రఫ్పాడించిన స్పానిష్ బుల్ క్వార్టర్స్ లోనే జోకో ప్యాకప్!
ఫ్రెంచ్ ఓపెన్ పురుషులసింగిల్స్ లో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. రికార్డుస్థాయిలో14వసారి ట్రోఫీ అందుకోడానికి 13సార్లు విజేత నడాల్ ఉరకలేస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ ను నాలుగుసెట్ల పోరులో అధిగమించడం ద్వారా టైటిల్ కు మరింత చేరువయ్యాడు. సెమీస్ లో 15వసారి…. గాయాలు, వరుస పరాజయాలతో 5వ ర్యాంక్ కు పడిపోయిన మాజీ నంబర్ వన్ నడాల్..క్వార్టర్ ఫైనల్ దశలోనే టాప్ సీడ్ జోకోవిచ్ తో తలపడాల్సి […]
ఫ్రెంచ్ ఓపెన్ పురుషులసింగిల్స్ లో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. రికార్డుస్థాయిలో14వసారి ట్రోఫీ అందుకోడానికి 13సార్లు విజేత నడాల్ ఉరకలేస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ ను నాలుగుసెట్ల పోరులో అధిగమించడం ద్వారా టైటిల్ కు మరింత చేరువయ్యాడు.
సెమీస్ లో 15వసారి….
గాయాలు, వరుస పరాజయాలతో 5వ ర్యాంక్ కు పడిపోయిన మాజీ నంబర్ వన్ నడాల్..క్వార్టర్ ఫైనల్ దశలోనే టాప్ సీడ్ జోకోవిచ్ తో తలపడాల్సి వచ్చింది.
గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ లో జోకోవిచ్ చేతిలో కంగు తిన్న నడాల్ ఈ సీజన్ టోర్నీలో సైతం అండర్ డాగ్ గా బరిలోకి దిగాడు. జోకోవిచ్ కు నడాల్ సరిజోడీ కాలేడేమోనని అందరూ భావించారు. దానికితోడు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ విజయం కోసం ఐదుసెట్లపాటు పోరాడటం ద్వారా తీవ్రంగా అలసిపోయిన నడాల్ కు క్వార్టర్స్ లో కష్టమేనని టెన్నిస్ విశ్లేషకులు సైతం అంచనా వేశారు. అయితే ఎర్రమట్టి కోర్టు సమరంలో తనకుతానే సాటిగా నిలిచే నడాల్ 4 గంటల 12 నిముషాల పోరులో ప్రపంచ నంబర్ వన్ జోకోవిచ్ పై విజేతగా నిలిచాడు.
ప్రపంచ టెన్నిస్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ఈ సమఉజ్జీల సమరంలో ..తొలిసెట్ ను 6-2తో నెగ్గిన నడాల్ ..4-6తో రెండోసెట్ చేజార్చుకొన్నాడు.
మూడోసెట్ ను 6-2తో సొంతం చేసుకోడం ద్వారా మ్యాచ్ పై పట్టు బిగించాడు. నిర్ణయాత్మక నాలుగో సెట్ 88 నిముషాలపాటు రసపట్టుగా సాగింది. నడాల్ చివరకు టై బ్రేక్ ద్వారా 7-6 ( 7-4 )తో సెట్ ను, సెమీస్ బెర్త్ ను కైవసం చేసుకొన్నాడు.
జోకో ప్రత్యర్థిగా ఎనిమిదో గెలుపు…
ఫ్రెంచ్ ఓపెన్ లో జోకోవిచ్ ప్రత్యర్థిగా నడాల్ కు ఇది ఎనిమిదో విజయం. అంతేకాదు గత 17 సంవత్సరాలలో రోలాడ్ గారోస్ టోర్నీలో నడాల్ ఆడిన మొత్తం 113 మ్యాచ్ ల్లో 110వ గెలుపుకావడం మరో రికార్డు. ఇక…ప్రపంచ నంబర్ వన్ జోకోవిచ్ తో ముఖాముఖీ తలపడిన సమయంలో రికార్డును సైతం 30-29తో నడాల్ సవరించుకోగలిగాడు.
తన టెన్నిస్ జీవితంలో ప్రధాన భాగమైన ఫ్రెంచ్ ఓపెన్ ఎర్రమట్టి కోర్టులో…అదీ జోకోవిచ్ లాంటి గొప్పఆటగాడిపై నెగ్గడం గొప్పఅనుభవమని, ఈ గెలుపు అలసటను మరచిపోయేలా చేసిందని మ్యాచ్ అనంతరం నడాల్ వ్యాఖ్యానించాడు.
35 సంవత్సరాల నడాల్ తన కెరియర్ లో ఇప్పటి వరకూ 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించడం ద్వారా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుత సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను సైతం నెగ్గడం ద్వారా 22 టైటిల్స్ మైలురాయిని చేరాలన్న పట్టుదలతో ఉన్నాడు.
ఫైనల్లో చోటు కోసం శుక్రవారం జరిగే పోరులో ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ తో నడాల్ తలపడనున్నాడు.
స్పానిష్ చిన్నోడికి జ్వెరేవ్ చెక్…
స్పానిష్ మరో పోట్లగిత్త, 19 ఏళ్ళ కుర్రాడు కార్లోస్ అల్కారాజ్ పోరు క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. 3 గంటల 18నిముషాలపాటు సాగిన నాలుగుసెట్ల సమరంలో 3వ సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ 6-4, 6-4, 4-6, 7-6తో విజేతగా నిలిచాడు. విజయానంతరం ప్రత్యర్థి అల్కారాజ్ పైన జ్వెరేవ్ ప్రశంసలవర్షం కురిపించాడు.
రానున్నకాలం అల్కారాజ్ దేనని..తామందరినీ అతను ఓడించక ముందే టైటిల్ నెగ్గేయాలంటూ చలోక్తి విసిరాడు.
ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ సమరంలో 5వ సీడ్ నడాల్ తో జ్వెరేవ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
2020 అమెరికన్ ఓపెన్ రన్నరప్ గా నిలిచిన జ్వెరేవ్ కు గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీస్ కు నాలుగుసార్లు చేరిన రికార్డు ఉంది. అంతేకాదు..టోక్యో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ లో బంగారు పతకం సాధించిన ఘనత కూడా జ్వెరేవ్ కే సొంతం.