భారత రాష్ట్ర సమితి కాదా.. కొత్త పేరు కోసం కేసీఆర్ కసరత్తు!
జాతీయ పార్టీ ఏర్పాటుకు టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు ఆవశ్యకత ఉన్నదని గతంలో మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. దీంతో అందరూ అదే పేరు జాతీయ పార్టీకి పెడతారని భావించారు. కానీ కేసీఆర్ ఆ పేరును పార్టీకి పెట్టబోవడం లేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కొత్త పార్టీ కోసం పలు పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తున్నది. అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా, ముఖ్యంగా ఉత్తరాది వారికి అర్థమయ్యేలా […]
జాతీయ పార్టీ ఏర్పాటుకు టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు ఆవశ్యకత ఉన్నదని గతంలో మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. దీంతో అందరూ అదే పేరు జాతీయ పార్టీకి పెడతారని భావించారు. కానీ కేసీఆర్ ఆ పేరును పార్టీకి పెట్టబోవడం లేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కొత్త పార్టీ కోసం పలు పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తున్నది. అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా, ముఖ్యంగా ఉత్తరాది వారికి అర్థమయ్యేలా ఈ పేరు ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితికి దగ్గరగా ఉంటుందని తొలుత భారత రాష్ట్ర సమితి పేరును కేసీఆర్ ప్రతిపాదించారని.. అయితే సీనియర్లు ఆ పేరు కంటే భారత రాజ్య సమితి అయితే బాగుంటుందని సూచించినట్లు తెలుస్తున్నది. జై భారత్ పార్టీ, నవ భారత్ పార్టీ, నవోదయ పార్టీ వంటి పేర్లయితే ఎలా ఉంటుందని పార్టీ సీనియర్ నేతలను కేసీఆర్ అడిగినట్లు సమాచారం. నవోదయ పార్టీ, నవ భారత్ పార్టీ అనేవి తెలుగు పేర్లు కాబట్టి ఉత్తరాదిన విముఖత వ్యక్తం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వెలువడినట్లు తెలుస్తోంది.
కొత్త పేరు తెలంగాణ రాష్ట్ర సమితికి దగ్గరగా ఉండాలని.. లేకపోతే ఓటర్లలో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కన్ఫ్యూజన్‌కు గురైతే మొదటికే మోసం వస్తుందని.. కాబట్టి పేరు పెట్టడంలో చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఈసీఐ వద్ద నమోదైన పేర్లను పరిశీలించడానికి టీఆర్ఎస్ నుంచి కొంత మంది సీనియర్ నాయకులను కేసీఆర్ నియమించారు.
మరోవైపు కొత్త పార్టీ పేరు ఖరారయ్యే వరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేయడానికి నిర్ణయించారు. జూన్ 19న ఈ సమావేశం జరుగనున్నది. ఇందులోనే జాతీయ పార్టీకి సంబంధించిన తీర్మానం పెట్టాల్సి ఉంది. అసలు పేరే ఖరారు కాకుండా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం కుదరదు. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ సీనియర్ నేత బి. వినోద్ తెలిపారు. ‘కొత్త పార్టీ పేరు ప్రాంతాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దానిపై పూర్తిగా కసరత్తు చేస్తున్నాము. ఆ తర్వాతే కొత్త పార్టీ ప్రకటన ఉంటుంది’ అని బి. వినోద్ చెప్పుకొచ్చారు.
ఇక కేసీఆర్ ఎక్కువగా జాతకాలు, ముహుర్తాలు నమ్ముతుంటారు. కొత్త పార్టీ పేరు కూడా అందుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటున్నట్లు తెలుస్తున్నది. పార్టీ ప్రకటనకు మంచి మహూర్తాన్ని కూడా వెతుకుతున్నారు. కొత్త పని ప్రారంభానికి ఈ నెల 24తో ముహూర్తాలు ముగియనున్నాయి. కాబట్టి ఆ లోగా కొత్త పేరు నిర్ణయించి ప్రకటన ఏమైనా చేస్తారేమో చూడాల్సి ఉన్నది.