ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో మృత్యు ఘోష

11 నెలల్లో 42 మంది విద్యార్థుల మృతి.. మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-11-17 13:02 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో మృత్యు ఘోష కొనసాగుతోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 11 నెలల్లో 42 మంది గురుకుల విద్యార్థులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పేర్లతో కూడిన వివరాలను 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. 42 మంది విద్యార్థులు మృతిచెందినా ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడం సిగ్గు చేటన్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదన్నారు. బాలల దినోత్సవం రోజున ప్రగ్బలాలు పలకడం తప్ప సీఎం విద్యార్థుల బాగు కోసం ఏ ఒక్క పని చేయడం లేదన్నారు. సంగారెడ్డి బీసీ గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తనను కలచి వేసిందన్నారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారని, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. విద్యార్థుల మరణాలకు రేవంత్‌ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. వాంకిడి గురుకుల విద్యార్థి 17 రోజులుగా నిమ్స్‌ లో వెంటిలేటర్‌ పై ఉందని, దానికి కారణం ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో దేశానికి రోల్‌ మోడల్‌ గా నిలిచిన గురుకులాలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకు దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలు ఇప్పుడు నరకకూపంలా మారాయని, విద్య, సంక్షేమం సహా అన్ని శాఖలను ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకొని నిర్లక్ష్యం చేస్తుండటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఇంకా ఎంత మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవాలని ప్రశ్నించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.



Tags:    
Advertisement

Similar News