ఎనిమిది నెలల పాలన కాలయాపన తప్పా కమిట్‌మెంట్ లేదు

గవర్నర్ ప్రసంగంలో పసలేదు. దిశా-నిర్దేశం అంతకన్నా లేదని షర్మిల ఫైర్‌

Advertisement
Update:2025-02-24 17:20 IST

ప్రజలు ఛీకొడుతున్నా వైసీపీ అధినేత జగన్‌ తీరు మారడం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగంలో పసలేదని, దిశా-నిర్దేశం అంతకన్నా లేదన్నారు. ఈ మేరకు 'ఎక్స్‌'లో ఆమె పోస్ట్‌ చేశారు. 'గవర్నర్ ప్రసంగంలో పసలేదు. దిశా-నిర్దేశం అంతకన్నా లేదు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత లేదు. మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే.. బాబు విజన్ 2047కి దమ్ము లేదు. 8 నెలల పాలన కాలయాపన తప్పా ఎక్కడా కమిట్‌మెంట్ కనిపించలేదు. హామీల అమలుకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చింది. రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎక్కడొచ్చాయి? 4 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎవరికిచ్చారు? తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అసలు నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? ఆరోగ్య శ్రీ బకాయిలు ఎప్పుడు చెల్లించారు? కొత్త సీసాలో పాత సారా అనే సామెత లెక్క కూటమి మ్యానిఫెస్టోనే గవర్నర్ చదివారు తప్పిస్తే.. కొత్త అంశాలు ఒక్కటి లేవు' అన్నారు.

ఇక జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధినేత జగన్‌ తీరు మాత్రం మారలేదు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది ? ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా ? ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారు. వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే.. ప్రజాసమస్యల మీద చిత్తశుద్ది ఉంటే .. మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని కోరుతున్నాం. సభకు వెళ్ళే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం.

Tags:    
Advertisement

Similar News