నాడు వైఎస్ఆర్ ప్రత్యర్థి.. నేడు మేకపాటిపై పోటీ

నాడు కడప లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పోటీ చేసిన కొండయ్య అనే వ్యక్తి ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డికి పోటీగా బరిలో దిగబోతున్నారు. నామినేషన్లకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన పేరు రావులకొల్లు కొండయ్య. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా వెంటనే వెళ్లి నామినేషన్ వేయడం, పోటీ చేయడం ఆయనకు అలవాటు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కుండలు చేయడం ఆయన వృత్తి.. ఎక్కడ ఎన్నికలు వచ్చినా వెంటనే వెళ్లి […]

Advertisement
Update:2022-05-31 06:09 IST

నాడు కడప లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పోటీ చేసిన కొండయ్య అనే వ్యక్తి ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డికి పోటీగా బరిలో దిగబోతున్నారు. నామినేషన్లకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన పేరు రావులకొల్లు కొండయ్య. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా వెంటనే వెళ్లి నామినేషన్ వేయడం, పోటీ చేయడం ఆయనకు అలవాటు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కుండలు చేయడం ఆయన వృత్తి.. ఎక్కడ ఎన్నికలు వచ్చినా వెంటనే వెళ్లి నామినేషన్ వేయడం ఆయన ప్రవృత్తి. ఇప్పటికే 20సార్లు ఎన్నికల్లో నామినేషన్లు వేసిన ఆయన.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో 21వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధమయ్యారు.

1987నుంచి కొండయ్యకు ఈ అలవాటు ఉంది. అప్పట్లో ఆత్మకూరు పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నామినేషన్ వేసిన ఆయన.. ఆ తర్వాత దాన్ని ఓ అలవాటుగా మార్చుకున్నారు. తన పొలాన్ని కూడా ఈ క్రమంలో అమ్ముకున్నారు. నామినేషన్లు వేయడం, డిపాజిట్ కోల్పోవడం ఆయనకు అలవాటే. అయినా సరే ఎక్కడా వెనకడుగు వేయలేదు. కడపలో వైఎస్ఆర్ కి పోటీగా నామినేషన్ వేసినా, నంద్యాలలో పీవీ నరసింహారావుపై పోటీ చేసినా.. ఆయనకే చెల్లింది.

కేవలం పోటీకి దిగడమే కాదు, నామినేషన్ కోసం డబ్బులు సమకూర్చుకోవడంలో కూడా ఆయనది ఓ వెరైటీ స్టైల్. గతంలో ఓసారి నామినేషన్ వేసేందుకు భిక్షాటన చేసి వచ్చిన చిల్లర తీసుకెళ్లి అధికారుల ముందు కుప్పగా పోశాడు. అది లెక్కబెట్టుకోవడానికే వారు తిప్పలు పడ్డారని గతాన్ని గుర్తు చేసుకుంటారు కొండయ్య. ఓసారి నంద్యాల ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళ్లగా.. మూడు రోజులపాటు తనను కిడ్నాప్ చేశారని, అది ఓ అనూహ్య సంఘటన అని చెబుతుంటారు కొండయ్య.

ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా మరోసారి కొండయ్య వార్తల్లోకెక్కారు. 21వసారి నామినేషన్ వేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఎన్నికలంటే ఆయనకు చాలా ఆసక్తి. ఆ ఆసక్తే ఆయన్ను వార్తల్లో వ్యక్తిగా నిలబెట్టింది.

Tags:    
Advertisement

Similar News