300 శాతం రేట్లు పెంచి 30శాతం తగ్గిస్తారా..? ట్విట్టర్ లో కేటీఆర్ పంచ్

ఓవైపు విదేశీ పర్యటనలతో బిజీగా ఉంటూ, మరోవైపు దేశ రాజకీయ వ్యవహారాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు మంత్రి కేటీఆర్. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించి.. ప్రజలకు ఉపకారం చేశామంటున్న కేంద్ర ప్రభుత్వంపై ఆయన ట్విట్టర్లో విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు 300 శాతం పెరిగాయని, కానీ తగ్గించింది మాత్రం కేవలం 30శాతం మాత్రమేనని చెప్పారు కేటీఆర్. ఇది కంటితుడుపు చర్యకాక ఇంకేంటని ప్రశ్నించారు. 2014, 2022లో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు […]

Advertisement
Update:2022-05-23 06:11 IST

ఓవైపు విదేశీ పర్యటనలతో బిజీగా ఉంటూ, మరోవైపు దేశ రాజకీయ వ్యవహారాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు మంత్రి కేటీఆర్. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించి.. ప్రజలకు ఉపకారం చేశామంటున్న కేంద్ర ప్రభుత్వంపై ఆయన ట్విట్టర్లో విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు 300 శాతం పెరిగాయని, కానీ తగ్గించింది మాత్రం కేవలం 30శాతం మాత్రమేనని చెప్పారు కేటీఆర్. ఇది కంటితుడుపు చర్యకాక ఇంకేంటని ప్రశ్నించారు.

2014, 2022లో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు ఒకేలా ఉన్నాయని, కానీ 2014 భారత్ మార్కెట్లో పెట్రోలు లీటరు రూ.70 కాగా.. ఇప్పుడు రూ.120 ఎలా అయిందని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో వ్యాట్‌ పెరగలేదని, కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇంధన ధరలు పెరిగాయని వివరించారు. 2014లో పెట్రోల్ పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూ.3.57 గా ఉండేదని, దాన్ని రూ.27.90 కి చేర్చింది బీజేపీయేనని ధ్వజమెత్తారు. కేంద్రం వసూలు చేస్తున్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, రోడ్లు, మౌలిక వసతుల సెస్‌, వ్యవసాయ అభివృద్ధి సెస్‌, ఇతర సెస్‌ ల వల్లనే ఇంధన ధరలు మనదేశంలో అత్యధికంగా ఉన్నాయని చెప్పారాయన. ఈ సెస్ లన్నిటినీ తగ్గిస్తే 2014లో మాదిరిగా పెట్రోలు లీటరు 70 రూపాయలకే లభిస్తుందని అన్నారు.

కేటీఆర్ చెప్పిన చిన్ననాటి కథ..
దేశంలో పెట్రోల్ ధరల పెంపు, తగ్గింపు ఎలా ఉన్నాయనే విషయంపై కేటీఆర్ తన చిన్ననాటి కథ పెచ్చారు. తన చిన్నతనంలో పాఠశాల పక్కన ఒక దుకాణం ఉండేదని, విద్యార్థుల రద్దీ సమయంలో దాని యజమాని తినుబండారాల ధరలను ఓసారి 300 శాతం పెంచాడని, అందరూ గట్టిగా అడిగితే 30 శాతం తగ్గించాడని, అది చూసి కొంతమంది దాన్ని ఓ బంపర్‌ ఆఫర్‌ గా భావించారని చెప్పారు. ఇప్పుడు కేంద్రం తీరు అలాగే ఉందని దుయ్యబట్టారు.

లాభం కేంద్రానిది.. నష్టం రాష్ట్రాలది..
ఇంధనాల ధరల తగ్గుదలను కేంద్రమే భరిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారని, కానీ వాస్తవం వేరని అన్నారు కేటీఆర్. ఇంధన ఎక్సైజ్‌ డ్యూటీపై 42 శాతం వాటా రాష్ట్రాలదని, కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్రాలు పెట్రోల్ పై రూ.2.52, డీజిల్‌ పై రూ.3.36 రాబడిని కోల్పోతున్నాయని వివరించారు. కేంద్రం సెస్ లు తగ్గిస్తే అప్పుడు నిజమైన త్యాగం అనుకోవచ్చని ట్వీట్ చేశారు.

నేటినుంచి 4రోజులపాటు దావోస్ పర్యటన..
యూకే పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ దావోస్ చేరుకున్నారు. ఈరోజునుంచి 4 రోజులపాటు ఆయన.. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచంలోని పలు ప్రతిష్టాత్మక కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఆర్థిక వేదిక సదస్సు తర్వాత ఈనెల 26న స్విట్జర్లాండ్‌ లోని జ్యూరిచ్ లో పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు.

Tags:    
Advertisement

Similar News