మేకిన్ ఇండియా పెద్ద జోక్
బీజేపీ, ప్రధాని మోడీపై ఉమ్మడి ‘పోరు’ మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఒకే వేదిక మీద ఈ సమర శంఖారావాన్ని పూరించారు. ఈ ఎన్నికలో తనకు కేసీఆర్ నేతృత్వంలోని టీఆరెస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్ చేరుకున్న సిన్హాకు కేసీఆర్ నుంచి ఘన స్వాగతం లభించింది. జలవిహార్ సభలో జరిగిన సభలో మొదట మాట్లాడిన కేసీఆర్.. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా విమర్శించనంటూనే విమర్శలతో చెలరేగిపోయారు. మేకిన్ […]
బీజేపీ, ప్రధాని మోడీపై ఉమ్మడి ‘పోరు’ మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఒకే వేదిక మీద ఈ సమర శంఖారావాన్ని పూరించారు. ఈ ఎన్నికలో తనకు కేసీఆర్ నేతృత్వంలోని టీఆరెస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్ చేరుకున్న సిన్హాకు కేసీఆర్ నుంచి ఘన స్వాగతం లభించింది. జలవిహార్ సభలో జరిగిన సభలో మొదట మాట్లాడిన కేసీఆర్.. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా విమర్శించనంటూనే విమర్శలతో చెలరేగిపోయారు.
మేకిన్ ఇండియా అన్నది పెద్ద జోక్ అని, దేశంనుంచి ఎన్నో పరిశ్రమలు, సంస్థలు తరలిపోయాయని, ఇందుకు మోడీ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. తెలంగాణ గడ్డపై తాము చేసే పోరాటం ఆగదని, విప్లవమే సృష్టిస్తామని గర్జించారు. సుదీర్ఘంగా సాగిన ఆయన ప్రసంగం తరువాత సిన్హా సైతం అదే టోన్ లో మాట్లాడారు.
రాష్ట్రపతి ఎన్నిక అన్నది వ్యక్తుల మధ్య కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటమన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై జరిపే పోరులో ఈ ఎన్నిక ఓ అధ్యాయమని అభివర్ణించారు. ఇంతే కాదు ! కేసీఆర్ తో కలిసి ఎన్డీయే మీద జరిగే పోరాటంలో పాల్గొంటాను.. ప్రస్తుత జాతీయ పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నేతల అవసరం చాలా ఉంది.. తెలంగాణ కోసం ఆయన ఒక్కరే పార్లమెంటులో పోరు సాగించారు.. ఆయన ఆధ్వర్యంలోని టీఆరెస్ సహకారంతోను, ఇతర పార్టీల మద్దతుతోను రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని సిన్హా చెప్పారు.
ఈ ఎలక్షన్ లో గెలిస్తే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తానన్నారు. ఒకవేళ ఓడినప్పటికీ ఎన్డీయేపై జరిగే ఫైట్ లో భాగస్వామినవుతానన్నారు. కేసీఆర్ ప్రసంగంలో అన్నీ వాస్తవాలున్నాయని, టీఆరెస్ తరఫున మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వచ్చి తనకు సపోర్ట్ ప్రకటించడం హర్షణీయమని ఆయన చెప్పారు. ఆ తరువాత యశ్వంత్ సిన్హా ఎంఐఎం ఎమ్మెల్యేలను కూడా కలిసి తన అభ్యర్థిత్వానికి మద్దతునివ్వవలసిందిగా కోరారు. ఇందుకు వారి నుంచి హామీని పొందారు.
అయితే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఎలెక్టోరల్ కాలేజీలో 1,086,431 ఓట్లు ఉన్నాయి. వీటిలో ఎంపీలవి 5,43,200 కాగా 5,43,231 ఎమ్మెల్యేలవి. ప్రతి ఎంపీ ఓటు విలువ 708 కాగా ఈ సరి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ లేదు కనుక ఇది 700 కి తగ్గవచ్చు. ఏమైనా, బిజూ జనతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ద్రౌపది ముర్ము సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయి. వీటిలో బిజూ జనతాదళ్ కి 31 వేలు, వైఎస్సార్ కాంగ్రెస్ కి 45,500 ఓట్లు ఉన్నాయి. ఎన్డీయేకి మొత్తం 5.26 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇది మొత్తం ఓట్లలో 49 శాతం. విపక్షాలకు ఎలెక్టోరల్ కాలేజీలో టీఆరెస్ సహా 3,92,242 ఓట్లు ఉన్న విషయం గమనార్హం. ఇందులో యూపీఏ (కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు) ఓట్లు 2.6 లక్షలు. బీజేపీ వ్యతిరేక పార్టీల ఓట్లు కూడా కొన్ని ఉన్నాయి. జులై 18 న జరిగే ఎన్నికలో ద్రౌపది ముర్ముకే విజయావకాశాలున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఏదైనా మిరకిల్ జరిగితేనే సిన్హాను విజయం వరించవచ్ఛు.