టీఆర్ఎస్‌ చెప్పిన కారణాలు.. మమత దుందుడుకుతో మొదటికే మోసం

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దుందుడుకు చర్యలు విపక్షాల్లో ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి. బీజేపీపై వ్యతిరేకత కారణంగా కొన్ని పార్టీలు మమత చర్యలకు అయిష్టంగానే తలూపుతుండగా.. వామపక్షాలు ఆమె తీరును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్‌ కారణంగా మమత చర్యలకు మద్దతు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ససేమిరా అంటోంది. ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మమతా బెనర్జీ బుధవారం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరుకాబోమని టీఆర్‌ఎస్ తేల్చి చెప్పింది. అందుకు కొన్ని కారణాలను […]

Advertisement
Update:2022-06-15 03:31 IST

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దుందుడుకు చర్యలు విపక్షాల్లో ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి. బీజేపీపై వ్యతిరేకత కారణంగా కొన్ని పార్టీలు మమత చర్యలకు అయిష్టంగానే తలూపుతుండగా.. వామపక్షాలు ఆమె తీరును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్‌ కారణంగా మమత చర్యలకు మద్దతు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ససేమిరా అంటోంది.

ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మమతా బెనర్జీ బుధవారం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరుకాబోమని టీఆర్‌ఎస్ తేల్చి చెప్పింది. అందుకు కొన్ని కారణాలను వివరించింది. పలు ప్రాంతీయ పార్టీల తీరు కూడా అసలు మమత పిలిస్తే తామెందుకు వెళ్లాలి అన్నట్టుగా ఉంది. ఈ భేటీ విషయంలో మమతా బెనర్జీ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ సీతారాం ఏచూరి ఆమెకు లేఖ రాశారు.

సమావేశం షెడ్యూల్‌పై ముందే వివిధ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని.. అలా కాకుండా ఏకపక్షంగా సమావేశాన్ని ఖరారు చేయడం వల్ల పలు పార్టీల అగ్రనేతలు వారి ముందస్తు కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పార్టీలకు మమత రాసిన లేఖకు.. సమావేశం తేదికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండడాన్ని ఏచూరి ప్రస్తావించారు.

మమత తీరుపై అయిష్టత ఉన్నప్పటికీ విపక్షాల ఐక్యతను దెబ్బతీయకూడదన్న ఉద్దేశంతో వామపక్షాలు తమ పార్టీల తరపున ఎంపీలను మాత్రమే పంపేందుకు సిద్ధమయ్యాయి. మమతా భేటీకి పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు ముఖ్యమంత్రులు హాజరయ్యే పరిస్థితులు లేవని తేలింది. ఆ పార్టీల తరపున ప్రతినిధులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఎవరినీ సంప్రదించకుండా మమత ఏకపక్షంగా సమావేశంపై నిర్ణయం తీసుకున్నారన్న అసంతృప్తి ఉంది.

ఒడిషా ముఖ్యమంత్రి తటస్థ వైఖరి తీసుకున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ ఈ భేటీకి హాజరుకాబోమని ముందుగానే తేల్చిచెప్పేసింది. టీఆర్‌ఎస్‌ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకునే ప్రసక్తే లేదని.. కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తే తాము హాజరుకాబోమని ముందే మమతా బెనర్జీకి చెప్పినట్టు టీఆర్‌ఎస్ వెల్లడించింది. అయినప్పటికీ కాంగ్రెస్‌ను ఆహ్వానించడం, ఆ పార్టీ కూడా సమావేశానికి వచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో ఈ భేటీకి టీఆర్ఎస్ దూరంగా ఉంటోందని ప్రకటించారు.

తెలంగాణలో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్‌ కుమ్మక్కు అయిందని టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ తన ఓటు బ్యాంకును మొత్తం బీజేపీకి మళ్లించి తాను డిపాజిట్లు కోల్పోయి అయినా సరే బీజేపీని గెలిపించాలన్నట్టుగా పనిచేసిందని టీఆర్‌ఎస్ వర్గాలు మమతా బెనర్జీ బృందానికి వివరించారు.

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ కూడా బీజేపీని ఒక్క మాట అనకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైనా విమర్శలు చేయడాన్ని కూడా అధికార పార్టీ ఎత్తిచూపుతోంది. తెలంగాణలో బీజేపీ- కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని టీఆర్ఎస్ అంటోంది.

అటు ఈ సమావేశం ఏర్పాటు చేసిన తీరుపైనా టీఆర్‌ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ముందుగా పార్టీలన్నీ చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని.. అలా కాకుండా ముందే ఒక అభ్యర్థి పేరును నిర్ధారించుకుని ఇప్పుడు మిగిలిన పార్టీలను సమావేశానికి పిలవడం ఏమిటని ప్రశ్నిస్తోంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత తమపై రుద్దుతామంటే అలాంటి వాటిని అంగీకరించే ప్రసక్తే ఉండదని టీఆర్ఎస్ తేల్చి చెప్పింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని టీఆర్‌ఎస్ చెప్పడంతో ఇప్పుడు ఆ పార్టీ ఏం చేస్తుందన్న దానిపైనా ఉత్కంఠ నెలకొంది.

Tags:    
Advertisement

Similar News