అయోధ్య రాముడికంటే.. భద్రాద్రి రాముడు తీసిపోయాడా..?

బీజేపీ దృష్టిలో అయోధ్య రాముడు వేరు, భద్రాద్రి రాముడు వేరంటూ మండిపడ్డారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయన పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి కేటీఆర్ నిన్న అమిత్ షా కు 27 ప్రశ్నలతో సుదీర్ఘ బహిరంగ లేఖ విడుదల చేయగా.. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అమిత్ షా ని డిమాండ్ చేశారు. మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప […]

Advertisement
Update:2022-05-14 09:15 IST

బీజేపీ దృష్టిలో అయోధ్య రాముడు వేరు, భద్రాద్రి రాముడు వేరంటూ మండిపడ్డారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయన పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి కేటీఆర్ నిన్న అమిత్ షా కు 27 ప్రశ్నలతో సుదీర్ఘ బహిరంగ లేఖ విడుదల చేయగా.. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అమిత్ షా ని డిమాండ్ చేశారు.

మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాడటం లేదన్న సామెత కేంద్ర ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని విమర్శించారు రేవంత్ రెడ్డి. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ బూటకమని తేలిపోయిందని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి తెలంగాణకు వస్తున్న అమిత్ షా.. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి.

ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని బీజేపీ ఉపేక్షిస్తూ వస్తోందని, దీని వెనక రహస్యం ఏంటని.. ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు.

గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో నరేంద్రమోదీ తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యల్ని తాము అప్పుడే ఖండించామని.. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న అమిత్ షా.. మోదీ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదని బీజేపీ భావిస్తోందా అని ప్రశ్నించారు.

పసుపు బోర్డ్ ఏమైంది..?
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి గెలిస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ సింగ్ స్వయంగా హామీ ఇచ్చారని, అభ్యర్థి ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ కూడా రాసిచ్చారని, దాని మాట ఏమైందని ప్రశ్నించారు. మూడేళ్లవుతున్నా పసుపు బోర్డ్ తీసుకు రాకపోవడం మోసం కాదా అని అన్నారు.

విభజన చట్టంలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాంటి పథకాలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఆ పథకాలన్నిటికీ మంగళం పాడారని అన్నారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా రామాయణం సర్క్యూట్ పేరిట తీర్థయాత్రల రైలు ప్రవేశ పెట్టారని, ఈ మార్గంలో మీకు భద్రాచలం కనపడలేదా అని ప్రశ్నించారు. బీజేపీ దృష్టిలో అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు ఒక్కటి కాదా అని అడిగారు.

తెలంగాణలో ఉన్న రెండు ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇవ్వకుండా పొరుగు రాష్ట్రం కర్నాటకలో అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇవ్వడమేంటని ప్రశ్నించారు. సెస్సుల పేరుతో తెలంగాణ ప్రజలను చావగొడుతున్నారని అన్నారు. తెలంగాణను దారుణంగా మోసం చేసిన బీజేపీ నేతల్ని ఈ ప్రాంత ప్రజలు ఎందుకు స్వాగతించాలన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలంగాణకు ఏ మొహం పెట్టుకొని వస్తారని అమిత్ షా ని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News