సోనియాకే భయపడలేదు.. దుష్టచతుష్టయానికి భయపడతాడా..?
“సోనియా గాంధీనే గడగడలాడించిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబుతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా, 16 నెలలు జైలులో పెట్టినా అడుగు వెనక్కు తగ్గలేదు. జగన్ అంటే తగ్గేదేలే. అలాంటి వ్యక్తి ఈ దుష్టచతుష్టయానికి భయపడతాడా?” అంటూ పేర్ని నాని ప్లీనరీలో కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం అనే అంశంపై పేర్ని నాని ప్రసంగించారు. ‘దుష్టచతుష్టయం’లో మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ […]
“సోనియా గాంధీనే గడగడలాడించిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబుతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా, 16 నెలలు జైలులో పెట్టినా అడుగు వెనక్కు తగ్గలేదు.
జగన్ అంటే తగ్గేదేలే. అలాంటి వ్యక్తి ఈ దుష్టచతుష్టయానికి భయపడతాడా?” అంటూ పేర్ని నాని ప్లీనరీలో కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం అనే అంశంపై పేర్ని నాని ప్రసంగించారు. ‘దుష్టచతుష్టయం’లో మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ టీవీ5 నాయుడు అని వివరించారు నాని. ‘మనోడు’ మాత్రమే అధికారంలో ఉండాలనే ఉన్మాద ప్రయత్నం ఆ నలుగురిది అని అన్నారు.
దానికోసం వారు ఎంతకైనా తెగిస్తారని, ప్రతి రోజూ విషపు రాతలతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. దుష్టచతుష్టయం అంతా కలిసి మీడియా వ్యవస్థను దారుణంగా తయారు చేశారని అన్నారు నాని.
రామోజీరావు నమ్మక ద్రోహి అని ఎన్టీఆర్ ఆనాడే అన్నారని గుర్తు చేశారు పేర్ని నాని. ఔటర్ రింగ్ రోడ్ వేయించానని చంద్రబాబు చంకలు గుద్దుకుంటుంటారని, కానీ దానికోసం భూ సేకరణ వైఎస్ హయాంలో జరిగిందని చెప్పారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరని, డబ్బు కోసం రాధాకృష్ణ చేయని దుర్మార్గాలు లేవని చెప్పారు.
కేవలం ఏపీని టార్గెట్ చేసుకునే టీడీపీ మీడియా వార్తలు రాస్తుంటుందని, నిత్యావసరాల రేట్లను తెలంగాణతో ఎప్పుడూ పోల్చి చూపించలేదన్నారు. ఏపీ ప్రజలపై ప్రేమ ఉంటే చంద్రబాబు హెరిటేజ్ ద్వారా తక్కువ ధరలకే వస్తువులు అమ్మాలని సూచించారు. తాను కొట్టించుకోవడమే కాకుండా పక్కనున్నవాళ్ళను కూడా కొట్టించే విలన్ లాగా చంద్రబాబు తయారయ్యాడని ఎద్దేవా చేశారు నాని.
ఆ అసంతృప్తి ఉందా..
మంత్రి పదవి కోల్పోయిన తర్వాత చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు, పేర్ని నాని కూడా అలాగే ఉన్నారనే ప్రచారం జరిగింది. ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. తనలాంటి వారు వస్తుంటారు, పోతుంటారు, కానీ కార్యకర్తలంతా సీఎం జగన్ కోసమే పనిచేయాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం విశేషం. పార్టీలో ఎవరూ శాశ్వతం కాదని, జెండా మోసే కార్యకర్తలే శాశ్వతం అని అన్నారు.
సీఎం జగన్ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ఇంటింటికి తిరిగి ప్రజలకు పథకాల ఫలాలు అందాయా, లేదా అని ఆరా తీయాలని చెప్పారు పేర్ని నాని. పథకాలు రాకపోతే బాధ్యత వహించి సరిదిద్దాలని సూచించారు. సింగిల్ గా వచ్చి జగన్ ని ఏమీ చేయలేమని తెలిసే.. చంద్రబాబు, పవన్ కట్టకట్టుకుని వస్తున్నారని, వారందర్నీ అలాగే కట్టకట్టి విసిరేయాలని సూచించారు పేర్ని నాని.