హమ్మయ్యా.. తెలంగాణ ప్రభుత్వానికి అప్పు దొరికింది.. బాండ్ల రూపంలో రూ. 4వేల కోట్లు
ధనిక రాష్ట్రంగా పేరున్న తెలంగాణ గత కొంత కాలంగా నిధుల కొరతతో ఇబ్బంది పడుతోంది. సాధారణ ఖర్చులు, జీతాలు, పథకాలు, ప్రాజెక్టులకు డబ్బులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి అప్పు తెచ్చుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా కేంద్రాన్ని కోరుతున్నది. అయితే తెలంగాణ చేసిన విజ్ఞప్తిని ఎప్పటికప్పుడు కేంద్రం తోసిపుచ్చుతూ వచ్చింది. కాగా, బాండ్ల రూపంలో అప్పు తీసుకుంటామని చేసిన వినతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రూ. 4 వేల […]
ధనిక రాష్ట్రంగా పేరున్న తెలంగాణ గత కొంత కాలంగా నిధుల కొరతతో ఇబ్బంది పడుతోంది. సాధారణ ఖర్చులు, జీతాలు, పథకాలు, ప్రాజెక్టులకు డబ్బులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి అప్పు తెచ్చుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా కేంద్రాన్ని కోరుతున్నది. అయితే తెలంగాణ చేసిన విజ్ఞప్తిని ఎప్పటికప్పుడు కేంద్రం తోసిపుచ్చుతూ వచ్చింది. కాగా, బాండ్ల రూపంలో అప్పు తీసుకుంటామని చేసిన వినతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రూ. 4 వేల కోట్ల అప్పు దొరికింది.
13 ఏళ్ల కాల పరిమితి ఉన్న బాండ్ల వేలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నోటిషికేషన్ జారీ చేసింది. ఈ బాండ్లు జారీ చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రూ. 4000 కోట్ల అప్పును సమీకరించగలిగింది. దీంతో రాష్ట్రానికి ఉన్న నిధుల కొరత కాస్త తగ్గనున్నది. కాగా, ఈ నిధులను రైతు బంధు పథకానికి వినియోగించనున్నట్లు సమాచారం. త్వరలోనే రైతుల ఖాతాల్లోకి పంట సాయం వేయనున్నట్లు తెలుస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రూ. 11 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని భావించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఫిస్కల్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎఫ్ఆర్ఎంబీ) నూతన నిబంధనల పేరుతో రెండు నెలలుగా అప్పు చేయడానికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేయడంతో తాత్కాలికంగానే అనుమతి ఇచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లు, ఇతర సంస్థల ద్వారా తీసుకునే రుణాలను కూడా ఎఫ్ఆర్ఎంబీ పరిధిలోకి తెస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు తాము తీసుకున్న అన్ని రుణాల వివరాలు ఇవ్వాలని కోరింది. ఆ లెక్కలపై స్పష్టత వచ్చే వరకు ఇతర రుణాలు తీసుకోవడంపై తాత్కాలిక నిషేధం విధించింది. కొన్ని రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని అంగీకరించాయి. అయితే రుణాలను నిలిపివేయడంపై తెలంగాణ ప్రభుత్వం గత కొంత కాలంగా కేంద్రానికి తమ అభ్యంతరం తెలియజేస్తోంది. పాత విధానంలోనే రుణాలు సమీకరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ అప్పు తీసుకోవడంపై ప్రతిష్టంభన ఏర్పడింది.
కేంద్రం తాత్కాలికంగానే రుణం తీసుకోవడానికి అంగీకరించడంతో తెలంగాణకు రాబోయే రోజుల్లో మళ్లీ ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పుడు తీసుకున్న రుణానికి కూడా పూర్తి లెక్కలు చెప్పే వరకు కేంద్రం తిరిగి అనుమతించబోదని తెలుస్తున్నది.