కాంగ్రెస్‌కి బుద్ధిలేదు.. బీజేపీకి సిగ్గులేదు
2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు 13, కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు 17. కానీ అక్కడ బీజేపీయే అధికారం చేపట్టింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు గోవాలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి. వాస్తవానికి అక్కడ పార్టీ బలంగానే ఉంది, కానీ నాయకులే అతి బలహీనంగా ఉన్నారు.
2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు 13, కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు 17. కానీ అక్కడ బీజేపీయే అధికారం చేపట్టింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు గోవాలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి. వాస్తవానికి అక్కడ పార్టీ బలంగానే ఉంది, కానీ నాయకులే అతి బలహీనంగా ఉన్నారు. గాలి ఎటువైపు వీస్తే అటు వెళ్లిపోతారు. 2019లో ఏకంగా 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు. 2022 అసెంబ్లీ ఎన్నికలనాటికి కాంగ్రెస్ బలం బీజేపీకి బాగా కలిసొచ్చి 21మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ స్కోర్ 11 దగ్గర ఆగింది. ఈ 11లో కూడా ఇప్పుడు 8మంది బీజేపీవైపు చూస్తున్నారంటే ఏమనుకోవాలి. పదే పదే ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడుతున్నా.. ఆ ఎమ్మెల్యేలను పార్టీ ఎందుకు కాపాడుకోలేకపోతోంది..?
దొంగల చేతికే తాళాలు..
మాజీ ముఖ్యమంత్రి దిగంబర కామత్, గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మేఖేల్ లొబో.. ఈ ఇద్దరే ఈ సంక్షోభానికి మూలకారణం అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయేలా కనిపించింది. దీంతో వారిద్దరిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ను విచ్ఛిన్నం చేసేందుకు అగ్రనాయకులిద్దరూ కలసి కుట్ర చేశారంటూ ఏఐసీసీ ఇన్ చార్జ్ దినేష్ గుండూరావు ఆరోపించారు. గోవా కాంగ్రెస్ కి నాయకత్వం వహిస్తున్న వీరిద్దరూ బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ ని సర్వనాశనం చేసేందుకు పథక రచన చేశారు.
మాకే పాపం తెలియదు..
అయితే దిగంబర కామత్, లోబో ఇద్దరూ తమకే పాపం తెలియదంటున్నారు. తామిద్దరం కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నామని వారు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. సీఎల్పీ లీడర్ గా ఉన్న లోబో.. స్వచ్ఛందంగా ఆ పదవిని వదులుకుంటున్నట్టు ప్రకటించారు. దాన్ని సీనియర్ నేత దిగంబర కామత్ కి ఇవ్వాలని సూచించారు. లేదా మరో సమర్థుడికి కట్టబెట్టాలన్నారు, తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే, కాంగ్రెస్ తోపాటే ఉంటానన్నారు లోబో. తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు వారిద్దరూ కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.
పదే పదే ఎందుకిలా..?
పదే పదే పార్టీని బలిచేసి ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయిస్తున్నా అధిష్టానం పెద్దగా గోవా రాజకీయాలపై దృష్టిపెట్టలేదని తెలుస్తోంది. అందుకే ఎన్నికల ఏడాదిలోనే ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీ అయ్యారు. సాక్షాత్తూ సీఎల్పీ లీడర్ కూడా పార్టీ మారబోతున్నాడనే ఆరోపణలు వచ్చాయంటే, అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. అయితే చివరి నిముషంలో ఈ కుట్రలు తెలిశాయి కాబట్టి ఆరుగురు ఎమ్మెల్యేలయినా కాంగ్రెస్ కి తిరిగి టచ్ లోకి వచ్చారు. అజ్ఞాతంలోకి వెళ్లిన మైఖేల్ లోబో, దిగంబర కామత్, కేదార్ నాయక్, రాజేష్ ఫల్దేశాయి, డెలిలా లోబో.. పైనే ఇప్పుడు అందరికీ అనుమానాలున్నాయి. వారు కూడా పార్టీతోనే ఉన్నామని ప్రకటిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం నమ్మేలా లేదు. అందుకే కామత్, లోబోను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.
విచిత్రం ఏంటంటే.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభ్యర్థులంతా గుడి, చర్చి, మసీదులో పార్టీకి తమ విధేయులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఫిరాయింపుల వ్యతిరేక అఫిడవిట్ పై కూడా సంతకాలు కూడా చేశారు. కానీ నెలల వ్యవధిలోనే ఆ ఒట్టుతీసి గట్టునపెట్టేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ముకుల్ వాస్నిక్ ని కాంగ్రెస్ అధిష్టానం ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దించింది. ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.