ఆ భర్త తన భార్యను ముద్దు పెట్టుకోవడం నేరమా ? పెరుగుతున్న మోరల్ పోలీసింగ్, మూకదాడులు
దేశంలో అసహనం, మోరల్ పోలీసింగ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎవరు ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఏం తిండి తినాలో, ఎలాంటి సంస్కృతి ఆచరించాలో నిర్దేశించే మూకలు పెరిగిపోయాయి. మూక దాడులు, మూక హత్యలు పెరిగిపోయాయి. తమకు నచ్చని పని చేసే ఎవరిపైనా అయినా దాడులు చేయడం ,హత్యలు చేయడం అనే మూక సంస్కృతి ని కొందరు ప్రోత్సహిస్తున్నారు. నిన్న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇలాంటి సంఘటనే జరిగింది. అయోధ్యలోని సరయూ నదిలో ఓ జంట స్నానం చేస్తూ భర్త […]
దేశంలో అసహనం, మోరల్ పోలీసింగ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎవరు ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఏం తిండి తినాలో, ఎలాంటి సంస్కృతి ఆచరించాలో నిర్దేశించే మూకలు పెరిగిపోయాయి. మూక దాడులు, మూక హత్యలు పెరిగిపోయాయి. తమకు నచ్చని పని చేసే ఎవరిపైనా అయినా దాడులు చేయడం ,హత్యలు చేయడం అనే మూక సంస్కృతి ని కొందరు ప్రోత్సహిస్తున్నారు. నిన్న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇలాంటి సంఘటనే జరిగింది.
అయోధ్యలోని సరయూ నదిలో ఓ జంట స్నానం చేస్తూ భర్త భార్యకు ముద్దు పెట్టాడు. ఆ దగ్గర్లో ఉన్న వ్యక్తులకు ఆ భర్త చేసిన పని తప్పనిపించింది. అయితే అతను చేసింది తప్పని అతనికే చెప్పొచ్చు లేదా ఆ పని చట్ట వ్యతిరేకమైతే పోలీసులకు పిర్యాదు చేయొచ్చు. కాని మూక మనస్తత్వం అలాచేయనీయదు. ఆ భర్తను చుట్టుముట్టిన మూక ఆయనను కొట్టుకుంటూ నది బైటికి తీసుకొచ్చారు. బూతులు తిడుతూ ఆయనను ఇష్టమొచ్చిన రీతిలో కొట్టారు. భార్య అడ్డమొస్తే ఆమెను తోసేశారు. అయితే వీళ్ళందరినీ అడ్డుకున్న ఓ వ్యక్తి ఆ భార్యాభర్తలిద్దరినీ ఆ మూక బారినుండి రక్షించాడు.
ఈ మోరల్ పోలీసింగ్ మూకలు ఇలా రెచ్చిపోవడానికి కారణమెవరు ? కొట్టడం, చంపడం అనే క్రూర మనస్తత్వం ఈ మూకల్లో ఎందుకు పెరుగుతోంది. నిజంగా ఇది దేవుని మీద భక్తేనా ? ఇదంతా సంస్కృతి పరిరక్షణేనా ? మహాభారత కాలంలో ఇలాంటి మూకలు రాజ్యమేలితే శ్రీకృష్ణుడు కూడా వీళ్ళ బారిన పడేవాడు కదా ! వీళ్ళు తాలిబన్ల కంటే ఎందులో తక్కువ ?
దేశంలో గోవధ పేరుతో, గో మాంసం పేరుతో, దళితులపై , మత మైనార్టీలపై జరుగుతున్న మూక దాడులు…. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరిగితే సహించలేని భజరంగ్ దళ్ మూక దాడులు…. లవ్ జీహాదీ అనుమానాలతో మూక దాడులు….. దొంగలనే అనుమానంతో, కిడ్నాపర్లనే అనుమానంతో మూక దాడులు, హత్యలు…. ఇలా దేశంలో చట్టాన్ని ధిక్కరిస్తూ హింసకు పాల్పడుతున్న మూకల పట్ల చర్యలు తీసుకోకపోవడం వల్ల పైగా కొందరు పెద్దలు ఈ దాడులును సమర్దిస్తూ మాట్లాడుతుండటం వల్ల ఈ మూకలకు ధైర్యం పెరుగుతోంది. సంస్కృతి పేరుతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమా వచ్చేస్తోంది.
ఇటువంటివాళ్ళ ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలన్నా చట్టం సరిగా అమలవ్వాలన్నా ప్రజలు ముందుగా ఈ మూక దాడులపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ మూకలకు వ్యతిరేకంగా, ఆ భార్యా భర్తలను రక్షించిన వ్యక్తి లాగా క్రియాశీలంగా ఉండాలి. ప్రభుత్వాలు కూడా పైపై మాటలు కాకుండా ఈమూకలపై తీవ్రచర్యలకు సిద్దపడాలి.