సోషల్ మీడియాని గుడ్డిగా నమ్మేస్తున్న భారతీయులు..
ఫలానా సీనియర్ నటుడు చనిపోయాడు, ఫలానా నటికి విడాకులు, సముద్ర తీరంలో సాగర కన్య, ఫలానా దేశంలో ఘోర ప్రమాదం.. ఇలా రకరకాల ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటాయి. కొన్నిరకాల వార్తలయితే నెలకోసారి అయినా అలా ఓ రౌండ్ వేస్తుంటాయి. అయినా కూడా ఎవరూ వాటిని షేర్ చేయకుండా ఉండలేరు. అదే నిజమని నమ్మేస్తారు, తమతోపాటు పదిమందీ ఆ నిజాన్ని తెలుసుకోవాలనే పిచ్చి భ్రమలో అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. దాదాపు […]
ఫలానా సీనియర్ నటుడు చనిపోయాడు, ఫలానా నటికి విడాకులు, సముద్ర తీరంలో సాగర కన్య, ఫలానా దేశంలో ఘోర ప్రమాదం.. ఇలా రకరకాల ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటాయి. కొన్నిరకాల వార్తలయితే నెలకోసారి అయినా అలా ఓ రౌండ్ వేస్తుంటాయి. అయినా కూడా ఎవరూ వాటిని షేర్ చేయకుండా ఉండలేరు. అదే నిజమని నమ్మేస్తారు, తమతోపాటు పదిమందీ ఆ నిజాన్ని తెలుసుకోవాలనే పిచ్చి భ్రమలో అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యే ఇది.
అయితే భారతీయులు మాత్రం సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని గుడ్డిగా నమ్ముతున్నారనే సర్వేలు చెబుతున్నాయి. ఒక విషయం తప్పో ఒప్పో తెలుసుకోవాలంటే భారతీయులు ఆన్ లైన్ నే ఆశ్రయిస్తున్నారని, సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారనేది సర్వేల సారాంశం.
గతంలో న్యూస్ పేపర్ చూసిన తర్వాతే వార్తలు తెలిసేవి. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ ఏరోజు వార్తలు ఆరోజే ప్రజలు చేరవేసేవి. 24గంటల న్యూస్ ఛానల్స్ వచ్చాక వార్తలు నిముషాల వ్యవధిలో టీవీల్లో టెలికాస్ట్ అయ్యేవి. ఇప్పుడు అది కూడా అక్కర్లేదు, సెల్ ఫోన్ లో వార్తలన్నీ లైవ్ లో కనపడిపోతున్నాయి. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సంఘటన లైవ్ టెలికాస్ట్ అవుతూనే ఉంటోంది. ఎన్నికల ఫలితాలు తెలుసుకోవాలంటే ఎవరూ టీవీలు చూడట్లేదు, సెల్ ఫోన్ నే ఆశ్రయిస్తున్నారు. అలాంటి కాలం ఇది. అయితే సెల్ ఫోన్ లో వచ్చేదంతా నిజమేనా, అవతలివాళ్లు పోస్ట్ చేసే విషయాలన్నీ వాస్తవాలేనా..? అన్నీ నిజాలని చెప్పలేం, కొన్ని అబద్ధాలు, అర్థసత్యాలు కూడా ఉంటాయి. కానీ వాటినే నిజాలుగా నమ్మేస్తున్నారట భారతీయులు.
భారత్ లో ఏదైనా సమచారం తెలుసుకోవాల్సి వస్తే.. సోషల్ మీడియాను ఆశ్రయించేవారి సంఖ్య పెరిగిపోయింది. వార్తలకోసం భారత్ లో 54 శాతం మంది ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ నే ఆశ్రయిస్తున్నారని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ నిర్వహించిన సర్వేలో తేలింది. వార్తలకోసం సోషల్ మీడియాపై ఆధారపడేవారి సంఖ్య మెక్సికో, సౌతాఫ్రికాలో 43 శాతం ఉండగా.. బ్రిటన్ లో కేవలం 16 శాతం మంది మాత్రమే సోషల్ మీడియాని ఆశ్రయిస్తున్నారు.
భారత్ లో 25 నుండి 44 ఏళ్ల వయస్సు గల వారిలో 44 శాతం మంది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. 55 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 12 శాతం మంది మాత్రమే సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతాయనే విషయం తెలిసినా కూడా ఆ అలవాటు మానుకోలేకపోతున్నారు. పదే పదే ఫేక్ వార్తలతో మోసపోతున్నా కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ వార్త కనపడితే చాలు దాన్ని చదివేస్తున్నారు, ఇతరులకు షేర్ చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అధ్యయనం తెలిపింది.
కొత్త సమాచారం, లేదా కచ్చితమైన సమాచారం కోసం గతంలో ఎవరైనా పుస్తకాలు తిరగేసేవారు, లేదా లైబ్రరీకి వెళ్లేవారు, ఎన్ సైక్లోపిడియా వంటివి అందుబాటులో ఉంచుకునేవారు. కానీ ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా గూగుల్ లో వెదికేస్తున్నారు. అదే నిజమని నమ్ముతున్నారు. గూగుల్ లో వెదకడంతోపాటు దాన్ని గుడ్డిగా నమ్మేవారు ప్రపంచ వ్యాప్తంగా 67శాతం మంది ఉండగా.. భారత్ లో 87శాతం మంది అలాంటివారు ఉన్నారు. అమెరికా, యూకే, సౌతాఫ్రికా, భారత్, మెక్సికో.. సహా పలు దేశాల్లో 5వేలమంది నుంచి సమాచారాన్ని సేకరించి ఈ అధ్యయన ఫలితాలు వెలువరించారు.