కేసీఆర్ లోని ‘సింహాన్ని’ నిద్రలేపిన బీజేపీ !

బీజేపీ ‘విజయసంకల్ప’సభ సంగతి ఏమో కానీ కేసీఆర్ కు కావలసినంత ‘మందుగుండు’ను బీజేపీ నాయకులే సమకూర్చారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ‘సంకల్పాని’కి అద్భుతమైన సరంజామా కేసీఆర్ కు లభించింది. టీఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ లో ఒకప్పటి ఉద్యమకారుడు శనివారం మరలా జన్మించాడు. ప్రధాని మోడీపైన, బీజేపీ నాయకత్వంపైన, కేంద్రప్రభుత్వ విధానాలపైన ఆయన విరుచుకు పడ్డ తీరు, చెండాడిన వైనం, చెలరేగిన విధానం నాభూతో న భవిష్యత్తు వలె ఉంది. కేసీఆర్ కు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా […]

Advertisement
Update:2022-07-02 16:54 IST

బీజేపీ ‘విజయసంకల్ప’సభ సంగతి ఏమో కానీ కేసీఆర్ కు కావలసినంత ‘మందుగుండు’ను బీజేపీ నాయకులే సమకూర్చారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ‘సంకల్పాని’కి అద్భుతమైన సరంజామా కేసీఆర్ కు లభించింది. టీఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ లో ఒకప్పటి ఉద్యమకారుడు శనివారం మరలా జన్మించాడు. ప్రధాని మోడీపైన, బీజేపీ నాయకత్వంపైన, కేంద్రప్రభుత్వ విధానాలపైన ఆయన విరుచుకు పడ్డ తీరు, చెండాడిన వైనం, చెలరేగిన విధానం నాభూతో న భవిష్యత్తు వలె ఉంది.

కేసీఆర్ కు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా ఎట్లా ఉంటుందో ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో చూశాం. కానీ నాన్ బీజేపీ రాజకీయపార్టీల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జరిపిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇందుకు కారణం బీజేపీ జాతీయ, స్థానిక నాయకులే! తెలంగాణలోనూ ‘మహారాష్ట్ర’రిపీట్ అవుతుందని రెచ్చగొట్టడం ద్వారా కేసీఆర్ లోని సింహాన్ని నిద్ర లేపినట్లయింది. మాహారాష్ట్ర పరిణామాలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నట్టు దేశ వ్యాప్తంగా పరిశీలకులు చెబుతూనే ఉన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సిపీలతో ఏర్పడిన ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వాన్ని 31 నెలల్లోనే కుతంత్రాలతో కూల్చిన వైనాన్ని ప్రపంచమంతా చూసింది. మహారాష్ట్ర ఘటనలు బీజెపీని అప్రతిష్టపాల్జేసినవి తప్ప రాజకీయంగా ఎలాంటి ప్రయోజనమూ ఆ పార్టీకి లభించలేదు. కాగా మహారాష్ట్రతో కలుపుకొని 9 ప్రభుత్వాలు ‘అప్రజాస్వామికం’గా బీజేపీ ఖాతాల్లోకి వెళ్లాయి.

శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండేను తమ అస్త్రంగా మలచుకొని బీజేపీ ‘మహా వికాస్ అఘాడి’ను కూల్చివేయగలిగింది. అయితే తెలంగాణలో ‘ఏక్ నాథ్ షిండే’ పాత్ర పోషించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. షిండే వంటి ‘విలన్’పాత్ర పోషించగల ధైర్య సాహసాలు ఉన్న టీఆర్ఎస్ నాయకులు కనుచూపు మేరలో లేరు. ఒకవేళ ఈటల రాజేందర్ అలాంటి ‘వ్యవహారం’ నడపాలనుకున్నా ప్రారంభంలోనే ‘భగ్న’మయ్యేవారు. ఇదొక ఊహ మాత్రమే! ఈటల టిఆర్ఎస్ మంత్రిగా ఉన్న వేళ అలాంటి ‘ఆలోచనలు’చేశారన్న అంశంపై స్పష్టత లేదు. ఆ విషయం కేసీఆర్ కు, ఆయనకు ‘గూఢచారులు’గా పనిచేస్తున్న వారికే తెలిసి ఉండవచ్చు. సరే, అదొక గతించిన అంశం. మహారాష్ట్ర పరిణామాలు తెలంగాణలోనూ జరుగుతాయంటున్న నాయకుల జాబితాలో ఈటల పేరు ఎక్కడా వినిపించడం లేదు.

తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టడం పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రజల ఆశీస్సులు ఉంటే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా అధికారంలోనూ రావచ్చు. కానీ ‘మహారాష్ట్ర పరిణామాల’ ప్రస్తావన ఎందుకు? ఏమి చేయాలనుకుంటున్నారు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ‘ప్రజాదరణ’ దొరకదని బీజేపీ ముందుగానే పసిగట్టిందా? అందువల్ల ‘వెన్నుపోటు’చర్యలకు సంబంధించిన ప్రణాళికలను ఇప్పటి నుంచే రచిస్తున్నారా? ”త్వరలోనే మహారాష్ట్ర తరహా పరిణామాలు తెలంగాణలో జరుగుతాయి. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఆపడం ఎవరి తరం కాదు. కేసీఆర్ పతనం మొదలైంది. పుత్ర వ్యాత్సల్యం వల్లనే మహారాష్ట్రలో శివసేన చీలి పోయింది. పుత్రుడికి పట్టాభిషేకం చేయాలని చూస్తున్న కేసీఆర్ కు కూడా ఉద్దవ్ థాక్రేకు పట్టిన గతే పడుతుంది”అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి తరహాలోనే మరికొందరు కేంద్రమంత్రులు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంటు ఇచ్చేవారు కాదని, తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్న వాదనను బీజేపీ నాయకులు తీసుకువస్తున్నారు.”ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. ప్రగతి భవన్ లోకి ఎంట్రీ కావడమే ఎమ్మెల్యేలకు కష్టంగా మారింది. మంత్రులు కూడా ప్రగతి భవన్ వరకు వెళ్లి అనుమతి లేక వెనుదిరిగి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో పరిణామాలు రావచ్చు”అని బీజేపీ నాయకుల విశ్లేషణ.

అయితే టీఆర్ఎస్, శివసేన పార్టీల ఆవిర్భావం వెనుక రాజకీయ ప్రాతిపదిక, భూమిక వేర్వేరు. పొంతన లేనివి. శివసేన నేపథ్యం, పుట్టుక హిందుత్వ పునాదులపై ఉన్నాయి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ‘తల్లివేరు’పై విస్తరించిన మాహావృక్షం. టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం కేసీఆర్ వంటి ‘వేయి యుద్ధాల్లో’ఆరితేరిన నాయకుని చేతుల్లో భద్రంగా ఉన్నాయి. అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఉంది. ప్రతిపక్ష పార్టీలకు సింగిల్ డిజిట్ లోనే సభ్యులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘చీలక’ అసంభవం. పార్టీలో, ప్రభుత్వ వర్గాల్లో, ఎమ్మెల్యేలలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెలుసుకోగలిగిన ‘నెట్ వర్క్’కేసీఆర్ సొంతం. అందువల్లనే ప్రభుత్వాన్ని ఆయన దుర్బేధ్యంగా నిర్మించారు. అలాగే ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రేతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పోల్చడం కన్నా అవగాహనా రాహిత్యం, అమాయకత్వం, మూర్ఖత్వం మరేమి లేవు. కేటీఆర్ తండ్రి ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ సాధించిన యోధుడు కావచ్చు, ఆయన దగ్గర శిష్యరికం తీసుకుంటూ ఉండవచ్చు. కానీ క్రమంగా ఆయన ‘స్వయం ప్రకాశిత’నాయకునిగా ఎదుగుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మంత్రిగా ఆయన ‘సక్సెస్ గ్రాఫ్’ ను తోసిపుచ్చలేం. మహారాష్ట్రలో ఆదిత్య థాక్రే కేవలం ‘ట్రైనీ’ నాయకుడు. చంద్రబాబు పుత్ర రత్నం లోకేష్ తోనే కొంత అటూఇటూగా పోల్చవచ్చు.

ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సంబంధించి బీజేపీ నాయకులు చెబుతున్న విషయాలన్నీ బూటకమే! తాడూ బొంగరం లేనివి. ఏ రకంగానూ అతకనివి. ఆ రాష్ట్రంలో శివసేనను ‘మింగివేయాలని’ బీజేపీ హైకమాండ్ నిర్ణయించిన మేరకే పథకం అమలయ్యింది. కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ ఉన్నంతకాలం బీజేపీ పప్పులుడకవు.

Tags:    
Advertisement

Similar News