బుల్డోజర్లతో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. యోగి మార్క్ పాల‌న‌

బీజేపీ బుల్డోజర్ల సంస్కృతి తాజాగా పోలీసు శాఖలో కూడా పాకింది. యూపీలోని అలీగఢ్ లో ఖాకీలు నిన్న నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో వీటిని కూడా చూసిన జనం భయంతో బేర్ మన్నారు. తమ పోలీసు వాహనాలతో పాటు బుల్డోజర్లను కూడా పోలీసులు ప్రదర్శించారు. అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తున్న యువకులు ఓ పోలీసు పోస్టును, పోలీసు వాహనాన్ని తగులబెట్టడంతో ఆగ్రహించిన ఖాకీలు బుల్డోజర్లనే ‘తమ ఆయుధాలు’గా చూపడం ఆసక్తినే కాక, ఆందోళనను, భయాన్ని కూడా కలిగించిందని అమాయక […]

Advertisement
Update:2022-06-21 09:07 IST

బీజేపీ బుల్డోజర్ల సంస్కృతి తాజాగా పోలీసు శాఖలో కూడా పాకింది. యూపీలోని అలీగఢ్ లో ఖాకీలు నిన్న నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో వీటిని కూడా చూసిన జనం భయంతో బేర్ మన్నారు. తమ పోలీసు వాహనాలతో పాటు బుల్డోజర్లను కూడా పోలీసులు ప్రదర్శించారు. అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తున్న యువకులు ఓ పోలీసు పోస్టును, పోలీసు వాహనాన్ని తగులబెట్టడంతో ఆగ్రహించిన ఖాకీలు బుల్డోజర్లనే ‘తమ ఆయుధాలు’గా చూపడం ఆసక్తినే కాక, ఆందోళనను, భయాన్ని కూడా కలిగించిందని అమాయక జనం బావురుమంటున్నారు. నిన్నటి పోలీసు కాన్వాయ్ లో వీటిని వినియోగించారని వచ్చిన వార్తల గురించి తమకేమీ తెలియదని అలీగఢ్ పోలీసు అధికారి కళానిధి నైతానీ తెల్లమొహం వేశారు. అసలివి ఎక్కడినుంచి వచ్చాయని మరో అధికారి పలాష్ బన్సాల్ ప్రశ్నించారు.

బుల్డోజర్లను వాడాలన్న ఉద్దేశం తమకు లేదని ఈ ఇద్దరు అధికారులు చెబుతున్నప్పటికీ.. ఇవి మీడియా ఫొటోల్లో ఎంచక్కా కనిపించాయి. పెద్ద సంఖ్యలో వీటితో వచ్చిన పోలీసులను చూసి తాము షాపులు బంద్ చేసుకున్నామని ఓ దుకాణదారుడు చెప్పాడు. బుల్డోజర్లతో వారు దాదాపు రెండు గంటలపాటు నిలబడ్డారని, ఇది చూసి తాము భయంతో వణికిపోయామని మరో ఆయన తెలిపాడు. ప్రజల్లో భయాన్ని కలగజేసేందుకే పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఇది సమర్థనీయమేనా అని స్థానిక నాయకుడొకరు ప్రశ్నించారు. అల్లర్లు, ఘర్షణలకు సూత్రధారులైన వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసులకు ఆదేశాలివ్వడంతో ఇక వారు వెతికి మరీ వీటిని సంపాదించి పోలీసు స్టేషన్ల వద్ద నిలుపుతున్నారు. పోలీసు వాహనాల శ్రేణిలో ఇవి కూడా ఇంచుమించు భాగమైపోయాయి.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసి పోలీసు కేసులకెక్కిన యువకుల ఇళ్లను కూడా బుల్డోజర్లతో కూల్చివేస్తే ఇక తమకు దిక్కెవరని వీరి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది కేవలం (బుల్డోజర్లతో పోలీసుల ఫ్లాగ్ మార్చ్) బ్యాలెన్సింగ్ యాక్ట్ మాత్రమేనని, పోలీసులకు ఎవరి పట్లా పక్షపాతం లేదని, ఏ గ్రూప్ అవాంఛనీయ చర్యలకు పాల్పడినా బుల్డోజర్లను తీసుకొస్తామని చూపడానికే వీటిని ప్రదర్శించారని సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ మాజీ నేత చెప్పారు.

ఇక అలీగఢ్ లో కోచింగ్ సంస్థలను నిర్వహిస్తున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథ్ ను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నవారిని రెచ్చగొట్టేందుకు వీరు ప్రయత్నించారని ఖాకీలు ఆరోపిస్తున్నారు. వీరు అరెస్టు చేసినవారిలో బీజేపీ నేత సుధీర్ శర్మ కూడా ఉన్నారు. యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్ ని నిర్వహిస్తున్న ఈయనపై కూడా పోలీసు కేసు నమోదు కావడం గమనార్హం. అంటే ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నవారిలో బీజేపీవాళ్ళు కూడా ఉన్నారన్నది నిఖార్సయిన నిజం..!

Tags:    
Advertisement

Similar News