యశ్వంత్ సిన్హాను కలవలేం, కానీ ఓట్లేస్తాం..

తెలంగాణలో త్రిముఖ పోరు బలంగా కనపడుతోంది, ఏమాత్రం అవకాశం దొరికినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోడానికి మూడు పార్టీల నేతలు రెడీగా ఉంటారు. అదే సమయంలో ‘ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి’ అనే ప్రచారం ఇక్కడ జోరుగా సాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. కాదు కాదు కాంగ్రెస్, టీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. లేదు లేదు.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటే, కావాలంటే హుజూరాబాద్ బై ఎలక్షన్ చూడండి అంటూ […]

Advertisement
Update:2022-07-01 02:41 IST

తెలంగాణలో త్రిముఖ పోరు బలంగా కనపడుతోంది, ఏమాత్రం అవకాశం దొరికినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోడానికి మూడు పార్టీల నేతలు రెడీగా ఉంటారు. అదే సమయంలో ‘ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి’ అనే ప్రచారం ఇక్కడ జోరుగా సాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది.

కాదు కాదు కాంగ్రెస్, టీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. లేదు లేదు.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటే, కావాలంటే హుజూరాబాద్ బై ఎలక్షన్ చూడండి అంటూ టీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెడుతుంది. ఇలాంటి టైమ్ లో ఎలాంటి నిర్ణయాలయినా వ్యూహాత్మకంగా తీసుకోవాల్సిందే.

ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు అనే హాట్ టాపిక్ నడుస్తోంది. తెలంగాణ వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్ వైరి వర్గాలే. కానీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించాలంటే రెండు పార్టీలు ఒకే అభ్యర్థికి ఓట్లు వేయాలి. మమతా బెనర్జీ బలపరచిన యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఓట్లు వేయాలని నిర్ణయించాయి. అయితే ఆమధ్య మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన మీటింగ్ కి కాంగ్రెస్ వస్తే తాము రాలేమంటూ కొన్ని పార్టీలు స్పష్టం చేశాయి, అందులో టీఆర్ఎస్ కూడా ఉంది.

కానీ యశ్వంత్ సిన్హా నామినేషన్ కి మాత్రం కేటీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చారు. తాజాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఆయన్ను కలిసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఇష్టపడటం లేదు. కేటీఆర్ ఆహ్వానం మేరకు యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తున్నారని, అందుకే ఆయన్ను తాము కలవలేమంటున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ తమ ఓటు మాత్రం ఆయనకేనని భరోసా ఇస్తున్నారు.

తమను కలిసేందుకు వచ్చి కేసీఆర్‌ ను కలవాలనుకున్నా, కేసీఆర్‌ ను కలిసేందుకు వచ్చి తమను కలవాలన్నా తాము కలిసేది ఉండదని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. యశ్వంత్‌ సిన్హా టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, మమతా బెనర్జీ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కోరారని, ఆయనకు తాము మద్దతిస్తామని, ఎన్నికల్లో ఓట్లు వేస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ లో మాత్రం ఆయన్ను కలిసేది లేదని క్లారిటీ ఇచ్చారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయినా.. తెలంగాణ వరకు కాంగ్రెస్, టీఆర్ఎస్ వైరి వర్గాలేనని చెప్పారు రేవంత్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News