నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. చంద్రబాబుకు కొడాలి నాని ఛాలెంజ్
చంద్రబాబు తీరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ప్రసారాలపై ఏపీ మంత్రి కొడాలి నాని చిందులుతొక్కారు. తప్పుడు కథనాలు రాస్తూ, తప్పుడు ప్రసారాలు చేస్తూ జగన్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, ప్రజలపై ప్రభుత్వం పెనుభారం మోపుతుందని చంద్రబాబు నిత్యావసర ధరల పట్టికను ప్రెస్‌మీట్‌లో వివరించారు. టీడీపీ అధినేత చెప్పిన ధరలను ఈనాడు పత్రిక ప్రచురించింది. దీనిపై కొడాలి నాని స్పందిస్తూ, చంద్రబాబు సిగ్గులేకుండా అబద్ధాలు చెబితే వాస్తవాలు […]
చంద్రబాబు తీరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ప్రసారాలపై ఏపీ మంత్రి కొడాలి నాని చిందులుతొక్కారు. తప్పుడు కథనాలు రాస్తూ, తప్పుడు ప్రసారాలు చేస్తూ జగన్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన.
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, ప్రజలపై ప్రభుత్వం పెనుభారం మోపుతుందని చంద్రబాబు నిత్యావసర ధరల పట్టికను ప్రెస్‌మీట్‌లో వివరించారు. టీడీపీ అధినేత చెప్పిన ధరలను ఈనాడు పత్రిక ప్రచురించింది. దీనిపై కొడాలి నాని స్పందిస్తూ, చంద్రబాబు సిగ్గులేకుండా అబద్ధాలు చెబితే వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు. అతను చెప్పేది నిజమా.. అబద్ధమా అని తెలుసుకోవాలని తెలియదా..?. మార్కెట్‌లో రేట్లను కనుక్కొని ప్రచురించాలి కదా..?. అని నిలదీశారు.
ఏపీ సీఎం జగన్‌పై, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై 24 గంటలు విషప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను వైఎస్సార్ సీపీ పూర్తిగా బహిష్కరిస్తుందని మంత్రి కొడాలి నాని చెప్పారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవ్వరూ ఈటీవీ, ఏబీఎన్, టీవీ5లకు ఇంటర్వ్యూలకు ఇవ్వొద్దని, డిబేట్లకు వెళ్లొద్దని, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను ప్రెస్‌మీట్‌లకు, ఇతర కార్యక్రమాలకు పిలవొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆదేశించారు.
బయట మార్కెట్‌లోని షాపుల్లో లభించే నిత్యావసర సరుకుల ధరల కంటే హెరిటేజ్‌లో ఎక్కువ రేట్లు ఉన్నాయని, స్వగృహ ఫుడ్స్‌లో లభించే పచ్చళ్ల కంటే ప్రియా పచ్చళ్ల ధర ఎక్కువగా ఉందన్నారు.
చంద్రబాబుకు జీవితకాలం సమయమిస్తానని, జగన్‌ను దించి ముఖ్యమంత్రి చైర్‌లో చంద్రబాబు కూర్చుంటే.. ఏపీ వదిలేసి వెళ్లిపోతానని చంద్రబాబుకు కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. సీఎం కుర్చీ నుంచి జగన్‌ను దించలేకపోతే చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉండిపోతాడా..?.
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించారని, ఔటర్ రింగ్ రోడ్డుకు వైఎస్సార్ శంకుస్థాపన చేసి 80 శాతం పనులు పూర్తిచేశారని, రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఓఆర్ఆర్ ప్రారంభమైందన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణాల్లో చంద్రబాబు ప్రమేయం లేదన్నారు కొడాలి నాని.
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు వేసినట్టు చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానని కొడాలి నాని మరో ఛాలెంజ్ చేశారు. నిరూపించలేకపోతే చంద్రబాబు ఏం చేస్తాడో చెప్పాలన్నారు. చంద్రబాబు ఎంగిలిమెతుకులకు ఆశపడే వ్యక్తి అని, ఏపీకి పట్టిన శని అని ఆరోపించారు.