అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ఆప్ ఎమ్మెల్యేల నిరసన
విపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్
ఢిల్లీలో కొత్త శాసనసభ కొలువుదీరింది. ఈ ఉదయం ఢిల్లీ శాసనసభ సమావేశం మొదలైన వెంటనే సీఎం రేఖాగుప్తా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అంతకుముందు అర్విందర్ సింగ్ లవ్లీని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకున్నారు. రాజ్‌నివాస్‌లో ఆయనతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత అసెంబ్లీలో సీఎం రేఖా గుప్తాతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం ఆరుగురు క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్ఠానాల్లో విజయం సాధించగా.. ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది.
మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లోని తొలిరోజే ఆప్ నేతలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. సీఎం కార్యాలయం నుంచి బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలను తొలిగించారని అసెంబ్లీలో విపక్ష నేత ఆతిశీ ఆరోపించారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. బీజేపీ ప్రభుత్వం తమ మొదటి క్యాబినెట్ సమావేశంలోపు ప్రతి మహిళా ఖాతాలో రూ. 2,500 వేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మార్చి 8 నాటికి ఢిల్లీ ఢిల్లీలోని ప్రతి మహిళ ఖాతాలో మహిళా సమ్మాన్ యోజన మొదటి విడత డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా సీఎంను కలవడానికి తమకు సమయం ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్షాలు చేపడుతున్న నిరసనలపై స్పీకర్ విజేందర్ గుప్తా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలకు సభ సజావుగా నడటం ఇష్టం లేదని, సభకు అంతరాయం కలించాలనే ఉద్దేశంతో వారు ఇక్కడికి వచ్చారని వ్యాఖ్యానించారు.