ఫ్లెక్సీలపై రూ.120 కోట్ల ఫైన్ వేస్తే.. వసూలైంది రూ.12 కోట్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడేళ్లుగా అనధికార ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై నిషేధం అమలవుతోంది. నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులు, సంస్థలపై ఇప్పటి వరకు రూ. 120 కోట్ల చలానాలను విధించారు. ఇందులో ప్రైవేటు కంపెనీలతో పాటు రాజకీయ పార్టీలకు కూడా చలానాలు పంపారు. కానీ ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ కేవలం రూ. 12 కోట్ల ఫైన్లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై ఫైన్లు వేసినా.. చాలా మంది వాటిని చెల్లించడానికి ముందుకు రావడం లేదు. వ్యాపార సంస్థలు […]

Advertisement
Update:2022-07-09 03:49 IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడేళ్లుగా అనధికార ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై నిషేధం అమలవుతోంది. నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులు, సంస్థలపై ఇప్పటి వరకు రూ. 120 కోట్ల చలానాలను విధించారు. ఇందులో ప్రైవేటు కంపెనీలతో పాటు రాజకీయ పార్టీలకు కూడా చలానాలు పంపారు. కానీ ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ కేవలం రూ. 12 కోట్ల ఫైన్లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై ఫైన్లు వేసినా.. చాలా మంది వాటిని చెల్లించడానికి ముందుకు రావడం లేదు.

వ్యాపార సంస్థలు పెండింగ్ చలానాలు చెల్లించకపోతే వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అలాగే వాటి ట్రేడ్ లైసెన్సులను సస్పెండ్ చేసి, వ్యాపారాన్ని సీజ్ చేసే అధికారం కూడా ఉంది. కానీ జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఆ వైపుగా దృష్టి పెట్టకపోవడంతోనే చలానాలు వసూలు కావడం లేదని తెలుస్తుంది. గత మూడేళ్లుగా జరిమానాల బాకీలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం బల్దియా తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కుంటుండటంతో ఈ జరిమానాల వసూలుకు నడుం బిగించింది.

గ్రేటర్‌లో ఫ్లెక్సీల బ్యాన్ 1996లోనే జీఓ నెంబర్ 1163 ద్వారా అమలులోకి తీసుకొని వచ్చారు. కానీ వాటిపై సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో సంపూర్ణంగా అమలు కాలేదు. అయితే 2019లో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు అందుకోసం ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి భారీగా చలానాలు విధించడం మొదలు పెట్టారు. కానీ, వాటిని వసూలు చేయ‌డంలో మాత్రం విఫలమయ్యారు.

రాజకీయ పార్టీలే ఎక్కువ..
గ్రేటర్ పరిధిలో రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన అనధికార ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమయంలో ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్స్, ఫ్లెక్సీలపై బీజేపీ ఫిర్యాదు చేసింది. అలాగే ఇటీవల జరిగిన విజయ సంకల్ప సభ సమయంలో బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. గ్రేట‌ర్‌ పరిధిలో 2019 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రూ. 120 కోట్ల విలువైన 2,01,118 చలానాలు రాశారు. కానీ వసూలైంది మాత్రం రూ. 12 కోట్లు మాత్రమే. కల్పన డిజిటల్స్, బ్రైట్ డిజిటల్స్, వర్ణా యాడ్స్, మమత ప్రింటర్స్, ప్రింట్‌స్పాట్ వంటి యాడ్ ఏజెన్సీలపై భారీగా జరిమానాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇక టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కూడా అనధికార ఫెక్సీల చలాన్లు ఉన్నాయి. నగరంలో ఏర్పాటు చేసిన చాలా ఫ్లెక్సీలపై సరైన వివరాలు లేకుండా పోవడంతో ఎవరికి చలానా వేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఈ చలానాలపై రాబిన్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీకి ఆర్టీఐ దరఖాస్తు చేశారు.

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఏడాది ఏర్పాటు చేసిన అనధికార హోర్డింగ్స్‌పై ఫిబ్రవరి 16, 17న 269 చలానాలు వేసినట్లు పేర్కొన్నారు. సిటీలోని పలువురు టీఆర్ఎస్ లీడర్లకు రూ. 20 లక్షల విలువైన జరిమానా విధించినట్లు ఆర్టీఐలో జీహెచ్ఎంసీ వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News