పగడ్బందీగా పది పరీక్షలు.. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ పై హర్షం..
తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు పది పరీక్షలు నిర్వహించలేదు, ఆల్ పాస్ అనేశారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పబ్లిక్ పరీక్షలకు ఈసారి అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.09 లక్షలమంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష సమయం. 15నిమిషాల […]
తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు పది పరీక్షలు నిర్వహించలేదు, ఆల్ పాస్ అనేశారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పబ్లిక్ పరీక్షలకు ఈసారి అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.09 లక్షలమంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష సమయం.
15నిమిషాల గ్రేస్ పీరియడ్..
సిలబస్ తగ్గించడంతోపాటు ఈసారి అదనంగా 15 నిమిషాలు విద్యార్థులకు సమయం ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చిన తల్లిదండ్రులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 9.30కి పరీక్ష మొదలైన తర్వాత 15నిమిషాల సమయాన్ని పరీక్ష పేపర్ చదువుకోడానికి కేటాయించారు. మిగిలిన 3గంటల సమయం పరీక్ష రాయడానికి కేటాయిస్తున్నారు. మొత్తం సిలబస్ లో కేవలం 70శాతం నుంచి మాత్రమే ప్రశ్నలను ఇస్తున్నారు. ఇక 11 పేపర్లను కుదించి 6 పేపర్లుగా మార్చారు. పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలుసుకోడానికి ‘సెంటర్ లొకేషన్’ యాప్ కూడా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతోంది. 5 నిముషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి రానివ్వబోమంటూ ముందుగానే హెచ్చరించడంతో విద్యార్థులంతా అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
పగడ్బందీ ఏర్పాట్లు..
ఏపీలో కరోనా తర్వాత జరిగిన పదో తరగతి పరీక్షల అనుభవంతో తెలంగాణ ప్రభుత్వం, అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సిబ్బంది సైతం ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకుండా నిషేధించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులను మాత్రమే ఉంచి పరీక్ష రాయిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా నీడన పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తమ్మీద ఈ ఏడాది పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది.