ఏపీ- కానిస్టేబుల్‌ వ్యవహారంలో ఆంధ్రజ్యోతి కొత్త వాదన

గత నెల 14న సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ సేవ్ ఏపీ పోలీస్ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి పోలీసులను ఆదుకోవాలని ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
Update:2022-07-12 06:08 IST

గత నెల 14న సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ సేవ్ ఏపీ పోలీస్ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి పోలీసులను ఆదుకోవాలని ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు. క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో ఈ చర్యను ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అతడి వెనుక ఎవరున్నారన్న దానిపైనా పోలీసు ఆరా తీస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సదరు కానిస్టేబుల్ ప్రకాష్ పై అనంతపురం స్పందన కార్యక్రమంలో ఒక ఫిర్యాదు నమోదయింది. గార్లదిన్నెకు చెందిన ఒక వ్యక్తి కానిస్టేబుల్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు ఇచ్చారు. నాలుగేళ్ల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రకాష్ ఆమెతో పరిచయం పెంచుకున్నారని సదరు వ్యక్తి తన ఫిర్యాదులు వివరించారు.

ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని నాలుగేళ్లుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారని తనను చంపేసి ఆస్తి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సదరు వ్యక్తి స్పందన కార్యక్రమంలో కానిస్టేబుల్ ప్రకాష్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు ఇచ్చారు. ఇలా గార్లదిన్నెకు చెందిన ఒక వ్యక్తి కానిస్టేబుల్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు ఇచ్చిన సమయంలోనే.. ఆంధ్రజ్యోతి పత్రిక కానిస్టేబుల్‌కు అనుకూలంగా మరో రకమైన కథనాన్ని ప్రచురించింది.

ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించేందుకు అధికారులు పావులు కదుపుతున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ఆరోపిస్తోంది. ఇటీవల మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయభేరీ కార్యక్రమం నిర్వహించిన సమయంలో సదరు కానిస్టేబుల్ ప్రకాష్ కొందరు కానిస్టేబుళ్ల సంతకాలతో ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. అయితే ఆ వినతిపత్రంలో ఇతర కానిస్టేబుళ్ల సంతకాలను ప్రకాష్ ఫోర్జరీ చేశారు అన్న ఆరోపణలతో కేసు నమోదు అయింది.

తనకు తెలియకుండా తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడంటూ ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఇదంతా కానిస్టేబుల్ ప్రకాష్ ను శాశ్వతంగా తొలగించేందుకే చేస్తున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ఆరోపించింది. కానిస్టేబుల్ ప్రకాష్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందుకు వస్తున్నారని సస్పెండ్ అయిన ప్రకాష్‌కు బాసటగా అనేకమంది పోలీసులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు కూడా పంపి ఆదుకుంటున్నారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక రాసుకొచ్చింది.

Tags:    
Advertisement

Similar News