పబ్బులు త‌ప్ప‌.. ఎడ్లు, వడ్లు తెలియవు..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇస్తామంటూ గతంలో సుష్మా స్వరాజ్ ప్రకటించారని, ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే, తెలంగాణపై వారందరికీ ప్రేమ ఉంటే.. ఆ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ప్రకటించి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. పాలమూరు పచ్చబడుతుంటే ప్రతిపక్షాల కళ్లు ఎర్రబడుతున్నాయని.. ఇక్కడ చెరువులు నిండుతుంటే వారి గుండెలు మండుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం ఒక్క పైసా ఆర్థిక […]

Advertisement
Update:2022-05-10 02:09 IST

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇస్తామంటూ గతంలో సుష్మా స్వరాజ్ ప్రకటించారని, ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే, తెలంగాణపై వారందరికీ ప్రేమ ఉంటే.. ఆ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ప్రకటించి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. పాలమూరు పచ్చబడుతుంటే ప్రతిపక్షాల కళ్లు ఎర్రబడుతున్నాయని.. ఇక్కడ చెరువులు నిండుతుంటే వారి గుండెలు మండుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం ఒక్క పైసా ఆర్థిక సాయం చేయకపోయినా.. సిగ్గులేకుండా బీజేపీ నేతలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్రలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

బీజేపీ పాలిత కర్నాటకలో తుంగభద్ర నదిపై ఉన్న అప్పర్‌ భద్రకు జాతీయ హోదా ఇస్తారు కానీ, తెలంగాణ ప్రాజెక్ట్ లకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. అమిత్‌ షాకు నీతి, నిజాయితీ ఉంటే.. తెలంగాణకు కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు కేటాయించి, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటించాలన్నారు. ఈనెల 14న తెలంగాణలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆయనను నిలదీస్తామని హెచ్చరించారు. అజ్ఞానులు.. సిగ్గులేని బీజేపీ నాయకులు చేనేత కార్మికుల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. చేనేత మీద జీఎస్టీ పన్ను విధించిన ఏకైక ప్రధాని మోదీనే అని ఎద్దేవా చేశారు.

ఎన్డీఏ హయాంలో 84 నవోదయ స్కూల్స్, దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలు, 16 ట్రిపుల్‌ ఐటీలు, 7 ఐఐఎంలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు కేటీఆర్. రాష్ట్రంలో రైతులకు కరెంట్‌ ఉచితంగా ఇవ్వడం కేంద్రానికి నచ్చడం లేదని.. రైతులకు ఫ్రీ కరెంట్‌ ఇవ్వొద్దని మోదీ ఆదేశిస్తున్నారని, పొలాల వద్ద మీటర్లు పెట్టాలని విద్యుత్‌ చట్టం తీసుకొచ్చారని విమర్శించారు. మీటర్లు పెట్టకపోతే కేంద్రం అప్పులు ఇవ్వదని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను బతికున్నంత కాలం రైతుల మోటార్ల వద్ద మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్‌ ఇదివరకే స్పష్టం చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ నివేదిక ప్రకారం 28 రాష్ర్టాల్లో తెలంగాణ భౌగోళికంగా 11వ స్థానంలో.. జనాభా పరంగా 12వ స్థానంలో ఉందని చెప్పారు కేటీఆర్. ఆర్థిక శక్తిగా మాత్రం నాలుగో స్థానంలో ఉందని వెల్లడించారు. గత ఏడు నెలల్లో పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూ.3,65,795 కోట్లు చెల్లిస్తే.. కేంద్రం మాత్రం కేవలం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చిందన్నారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి కడితే వాళ్లు తిరిగి ఇచ్చింది 45 పైసలు మాత్రమేనని వివరించారు. తాను చెప్పినదాంట్లో ఒక్క అక్షరం తప్పు ఉన్నా ఏ శిక్షకైనా సిద్ధం అని తేల్చిచెప్పారు కేటీఆర్.

ఏట్లో రాయి తీస్తానని బయలుదేరాడంట..
ఓ జాతీయ పార్టీ నేతకు ఎడ్లు, వడ్లు తెలియవని, ఆయనకు కేవలం పబ్బులు మాత్రమే తెలుసంటూ రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు కేటీఆర్. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ లేవని చెప్పారు. 50 ఏళ్లు దేశాన్ని చేతిలో పెడితే కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని విమర్శించారు. నోట్ల రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తానని బయలుదేరాడంట.. రాహుల్ గాంధీ వ్యవహారం అలాగే ఉందని అన్నారు కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్‌ నీతిలేని పార్టీలని, తెలంగాణ గుండె చప్పుడైన కేసీఆర్‌ ను ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News