ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతకలహాలు సృష్టించబోతున్నారా ?
మతసామరస్యంతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతకలహాలు సృష్టించబోతున్నారా ? లేవనెత్తడానికి ఏ సమస్యలూ దొరకని రాజకీయ పార్టీలు మతమే టార్గెట్ గా పావులు కదుపుతున్నాయా ? ఈ మధ్య కాలంలో ముఖ్యంగా బుధవారం నాటి బండి సంజయ్ ఉపన్యాసం వింటే ఆ అనుమానాలు కలగక మానవు. ఇప్పటి వరకు ఉత్తర భారతంలోనే ఉన్న మందిర్, మసీదు గొడవలు తెలంగాణలో సృష్టించడానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ప్రయత్నాలు ప్రారంభించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కరీం నగర్ లో జరిగిన హనుమాన్ […]
మతసామరస్యంతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతకలహాలు సృష్టించబోతున్నారా ? లేవనెత్తడానికి ఏ సమస్యలూ దొరకని రాజకీయ పార్టీలు మతమే టార్గెట్ గా పావులు కదుపుతున్నాయా ? ఈ మధ్య కాలంలో ముఖ్యంగా బుధవారం నాటి బండి సంజయ్ ఉపన్యాసం వింటే ఆ అనుమానాలు కలగక మానవు.
ఇప్పటి వరకు ఉత్తర భారతంలోనే ఉన్న మందిర్, మసీదు గొడవలు తెలంగాణలో సృష్టించడానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ప్రయత్నాలు ప్రారంభించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కరీం నగర్ లో జరిగిన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు మత వేడిని రగిలిస్తున్నాయి.
వారణాసి లోని జ్ఞానవాపి మసీదు వివాదం నేపథ్యంలో… ”అక్కడ తవ్వితే శివలింగాలు వచ్చాయి. తెలంగాణలోని మసీదులు తవ్వితే కూడా శివలింగాలు బైటపడతాయి. మసీదులన్నీ తవ్వాలి. శవాలొస్తే మీకు శివలింగాలొస్తే మాకు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తామంటూ ప్రకటించారు సంజయ్.
దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ సమస్యలే లేనట్టు మతోన్మాద సమస్యలను లేవనెత్తడం బీజేపీకి ఇవ్వాళ్ళ కొత్త కాదు కానీ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలనుకోవడం మాత్రం క్షమించరానిది. గంగా జమున తెహజీబ్ లాగా కలిసి జీవిస్తున్న తెలంగాణ ప్రజల మధ్య విద్వేష భీజాలు నాటడం అంటే తెలంగాణను మరో ఉత్తరప్రదేశ్ లాగా తయారు చేయడమే.
ప్రజల ఆకలి ఎలా తీర్చాలి? వ్యవసాయాన్ని లాభాలబాట ఎలా పట్టించాలి? నిరుద్యోగం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మహిళలపై అత్యాచారాలు లేని సమాజాన్ని ఎలా సృష్టించాలి ? విద్యా, వైద్య రంగాల్లో అభివృద్దికి ఏం చేయాలి ? ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి ? ఇవి కదా రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది. వీటన్నింటి పట్ల కనీస అవగాహనలేని వాళ్ళు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దారి తెలియనివాళ్ళు , పాలన అంటే ఓనమాలు కూడా రాని వాళ్ళు మాట్లాడే మాటలే కూలగొడతాం…పగలగొడతాం…. చంపేస్తాం…నరికేస్తాం…. అని. ఇవి సమాజంలో కాదు కదా ఒక వ్యక్తి జీవితంలో కూడా మార్పును తేలేవు. వాళ్ళకు కొద్ది రోజులపాటు ఓట్లను రాలుస్తాయేమే… అందరినీ కొంత కాలంపాటు మోసం చేయవచ్చు, కొందరిని ఎల్లకాలం మోసం చేయవచ్చు, అయితే అందరినీ ఎల్లకాలమూ మోసం చేయడం అసాధ్యం.
ALSO READ: దావోస్ టు విశాఖ..