ఒక్కమ్యాచ్ లో అరడజను రికార్డులు ఐపీఎల్ లో లక్నోసూపర్ జెయింట్స్ సంచలనం

టాటా –ఐపీఎల్ 15వ సీజన్ ద్వారా అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..మొత్తం 14 రౌండ్ల లీగ్ సమరాన్ని విజయవంతంగా ముగించడమే కాదు..18 పాయింట్లతో ప్లే-ఆఫ్ రౌండ్ కు అర్హత సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది. మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంబై డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన 14వ, ఆఖరిరౌండ్ మ్యాచ్ లో లక్నో అరడజను సరికొత్త రికార్డులతో పాటు..ఆఖరుబంతిని కాపాడుకోడం ద్వారా 2 పరుగుల సంచలన […]

Advertisement
Update:2022-05-19 08:42 IST

టాటా –ఐపీఎల్ 15వ సీజన్ ద్వారా అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..మొత్తం 14 రౌండ్ల లీగ్ సమరాన్ని విజయవంతంగా ముగించడమే కాదు..18 పాయింట్లతో ప్లే-ఆఫ్ రౌండ్ కు అర్హత సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది.

మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంబై డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన 14వ, ఆఖరిరౌండ్ మ్యాచ్ లో లక్నో అరడజను సరికొత్త రికార్డులతో పాటు..ఆఖరుబంతిని కాపాడుకోడం ద్వారా 2 పరుగుల సంచలన విజయం సొంతం చేసుకొంది.

ఓపెనింగ్ జోడీ అజేయరికార్డు….

ఐపీఎల్ 15 సీజన్ల చరిత్రలో ఓపెనింగ్ జోడీ అజేయంగా నిలవడం ద్వారా 210 పరుగుల అతిపెద్ద భాగస్వామ్యం నమోదు చేసిన ఘనతను లక్నో ఓపెనర్స్ క్వింటన్ డీ కాక్, కెఎల్ రాహుల్ దక్కించుకొన్నారు.
డీ కాక్ కేవలం 70 బాల్స్ లోనే 10 బౌండ్రీలు, 10 సిక్సర్లతో 140 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిస్తే…రాహుల్ 51 బాల్స్ లో 4 సిక్సర్లు, 3 బౌండ్రీలతో 68 పరుగుల అజేయభాగస్వామ్యం నమోదు చేశాడు.

ఈ క్రమంలో మొదటి వికెట్ కు అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ జోడీగా రికార్డుల్లో చేరారు.

గతంలో సన్‌రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో-డేవిడ్ వార్నర్ పేరిటే అత్యుత్తమ ఓపెనింగ్ రికార్డు ఉండేది. 2019లో ఈ జోడీ తొలి వికెట్‌కు 185 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. అంతకుముందు 2017 సీజన్‌లో కోల్ కతా ఓపెనింగ్ జోడీ గౌతం గంభీర్-క్రిస్ లిన్‌లు మొదటి వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

పవర్ ప్లే ఓవర్లలో 44 పరుగులు సాధించిన రాహుల్- డికాక్ జోడీ..ఆఖరి 5 ఓవర్లలో 88 పరుగులు రాబట్టడం మరో రికార్డు.

డి కాక్- రాహుల్ జోడీ 210 పరుగుల నాటౌట్ స్కోరుతో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేయగా..2016 సీజన్లో గుజరాత్ లయన్స్ తో ముగిసిన పోరులో బెంగళూరు జోడీ విరాట్ కొహ్లీ- ఏబీ డివిలియర్స్ 229 పరుగులు, 2015 సీజన్లో ముంబైతో ముగిసిన పోరులో బెంగళూరు తరపున కొహ్లీ- డివిలియర్స్ జోడీ 215 పరుగుల నాటౌట్ స్కోరు భాగస్వామ్యాలు నమాదు చేశారు.
ఐపీఎల్ చరిత్రలో ఈ మూడు అత్యుత్తమ భాగస్వామ్యాల రికార్డులుగా నిలిచిపోయాయి.

మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు..

క్వింటన్ డీ కాక్ సాధించిన 140 పరుగుల నాటౌట్ స్కోరు ఐపీఎల్ చరిత్రలోనే మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. మొదటి రెండు అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్లు సాధించినవారిలో క్రిస్ గేల్, బ్రెండన్ మెకల్లమ్ ఉన్నారు.

2013 సీజన్లో పూణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఓపెనర్ గా క్రిస్ గేల్ 175 పరుగుల నాటౌట్ స్కోరు నమోదు చేశాడు. ఇదే గత 15 సీజన్లుగా అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుగా కొనసాగుతూ వస్తోంది.

2008 ప్రారంభ ఐపీఎల్ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రత్యర్థిగా జరిగిన పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ 158 పరుగుల నాటౌట్ స్కోరు నమోదు చేశాడు. ఇది రెండో అత్యుత్తమస్కోరుగా రికార్డుల్లో చేరింది.

40 ఓవర్లలో 418 పరుగులు….

లక్నో- కోల్ కతా జట్లు కలసి మొత్తం 40 ఓవర్లలో 418 పరుగులు నమోదు చేయడం మరో అసాధారణ రికార్డుగా మిగిలిపోతుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో
20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు సాధిస్తే…సమాధానంగా కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రస్తుత సీజన్లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్ గా ఇది నిలిచింది.

గత 15 సీజన్లలో ఇదే తొలి జోడీ…

ఐపీఎల్‌ చరిత్రలోనే 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచి..అజేయ భాగస్వామ్యం నమోదు చేసిన ఏకైక జోడీగా డికాక్‌-రాహుల్‌ గుర్తింపు పొందారు. లీగ్‌ గత 15 సీజన్ల చరిత్రలో ఏ జోడీ కూడా మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ కొనసాగించలేదు.

అంతేకాదు…కోల్ కతా నైట్ రైడర్స్ ప్రత్యర్థిగా డికాక్-రాహుల్‌ జోడీ అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని (210 పరుగుల నాటౌట్) నమోదు చేసింది.

2017లో సన్ రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్-శిఖర్ ధవన్‌లు తొలి వికెట్‌కు 139 పరుగులు జతచేశారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కోల్ కతాపై ఇదే అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యంగా ఉంటూ వచ్చింది.

టీ-20 చరిత్రలోనే అత్యుత్తమ భాగస్వామ్యం…

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్ చరిత్రలోనే డికాక్‌-రాహుల్‌ జోడీ అరుదైన రికార్డును సాధించింది. ఈ జోడీ అజేయంగా నిలిచిన నాలుగో ఓపెనింగ్‌ జోడీగా రికార్డుల్లో నిలిచింది.
2013 బంగ్లా ప్రీమియర్ లీగ్ పోరులో నఫీస్‌-రాజ్‌షాహీ జోడీ తొలిసారి టీ-20ల్లో అజేయమైన ఓపెనింగ్‌ జోడీ (20 ఓవర్లు ఆడి)గా నిలువగా… 2017లో పాక్‌ వేదికగా జరిగిన టీ-20 కప్‌మ్యాచ్ లో కమ్రాన్‌ అక్మల్‌- సల్మాన్‌ బట్‌ జోడీ.. ఇదే ఏడాది (2022) జిబ్రాల్టర్‌-బల్గేరియా మధ్య జరిగిన అంతర్జాతీయ టీ20లో బ్రూస్‌-పాయ్‌ జోడీ అజేయ ఓపెనింగ్‌ జోడీలుగా నిలిచారు.

రాహుల్ పాంచ్ పటాకా!

ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ వరుసగా ఐదో ఏడాది 500 పరుగుల మైలురాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. గతంలోనే డేవిడ్ వార్నర్ వరుసగా ఆరుసీజన్ల పాటు 500కు పైగా పరుగులు సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు. రాహుల్‌ , విరాట్ , శిఖర్ ధావన్ లో ఐదేసిసార్లు …500 పరుగుల రికార్డు సాధించడం ద్వారా సంయుక్త ద్వితీయస్థానంలో కొనసాగుతున్నారు.
మరోవైపు.. ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఘనతను డికాక్ దక్కించుకొన్నాడు. అంతేకాదు ఓమ్యాచ్ లో 10 సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ డీ కాక్ నిలిచాడు.

2019 సీజన్లో ముంబై ఆటగాడు కిరాన్ పోలార్డ్ ఓ మ్యాచ్ లో 10 సిక్సర్లు బాదితే..ఆ రికార్డును ప్రస్తుత 15వ సీజన్లో డీ కాక్ సమం చేశాడు.

ఓపెనర్ల 500 పరుగుల రికార్డు…

ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్లిద్దరూ 500 పరుగుల చొప్పున సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ జోడీ రుతురాజ్ గైక్వాడ్-ఫాఫ్ డుప్లెసిస్ ఈ అరుదైన ఘనతను సాధించగా…ప్రస్తుత సీజన్లో డీ కాక్- రాహుల్ జోడీ అదే ఘనతను సొంతం చేసుకోగలిగారు.
లీగ్ దశలో ఆడిన మొత్తం 14 మ్యాచ్ ల్లో రాహుల్ 537 పరుగులు, డీ కాక్ 502 పరుగులు సాధించడం విశేషం.

ఒక్కమ్యాచ్ లోనే అరడజనుకు పైగా అరుదైన రికార్డులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

Tags:    
Advertisement

Similar News