్తి చోటు చేసుకుంది. విద్యార్థుల‌కు ల్యాప్ టాప్ లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించి ట్యాబ్ ల‌కే ప‌రిమిత‌మ‌వ‌డం, నిరుపేద‌ల‌కు గృహ‌నిర్మాణాల విష‌యంలో కూడా తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి. అస‌లు స్థ‌లం లేని వారికి ఉద్దేసించిన ఈ ప‌థ‌కంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌బ్ధిపొందిన వారిలో అత్య‌ధికుల‌కు సొంతంగా ఇళ్ళు ఉన్నవారెంద‌రో ఉన్నార‌ని విమ‌ర్శ‌లు లెక్క‌కు మించి వ‌స్తున్నాయి. అయితే ఇందుకు ప్ర‌భుత్వం పూర్తిగా న‌మ్మిన వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌తో పాటు స్థానికంగా ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన ఛోటా మోటా నాయ‌కుల పాత్ర కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌ల భావ‌న‌. ఇంచుమించు అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌న్నింటిలో ఇలా ఎంతో కొంత అసంతృప్తి క‌న‌బ‌డుతోంది.

అలాగే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కార్పోరేష‌న్ల విష‌యంలో కూడా ఆయా సామాజిక వ‌ర్గాలు పెద్ద‌గా లాభ‌ప‌డింది లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వలంటీర్ల‌కు స్థానికంగా ఉండే నోరుగ‌ల కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు మ‌ధ్య పొస‌గ‌డంలేద‌ని ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాలు చెబుతున్నాయి. దీనివ‌ల్ల స‌మ‌న్వ‌యం కొర‌వ‌డి ఆధిప‌త్య ధోర‌ణి పెర‌గ‌డం వ‌ల్ల పార్టీలో అసంతృప్తవాదులు పెరుగుతున్నారు.

ప‌స‌లేని ప్ర‌సంగాలు..

క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితులు ఇలా ఉండ‌గా ప్లీన‌రీ విజ‌య‌వంతం అయింది. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఊడ్చేస్తాం..పొడిచేస్తాం అంటూ జ‌బ్బ‌లు చ‌రుచుకోవ‌డంలో అర్ధం లేద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. ఇక ప్లీన‌రీలో కూడా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌ప్ప, (ఆయ‌న కూడా పార్టీ పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేసినా కొంత‌మేర‌కు అదుపులోనే ఉన్నారంటున్నారు) మాట్లాడిన ప్ర‌తి వారూ రెండే అంశాల‌పై దృష్టి సారించారు త‌ప్ప మిగ‌తా విష‌యాలు ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఒక‌టి జ‌గ‌న్ ను కీర్తించ‌డం, విప‌క్ష పార్టీల‌ను విమ‌ర్శించ‌డం. ఈ కీర్త‌న‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు కూడా హ‌ద్దు దాటి వెగ‌టు పుట్టించాయ‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఒక మంత్రి మాట్లాడుతున్న సంద‌ర్భంగా విమ‌ర్శ‌లు మితి మీరుతుండ‌డంతో ముఖ్య‌మంత్రే ఇక చాల‌న్న‌ట్టు సూచించాల్సి వ‌చ్చింద‌ని పార్టీ శ్రేణుల్లో విన‌బ‌డుతోంది. పార్టీ ప‌రంగా ముఖ్యంగా మంత్రులు కూడా త‌మ శాఖ‌లు సాధించిన ప్ర‌గ‌తి గానీ , ప్ర‌జ‌ల‌కు ఏ విధంగా ప్ర‌యోజ‌నం చేకూర్చ‌గ‌లిగామ‌నిగానీ ఏ ఒక్క మంత్రి కూడా వివ‌రించ‌లేదు.

అంతా జ‌గ‌న్ స‌ర్వాంత‌ర్యామి అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌ని, ఇది పార్టీకి రాబోయే ఎన్నిక‌ల్లో ఎలా ఉప‌క‌రిస్తుంది..జ‌గ‌న్ ఒక్క‌డే అంద‌ర్నీ గెలిపించ‌లేడుక‌దా అన్నీ ఆయ‌నే చేయ‌లేడు క‌దా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

అంతిమంగా మంచి అయినా చెడు అయినా ఫ‌లితం జ‌గ‌న్ కే ద‌ఖ‌లు ప‌డుతుంది కాబ‌ట్టి నాయ‌కులు మ‌రింత బాధ్య‌త‌తో మెల‌గాల‌న్న స్పృహ కొర‌వ‌డింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎక్కువ విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మైన ప్లీన‌రీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి)కి గానీ జ‌గ‌న్ కు కానీ ఏ విధంగా లాభ‌ప‌డ‌గ‌ల‌ద‌నే అభిప్రాయాలూ విన‌ప‌డుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News