రెండో టీ20లో టీమ్ ఇండియా జయభేరి.. సిరీస్ కైవసం

టీమ్ ఇండియా కుర్రాళ్లు ఇంగ్లాండ్ గడ్డపై చెలరేగిపోతున్నారు. సినియర్, జూనియర్ల మేళవింపుతో పటిష్టంగా ఉన్న భారత జట్టు తొలి టీ20ని గెలచుకున్న సంగతి తెలిసిందే. ఇక బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టీ20లో కూడా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, చాహల్ చెలరేగడంతో ఇంగ్లాండ్ జట్టు ఛేదన చేయలేక కుప్పకూలింది. దీంతో భారత జట్టు 49 పరుగుల తేడాతో రెండో టీ20 గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం […]

Advertisement
Update:2022-07-10 03:42 IST

టీమ్ ఇండియా కుర్రాళ్లు ఇంగ్లాండ్ గడ్డపై చెలరేగిపోతున్నారు. సినియర్, జూనియర్ల మేళవింపుతో పటిష్టంగా ఉన్న భారత జట్టు తొలి టీ20ని గెలచుకున్న సంగతి తెలిసిందే. ఇక బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టీ20లో కూడా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, చాహల్ చెలరేగడంతో ఇంగ్లాండ్ జట్టు ఛేదన చేయలేక కుప్పకూలింది. దీంతో భారత జట్టు 49 పరుగుల తేడాతో రెండో టీ20 గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్నది.

భారత జట్టు నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు తొలి బంతితోనే భువి షాక్ ఇచ్చాడు. ప్రమాదకరమైన జేసన్ రాయ్ (0) ని తొలి బంతికి అవుట్ చేసిన భువీ, ఆ తర్వాత ఓవర్లో మరో ఓపెనర్ జాస్ బట్లర్ (4)ను పెవీలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. డేవిడ్ మలన్ (19), లియామ్ లివింగ్ స్టన్ (15) కాసేపు క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే బుమ్రా, చాహల్ వీరిని ఔట్ చేశాడు. హారీ బ్రూక్ (8), సామ్ కర్రన్ (2) కూడా విఫలమయ్యారు. దీంతో 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

మొయిన్ అలీ, డేవిడ్ విల్లే జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. దూకుడుగా ఆడుతూ స్కోర్ వేగం పెంచారు. అయితే మొయిన్ అలీ (35) హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేక పోయారు. డేవిడ్ విల్లే (33) చివరి వరకు బ్యాటింగ్ చేసినా.. భారీ లక్ష్యం కారణంగా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ జట్టు కేవలం 19 ఓవర్లలోనే 121 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమ్ ఇండియా 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు సరైన ఆరంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే రెండు ఓవర్ల వ్యవధిలో రోహిత్ (31), రిషబ్ (26), కోహ్లీ (1) పెవీలియన్ చేరడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. సూర్యకుమార్ (15), పాండ్యా (12) కాసేపు ధాటిగా ఆడి రన్ రేట్ తగ్గకుండా కాపాడారు. అయితే క్రిస్ జోర్డాన్ వీరిద్దరినీ రెండు బంతుల వ్యవధిలో పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా (46) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ చివరి వరకు నిలిచాడు. అతడికి దినేశ్ కార్తీక్ (12), హర్షల్ పటేల్ (13) తోడవడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నామమాత్రమేన మూడో టీ20 ఆదివారం నాటింగ్‌హామ్‌లో జరుగనున్నది.

ఈ మ్యాచ్‌తో మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ వరుసగా 19వ విజయం నమోదు చేశాడు. భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై రెండో సారి టీ20 సిరీస్ గెలుచుకున్నది. 2018లో తొలి సారి కోహ్లీ కెప్టెన్సీలో టీ20 సిరీస్ గెలవగా.. ఈ సారి మరో మ్యాచ్ ఉండగానే రోహిత్ కెప్టెన్సీలో టీ20 సిరీస్ నెగ్గింది. మూడో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News