‘ఇది సైన్యానికే అవమానం.. తక్షణమే రద్దు చేయండి’.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్
అగ్నిపథ్ పథకం సైన్యానికే అవమానకరమని, తక్షణమే దీన్నిరద్దు చేయాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్రాన్ని కోరారు. ఈ పథకాన్ని నిరసిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలను ఆయన సమర్థించారు. ఈ స్కీం సైనికులను అవమానించే విధంగా ఉందని, ఏ మాత్రం ఆలోచించకుండా దీన్ని ప్రకటించారని ఆయన అన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద.. యువతను నాలుగేళ్ల కాలానికి గాను నెలకు 30 వేల రూపాయల జీతంతో తీసుకుంటారు. నాలుగేళ్ల […]
అగ్నిపథ్ పథకం సైన్యానికే అవమానకరమని, తక్షణమే దీన్నిరద్దు చేయాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్రాన్ని కోరారు. ఈ పథకాన్ని నిరసిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలను ఆయన సమర్థించారు. ఈ స్కీం సైనికులను అవమానించే విధంగా ఉందని, ఏ మాత్రం ఆలోచించకుండా దీన్ని ప్రకటించారని ఆయన అన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద.. యువతను నాలుగేళ్ల కాలానికి గాను నెలకు 30 వేల రూపాయల జీతంతో తీసుకుంటారు. నాలుగేళ్ల అనంతరం 75 శాతం మందిని తిప్పి పంపేస్తారు. అయితే వీరికి 11.71 లక్షల ఆర్ధిక ప్యాకేజీ లభిస్తుంది.
(చూడబోతే ఈ ప్యాకేజీ కొత్త ప్రతిపాదనలా ఉంది). మిగతా 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు సైన్యంలో కొనసాగిస్తారు. ఏమైనా .. 4 ఏళ్ళ తరువాత వీరికి ఏ పెన్షన్ ఉండదని, కేవలం నాలుగేళ్ల సర్వీసు మాత్రం మిగులుతుందని మాన్ పేర్కొన్నారు. ఇది దేశ యువతను మోసగించినట్టే అవుతుందని, వారి ఆగ్రహానికి గురయ్యే విధంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ముందూ వెనుకా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయ ఫలితమే ఈ ఆందోళనలని మాన్ వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..
అగ్నిపథ్ పథకం కింద నియామకమైన అభ్యర్థులకు నాలుగేళ్ల తరువాత ఎలాంటి రాంక్ గానీ, పెన్షన్ గానీ, స్థిరమైన భవిష్యత్తుగానీ ఉండదని అన్నారు. సైన్యమంటే మోడీ ప్రభుత్వానికి గౌరవం లేదని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాత్రం ఇది మంచి స్కీం అని, సరైన దిశలో తీసుకున్న సంస్కరణ అని వ్యాఖ్యానించడం విశేషం. టెక్నాలజీపైన, అధునాతన ఆయుధాల వాడకంపైన యువతకు ఓ మాదిరి అనుభవం ఉండడం మంచిదేనని, సాయుధ దళాలంటే ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
డిసెంబరు నుంచి అగ్నివీరుల తొలి బ్యాచ్ కి శిక్షణ
డిసెంబరు నుంచి అగ్నివీరుల మొదటి బ్యాచ్ కి శిక్షణ ప్రారంభమవుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ప్రకటించారు. అన్ని కేంద్రాల్లో ఈ ట్రైనింగ్ ఉంటుందని, అగ్నివీరులు ఈ నెల నుంచి తమ రెజిమెంటల్ సెంటర్లలో చేరుతారని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మధ్య కాలానికి వారిని మా ఆపరేషనల్, నాన్-ఆపరేషనల్ విభాగాల్లో చేరుస్తామని వెల్లడించారు.
బంగారం లాంటి అవకాశం.. రాజ్ నాథ్ సింగ్
అగ్నిపథ్ పథకం ఈ దేశ యువతకు బంగారం లాంటి అవకాశమని, వారు సైన్యంలో చేరి తమ దేశభక్తిని నిరూపించుకోవడానికి ఇది మంచి ఛాన్స్ అని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇందులో చేరినవారు గర్వంగా ‘నేను అగ్నివీరుడ్ని’ అని చెప్పుకోవచ్చు.. వారికి విశిష్టమైన గుర్తింపు ఉంటుంది’ అన్నారాయన. నియామకాల ప్రక్రియలో లోటుపాట్ల కారణంగా రెండేళ్లుగా సాయుధ దళాల్లో రిక్రూట్మెంట్ జరగలేదని, అనేకమంది యువకులు సైన్యంలో చేరే అవకాశాన్ని కోల్పోయారని ఆయన చెప్పారు. అందువల్లే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకుందని, పైగా అగ్నివీరుల వయో పరిమితిని 21 ఏళ్ళ నుంచి 23 ఏళ్లకు పెంచడం జరిగిందని రాజ్ నాథ్ సింగ్ వివరించారు. మరికొన్ని రోజుల్లో రిక్రూట్మెంట్ ప్రారంభమవుతుందని, దేశ యువకులంతా సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నానని ఆయన చెప్పారు. ఈ పథకం వల్ల వారు ప్రయోజనం పొందాలన్నారు.