అస్సోంను వీడని వరద విషాదం..25 మంది మృతి
అసోం రాష్ట్రాన్ని వరద విషాదం వదలడంలేదు. బ్రహ్మపుత్ర, గౌరంగ్ వాటి ఉపనదులు పొంగి ప్రవహిస్తూ నేటికీ ప్రజలను భయపెడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయి. సాధారణ జనజీవనం స్తంభించింది. రాజధాని గువహటి వీధుల్లోనూ వరద నీరు పారుతోంది. ఇప్పటి వరకు 25 మందికి పైగానే మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎనిమిది మంది ఆచూకీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. వరద నీరు 4,291 గ్రామాలను ముంచెత్తగా […]
అసోం రాష్ట్రాన్ని వరద విషాదం వదలడంలేదు. బ్రహ్మపుత్ర, గౌరంగ్ వాటి ఉపనదులు పొంగి ప్రవహిస్తూ నేటికీ ప్రజలను భయపెడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయి. సాధారణ జనజీవనం స్తంభించింది. రాజధాని గువహటి వీధుల్లోనూ వరద నీరు పారుతోంది. ఇప్పటి వరకు 25 మందికి పైగానే మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎనిమిది మంది ఆచూకీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. వరద నీరు 4,291 గ్రామాలను ముంచెత్తగా 66,455 పంట భూములు వరద నీటిలో మునిగిపోయాయి.
వరద నీట మునిగిన గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అధికారులకు కష్టంగా మారింది. వరదల్లో తమ విలువైన సామాన్లన్నీ మునిగిపోయాయని తాము ఇళ్ళు విడిచి వెళితే నష్టపోవాల్సి వస్తుందనే భయంతో వారు ఇళ్ళను విడిచి వెళ్ళేందుకు నిరాకరిస్తున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దంటూ అధికారులు నచ్చజెప్పి సురక్షిత ప్రాంతాలకు అతి కష్టంమీద తరలిస్తున్నారు. చిరంగ్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను తాళ్ళు, చిన్న చిన్న పడవల సాయంతో కాపాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 514 సహాయక శిబిరాల్లో 1.56 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు.
చెరువులు కాదు.. అవి రోడ్లే..
గువహటి వీధుల్లో వరద నీరు పారుతుండగా.. పెద్ద పెద్ద చేపలు ఈదుకుంటూ వెళుతుండడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో కొందరు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. యేళ్ళు పూళ్ళు మునిగిపోతుంటే కొందరు వరదల్లో కూడా వినోదాన్ని వెదుక్కుంటున్నారు.
ఇదిలా ఉండగా, ప్రధాని మోడీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసి తాజా పరిస్థితిని వాకబు చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.