వలంటీర్లు బచ్చాగాళ్లు – మంత్రి దాడిశెట్టి రాజా

ప్లీనరీ సమావేశాలు అంటే కేవలం పార్టీ నాయకులు మాత్రమే ఉంటారనుకుంటున్నారో, లేక ఈలలు, చప్పట్లతో కాస్త ఉత్సాహం ఎక్కువై మనసులో మాట బయటపెడుతున్నారో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో గ్రామ, వార్డు వలంటీర్లపై మంత్రులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా కాకినాడలో జరిగిన ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వలంటీర్లు కొంతమంది తమ మాట వినడంలేదంటూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేసిన […]

Advertisement
Update:2022-07-06 01:13 IST

ప్లీనరీ సమావేశాలు అంటే కేవలం పార్టీ నాయకులు మాత్రమే ఉంటారనుకుంటున్నారో, లేక ఈలలు, చప్పట్లతో కాస్త ఉత్సాహం ఎక్కువై మనసులో మాట బయటపెడుతున్నారో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో గ్రామ, వార్డు వలంటీర్లపై మంత్రులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

తాజాగా కాకినాడలో జరిగిన ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వలంటీర్లు కొంతమంది తమ మాట వినడంలేదంటూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేసిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు.

వలంటీర్లు మీరు పెట్టినవాళ్లే కదా, మీరు చెప్పినట్టు వినకపోయినా, పని చేయకపోయినా వారిని తీసేయండి అని ప్లీనరీ వేదికపై తేల్చి చెప్పారు. దీంతో సభా ప్రాంగణం అంతా ఈలలు, చప్పట్లతో మారుమోగిపోయింది. ఇంకేముంది మంత్రికి ఇంకాస్త ఉత్సాహం వచ్చింది.

అసలు వలంటీర్లు ఎవరు చిన్న బచ్చాగాళ్లు, వాళ్లతో మీకు సమస్య ఏంటి, నచ్చకపోతే తీసేద్దాం అనేశారు. సచివాలయాలను కార్యకర్తలు కంట్రోల్‌ లోకి తీసుకుని నడిపించాలని, మీకు ఎవరూ అడ్డు చెప్పరంటూ సూచించారు మంత్రి.

ఇటీవల నెల్లూరు జిల్లా ప్లీనరీ సమావేశంలో కూడా మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పార్టీకి సమాచారం చేరవేసే సైనికులు అని వ్యాఖ్యానించారాయన. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాలంటీర్లను తీసేసి, కొత్తవారిని తీసుకుంటామని, అదంతా మన చేతిలో పనే కదా అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు అంబటి. కార్యకర్తలు, నాయకులలో ధైర్యం నింపేందుకు మంత్రులు చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

సీఎం జగన్ మనసులో ఏముంది..?
వాలంటీర్ వ్యవస్థ అనే వినూత్న ఆలోచనతో సీఎం జగన్ చేసిన ప్రయోగం మంచి సత్ఫలితాలనే ఇస్తోంది. ప్రతి నెలా ఒకటో తేదీ వలంటీర్లు ఠంచనుగా సామాజిక పింఛన్ ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు.

వివిధ పథకాల వివరాలను ప్రజలకు చేరవేస్తున్నారు, వారికి పథకాల ఫలితాలు అందేందుకు తమవంతు సాయం చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రజలు, ప్రభుత్వం, సచివాలయాల మధ్య వారధులుగా ఉన్నారు వలంటీర్లు. 5వేల రూపాయల నామమాత్రపు పారితోషికంతో వారు పనిచేస్తున్నారు.

వలంటీర్లు సమకాలీన పరిస్థితులపై కూడా అవగాహన పెంచుకోవాలంటూ ఇటీవల వారికి న్యూస్ పేపర్ అలవెన్స్ కూడా అందజేసేలా ఆదేశాలిచ్చారు సీఎం జగన్. ముఖ్యమంత్రి దృష్టిలో వలంటీర్ల వ్యవస్థ అత్యున్నతమైనది, కానీ మంత్రులు, నాయకులు మాత్రం వారిని బచ్చాగాళ్లు, తాము పని ఇచ్చి పెట్టుకున్న వారిగా చూస్తున్నారు.

ఈ పద్ధతే కొనసాగితే.. ఏ వలంటీర్లయితే పార్టీకి బలం అనుకుంటున్నారో, ఆ వలంటీర్ వ్యవస్థే వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. పరిస్థితి అంతవరకు రాకుండా ఉండాలంటే, కనీసం మంత్రులు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులయినా వలంటీర్లను చులకనగా చూడటం మానుకోవాలి.

Tags:    
Advertisement

Similar News