బీజేపీకి దూరమవుతున్న జనసేన..!
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా భీమవరంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమవుతోంది. గత కొంతకాలంగా బీజేపీ పట్ల మారిన ఆయన వైఖరి కారణంగానే మోడీ సభకు హాజరుకాలేదా..? లేదా బీజేపీతో దూరం జరగాలనే ఆలోచనతోనా..? లేక మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా..? అనే విషయాలపై చర్చ జరుగుతోంది. నిన్నటి వరకూ విజయవాడలోనే ఉన్న పవన్ నేడు హైదరాబాద్ వెళ్ళడం వెనక ఆయన ఆంతర్యం ఏమిటనే […]
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా భీమవరంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమవుతోంది. గత కొంతకాలంగా బీజేపీ పట్ల మారిన ఆయన వైఖరి కారణంగానే మోడీ సభకు హాజరుకాలేదా..? లేదా బీజేపీతో దూరం జరగాలనే ఆలోచనతోనా..? లేక మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా..? అనే విషయాలపై చర్చ జరుగుతోంది. నిన్నటి వరకూ విజయవాడలోనే ఉన్న పవన్ నేడు హైదరాబాద్ వెళ్ళడం వెనక ఆయన ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అందుకే గైర్హాజరయ్యారా..?
అల్లూరి 125 జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజకీయ పార్టీలన్నింటికీ ఆహ్వానాలు పంపారు. కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా ఆహ్వానం అందింది. అయినా ఈ సభకు ఆయన గైర్హాజరయ్యారు. ప్రధాని మోడీ పాల్గొన్న ఈ సభలో ముఖ్యమంత్రి జగన్ కూడా పాల్గొన్నారు. వేదికపై చిరంజీవి ఆసీనులవ్వడంతో పాటు ఆయనకు ప్రసంగించే అవకాశాన్ని కూడా కల్పించారు. మిత్రపక్షమని చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వేదికపై అవకాశం లేకపోయింది. ఒకవేళ హాజరైతే వీవీఐపీల గ్యాలరీలోనే వేదిక ఎదురుగా కూర్చోవాల్సి ఉండేది. కారణాలు ఏమైనప్పటికీ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ప్రొటోకాల్ పేరుతో కనీసం లోపలికి కూడా అనుమతించని విషయాన్ని జనసైనికులు గుర్తు చేస్తున్నారు.
ఏపీలో వైసీపీని గద్దె దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ జగన్ పాలనపై నిత్యం విమర్శలు చేస్తూ ఉంటారు పవన్ కల్యాణ్. ఇప్పుడు సీఎం జగన్ తో వేదిక పంచుకోవడం ఇష్టంలేక రాలేదనే వాదన వినిపిస్తోంది. అయినా బీజేపీ రాష్ట్ర నాయకులతో పనిలేదు కేంద్ర నాయకత్వంతోనే సంబంధాలు అన్నట్టు పవన్ వ్యవహరిస్తుంటారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు కలిసే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు. అయితే ప్రధాని మోడీ, అమిత్ షా తో కలిసేందుకు ఆ మధ్య ఢిల్లీ వెళ్ళి ప్రయత్నించినా.. కనీసం అపాయింట్‌మెంట్ దొరకలేదు. అది కొంత అసంతృప్తిగా ఉండొచ్చు. ఆ మధ్యలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రాజమండ్రిలో పర్యటించి సభలో ప్రసంగించారు. అప్పుడు కూడా పవన్ కల్యాణ్ ఆ సభకు హాజరుకాలేదు. అయితే ఆయనకు ఆహ్వానం అందలేదని జనసైనికులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.
అదే సందర్భంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుస్తూ పర్యటనలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలనుకున్న తన కోరికను బాహాటంగానే వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుందని ఎదురు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఓటు చీలిపోకుండా ఉండేందుకు మూడు ఆప్షన్లు ప్రకటించారు. బీజేపీ, టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, బీజేపీ లేకుండా టీడీపీతో కలిసి పోటీ చేయడం.. ఇక జనసేన ఒంటరిగానే బరిలోకి దిగడం. వీటిపై బీజేపీ ఎటూ స్పందించకపోవడం కూడా పవన్ ను ఆలోచనలో పడేసింది. బీజేపీ ఎటూ తేల్చకుండా సాచివేయడంతో పవన్ అసహనంగా ఉన్నారని జనసైనికుల్లో వినిపిస్తోంది. తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించకపోవడం కూడా పవన్ లో అసంతృప్తిని కలిగిస్తోందంటున్నారు.
బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తోంది..?
పవన్ ఆప్షన్స్ పై బీజేపీ ఎందుకు సీరియస్ గా స్పందించడంలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంపై కమలం పార్టీ ఇప్పుడే సీరియస్ గా ఆలోచించడం లేదనేది స్పష్టం. ఎందుకంటే ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలం ఎంతో బాగా తెలుసు. అందుకనే 2029 ఎన్నికలే మా టార్గెట్ అంటూ చెబుతున్నారు. బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యం. ఏ పార్టీతో కలిసి వెళితే రాష్ట్రంలో తమకు కలిసి వస్తుంది అనేది బీజేపీ ఆలోచన. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే పార్లమెంటు సభ్యుల బలం ఉండాలి. పరిస్థితుల్లో ఏమైనా తేడాలు వస్తే ఎంపీల మద్దతు అవసరం అవుతుంది. అటువంటప్పుడు రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందనే దానిపైనా ప్రస్తుతం బీజేపీ దృష్టి సారించింది. అందువల్ల వైసీపీతో నడవాలా లేక పవన్ కల్యాణ్ సూచిస్తున్నట్టు టీడీపీ, జనసేనతో కలిసి వెళ్ళాలా..కేవలం జనసేనతో కలిసి వెళ్ళాలా.. ఎటువైపు వెళితే ఎన్ని ఎంపీ సీట్ల మద్దతు వస్తుందనే ఆలోచనతో బీజేపీ ప్రస్తుతానికి ఏమీ తేల్చడం లేదంటున్నారు. జనసేన పై పూర్తి విశ్వాసంతో ఉన్నదా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ప్రజలతోనే నా పొత్తు !
టీడీపీతో కలిస్తే తమతో కలిసి వచ్చేందుకు బీజేపీ ఆసక్తి చూపుతుందా లేదా అనే విషయమై పవన్ కు క్లారిటీ లేదు. చంద్రబాబుతో గత అనుభవాల దృష్ట్యా టీడీపీతో కలిసి బీజేపీ నడుస్తుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. పవన్ ఈ లోపు కౌలు రైతు భరోసా పేరుతో కొన్ని జిల్లాల్లో పర్యటించారు. అప్పటివరకూ కూడా టీడీపీతో పొత్తు విషయంలో సానుకూలంగానే ఉన్నారు. కానీ మహానాడు విజయవంతం అయిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిలో మార్పు గమనించిన పవన్ ఆలోచనలో పడ్డారు. దాంతో సీరియస్ గా తీసుకుని అక్టోబర్ నుంచి బస్ యాత్ర చేయాలని రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు. ఈ సభల సందర్భంగా పవన్ స్వరంలో మార్పు కనిపించింది. తనకు జనంతోనే పొత్తు, ప్రజల మద్దతే తనకు బలం అంటూ పలు ప్రసంగాల్లో చెప్పారు. అంటే పొత్తులపై తాను తొందరపడటంలేదని, ఎవరు కలసి వచ్చినా.. రాకపోయినా.. పర్వాలేదనే భావన వ్యక్తమవుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో భీమవరంలో సోమవారం జరిగిన మోడీ సభకు గైర్హాజరు అవడం ద్వారా బీజేపీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తో దూరం పెరుగుతున్నట్టే కనబడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.