అక్షర్ పటేల్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ లో 100 వికెట్లు, 1000 పరుగులు
టాటా ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంతితో పాటు బ్యాటుతోనూ రాణించడం ద్వారా దిగ్గజాల సరసన నిలిచాడు. నవీ ముంబై స్టేడియం వేదికగా కింగ్స్ పంజాబ్ తో ముగిసిన మ్యాచ్ ద్వారా అక్షర్ ఈ ఘనతను సాధించాడు. 100 వికెట్ల క్లబ్ లో అక్షర్.. ఐపీఎల్ గత 15 సీజన్ల చరిత్రలో వంద వికెట్లు పడగొట్టిన బౌలర్ల క్లబ్ లో […]
టాటా ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంతితో పాటు బ్యాటుతోనూ రాణించడం ద్వారా దిగ్గజాల సరసన నిలిచాడు. నవీ ముంబై స్టేడియం వేదికగా కింగ్స్ పంజాబ్ తో ముగిసిన మ్యాచ్ ద్వారా అక్షర్ ఈ ఘనతను సాధించాడు.
100 వికెట్ల క్లబ్ లో అక్షర్..
ఐపీఎల్ గత 15 సీజన్ల చరిత్రలో వంద వికెట్లు పడగొట్టిన బౌలర్ల క్లబ్ లో అక్షర్ పటేల్ చోటు సంపాదించాడు. కింగ్స్ పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ను అవుట్ చేయడం ద్వారా అక్షర్ తన వందో వికెట్ ను అందుకోగలిగాడు. గతంలో కింగ్స్ పంజాబ్ జట్టులో సభ్యుడిగా ఉన్న అక్షర్ ప్రస్తుత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ లో వంద వికెట్లు పడగొట్టిన తొమ్మిదో బౌలర్ గా నిలిచాడు.
వెయ్యి పరుగులతో మరో రికార్డు..
100 వికెట్లతో పాటు 1000 పరుగులు సాధించిన నాలుగో ఆల్ రౌండర్ ఘనతను అక్షర్ సొంతం చేసుకొన్నాడు. ఐపీఎల్ లో బౌలర్ గా 100 వికెట్లు, బ్యాటర్ గా 1000 పరుగులు సాధించిన మరో ముగ్గురు మొనగాళ్ళు ( రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, డ్వయన్ బ్రావో) సరసన అక్షర్ పటేల్ నిలిచాడు.
ప్రస్తుత సీజన్ లీగ్ 12వ రౌండ్ లో కింగ్స్ పంజాబ్ తో ముగిసిన మ్యాచ్ వరకూ..అక్షర్ పటేల్ మొత్తం 121 మ్యాచ్ లు ఆడి 44 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 1116 పరుగుల స్కోరు నమోదు చేశాడు. ఇక..లెఫ్టామ్ స్పిన్నర్ గా 121 మ్యాచ్ ల్లో 120 ఇన్నింగ్స్ లో 101 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 15వ సీజన్ కోసం ఇటీవలే నిర్వహించిన మెగా వేలం ద్వారా అక్షర్ పటేల్ ను 5 కోట్ల రూపాయల ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకొంది. తన రేటుకు తగ్గ ఆటతో ఆక్షర్ డిల్లీ ఫ్ర్రాంచైజీని పైసా వసూల్ అనుకొనేలా చేస్తున్నాడు.