దేశద్రోహ చట్టం దుర్వినియోగం " బీజేపీ సర్కారు నిర్వాకం

124 ఏ దేశ ద్రోహం కేసు పై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు దృష్ట్యా ఈ సెక్షన్ పై దేశవ్యాప్త చర్చజరుగుతోంది. బ్రిటిష్ పాలకులు స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణిచివేయడం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని స్వాతంత్య్రభారతంలో కొనసాగించడంపై అనేక దశాబ్ధాలుగా నిరసన వ్యక్తమవుతూనే ఉన్నది. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ కారణాల రీత్యా, తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశద్రోహ కేసులు బనాయిస్తున్నారని ప్రతిపక్షాలు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. […]

Advertisement
Update:2022-05-13 05:28 IST

124 ఏ దేశ ద్రోహం కేసు పై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు దృష్ట్యా ఈ సెక్షన్ పై దేశవ్యాప్త చర్చజరుగుతోంది. బ్రిటిష్ పాలకులు స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణిచివేయడం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని స్వాతంత్య్రభారతంలో కొనసాగించడంపై అనేక దశాబ్ధాలుగా నిరసన వ్యక్తమవుతూనే ఉన్నది. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ కారణాల రీత్యా, తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశద్రోహ కేసులు బనాయిస్తున్నారని ప్రతిపక్షాలు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి ఈ కేసుల్లో 2 శాతం కూడా శిక్షలు పడటం లేదన్నది చూస్తే దుర్వినియోగం ఎలా జరుగుతుందో అర్దమవుతున్నది.

కేంద్ర ప్రభుత్వ లెక్కలప్రకారమే 2014 , 2019 మధ్య కాలంలో 326 దేశద్రోహ కేసులు నమోదుకాగా అందులో ఆరుగురికి మాత్రమే శిక్షపడింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2014, 2019 మధ్య దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం 326 కేసుల్లో 141 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు కాగా ఈ ఆరేళ్ల కాలంలో ఆరుగురికి మాత్రమే శిక్షలు పడ్డాయని అధికారులు తెలిపారు.

ఇందులో అస్సాంలో 54 కేసులు నమోదు కాగా అందులో 26 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా, 25 కేసుల్లో విచారణ పూర్తయింది. ఏ ఒక్క కేసులోనూ నేర నిరూపణ కాలేదు.

జార్ఖండ్‌లో ఆరేళ్లలో సెక్షన్ 124 (ఎ) కింద 40 కేసులు నమోదు చేయగా, అందులో 29 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా, 16 కేసుల్లో విచారణ పూర్తయింది. రాష్ట్రంలో నమోదైన ఈ కేసులన్నింటిలో ఒకరికి మాత్రమే శిక్ష పడింది.

హర్యానాలో, దేశద్రోహ చట్టం కింద 31 కేసులు నమోదయ్యాయి, 19 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగాఆరు కేసులలో విచారణ పూర్తయింది. ఇక్కడ కూడా ఒకరికే శిక్ష పడింది.

బీహార్, జమ్మూ కాశ్మీర్, కేరళలో దేశద్రోహ చట్టం కింద ఒక్కో రాష్ట్రంలో 25 కేసులు నమోదయ్యాయి.
బీహార్, కేరళ లో ఏ ఒక్క కేసులోనూ ఛార్జిషీట్ దాఖలు చేయలేకపోగా, జమ్మూ కాశ్మీర్ లో మూడు కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు.

కర్ణాటకలో 22 కేసులు నమోదు కాగా 17 కేసుల్లో చార్జిషీట్ లు దాఖలు చేశారు. అయితే ఒక్క కేసులో మాత్రమే విచారణ పూర్తయింది. ఆరేళ్లలో రాజద్రోహ చట్టం కింద ఒక్కరికి కూడా శిక్ష పడలేదు.

2014, 2019 మధ్య ఉత్తరప్రదేశ్‌లో 17, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దేశద్రోహ కేసులు నమోదయ్యాయి.
యూపీలో ఎనిమిది కేసులు, పశ్చిమ బెంగాల్‌లో ఐదు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా, రెండు రాష్ట్రాల్లో ఎవరికీ శిక్ష పడలేదు.

ఢిల్లీలో, 2014,2019 మధ్య నాలుగు దేశద్రోహ కేసులు నమోదయ్యాయి, ఏ కేసులోనూ ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. ఎవరినీ దోషులుగా నిర్ధారించలేదు.

మేఘాలయ, మిజోరం, త్రిపుర, సిక్కిం, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి, చండీగఢ్,డయ్యూ డామన్ , దాద్రా నగర్ హవేలీలలో ఆరేళ్ల కాలంలో ఎలాంటి దేశద్రోహం కేసు నమోదు కాలేదు. మహారాష్ట్ర , పంజాబ్ , ఉత్తరాఖండ్ ల‌లో ఒక్కో దేశద్రోహం కేసు నమోదైంది.

హోం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2019 దేశంలో అత్యధికంగా 93 దేశద్రోహ కేసులు నమోదయ్యాయి.
2018లో 70 కేసులు నమోదు కాగా, 2017లో 51, 2014లో 47, 2016లో 35, 2015లో 30 కేసులు నమోదయ్యాయి. దేశంలో 2019లో నాలుగు, 2018లో 38, 2017లో 27, 2016లో 16, 2014లో 14, 2015లో ఆరు ఛార్జిషీట్లు దాఖలయ్యాయి.

అయితే ఇవి ప్రభుత్వ లెక్కలు మాత్రమే ‘ఆర్టికిల్ 14’ అనే పరిశోదనా సంస్థ దేశద్రోహ కేసుల పై అధ్యయనం చేసి నరేంద్రమోదీ పదవీ కాలంలో ఇంతవరకు 7136 మందిని ఈ నేరారోపణతో జైళ్ళకు పంపారని తేల్చింది. ఇదే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో 3762 మంది మీద దేశద్రోహ కేసులు నమోదు చేసి జైళ్ళకు పంపారని ఆ సంస్థ తెలిపింది. 2014 తర్వాత పెట్టిన రాజద్రోహం కేసులలో 96 శాతం అధికారంలోని రాజకీయ నాయకులను విమర్శించినందుకే పెట్టారని తేల్చి చెప్పింది ‘ఆర్టికిల్ 14’ సంస్థ.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించారనే కారణంతోతో 149 మంది పైన, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించినందుకు 144 మంది పైన దేశ‌ద్రోహం కేసులు పెట్టి జైల్లో పెట్టారు.

రైతు ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆరుగురిపై, హత్రాస్ గ్యాంగ్ రేప్‌ను రిపోర్ట్ చేసినందుకు, చేయడానికి వెళ్ళినందుకు 22 మంది పైన, CAA (పౌరసత్వ సవరణ చట్టం) ను నిరసించినందుకు 25 మంది పైన దేశ‌ద్రోహం కేసులు పెట్టారు.

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి కుమారుడు తన వాహనాన్ని రైతులపైకి తోలి నలుగురిని చంపేసిన సంఘటనలో పూర్తి వివరాలు తెలియకముందు పోలీసు కాల్పుల్లో ఒక రైతు మృతి చెందాడని ట్వీట్ చేసినందుకు జర్నలిస్టుల పైన, ఎంపీ శశిథరూర్ పైన దేశ‌ద్రోహం కేసులు పెట్టారు.

ఇదంతా ఒక ఎత్తైతే జార్ఖండ్ లో 2017 లో బీజేపీ ప్రభుత్వ కాలంలో ఉద్యమించిన ఆదివాసులపై పెట్టిన దేశద్రోహ కేసులు సంచలనం కలిగించాయి. గ్రామ సభ అనుమతి లేకుండా తమ భూములు ప్రభుత్వం లాక్కోవడానికి వీల్లేదని ఆదివాసులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ‘పాతాల్ గడి’ ఉద్యమం పేరుతో పేరొందిన ఆ ఉద్యమ సమయంలో 10 వేల మంది ఆదివాసీ రైతులపై ప్రభుత్వ దేశద్రోహం కేసులు నమోదు చేసింది.

ఇలా దేశంలో అనేక చట్టాల లాగే దేశద్రోహ చట్టం కూడా విపరీతమైన దుర్వినియోగానికి గురైందని హక్కుల సంఘాలు చాలా కాలంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇన్నాల్టికి మన దేశ ఛీఫ్ జస్టిస్ ఎన్. వీ. రమణ ఆ చట్టం రద్దు కోసం పట్టుబడుతుండటాన్నిహక్కుల సంఘాలు ఆహ్వానిస్తున్నాయి. అదొక్కటే కాకుండా ఆ విధంగా దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపైకి ఎక్కుపెడుతున్న యూఏపీఏ వంటి చట్టాలను కూడా పునంసమీక్ష చేయాలని, పౌరహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాగా దేశద్రోహ చట్టాన్ని పునం సమీక్ష‌ చేస్తామని సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తి వేస్తుందా లేదా చట్టానికి కొన్ని మార్పులు చేసి మరో పేరుతో ఇదే చట్టాన్ని తీసుకవస్తుందా అనేది వేచి చూడాలి

Tags:    
Advertisement

Similar News