శాఖాహార రాష్ట్రంగా గుజరాత్..? మాంసం కొట్లు మాయం..
గుజరాత్ లో ఇటీవల ఓ విపరీతమైన పరిణామం చోటు చేసుకుంటోంది. గుజరాత్ ని శాఖాహార రాష్ట్రంగా మార్చేస్తామని కొన్ని సంఘాలు కంకణం కట్టుకున్నాయి. స్వాధ్యాయ పరివార్, స్వామి నారాయణ్ పేరుతో జరుగుతున్న ఉద్యమాలు గుజరాత్ లో ఈ మార్పుకోసం నడుం బిగించాయి. అయితే అధికార బీజేపీ కూడా వీరితో జతకట్టడం విశేషం. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీజేపీకి మంచి పట్టు ఉన్న వడోదర, రాజ్ కోట్, జునాగఢ్, భావ్ నగర్ ప్రాంతాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంది. ప్రత్యేకంగా […]
గుజరాత్ లో ఇటీవల ఓ విపరీతమైన పరిణామం చోటు చేసుకుంటోంది. గుజరాత్ ని శాఖాహార రాష్ట్రంగా మార్చేస్తామని కొన్ని సంఘాలు కంకణం కట్టుకున్నాయి. స్వాధ్యాయ పరివార్, స్వామి నారాయణ్ పేరుతో జరుగుతున్న ఉద్యమాలు గుజరాత్ లో ఈ మార్పుకోసం నడుం బిగించాయి. అయితే అధికార బీజేపీ కూడా వీరితో జతకట్టడం విశేషం. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీజేపీకి మంచి పట్టు ఉన్న వడోదర, రాజ్ కోట్, జునాగఢ్, భావ్ నగర్ ప్రాంతాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంది. ప్రత్యేకంగా ప్రజల్ని శాఖాహారులుగా మార్చడంలో భాగంగా వారికి మాంసాహారం అందుబాటులో లేకుండా చేస్తున్నారు నేతలు.
వడోదర, రాజ్ కోట్ లో ఇటీవల రోడ్డు పక్కన చికెన్, మటన్ అమ్మే షాపులపై వరుసగా దాడులు జరిగాయి. ఇకపై మాంసాహారం అమ్మితే మీ అంతు చూస్తామంటూ కొంతమంది వారికి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అది జునాగఢ్, భావ్ నగర్ ప్రాంతాలకు కూడాపాకింది. ఆ తర్వాత అధికారులు సైతం రోడ్డు పక్కన మాంసాహారం అమ్మే షాపుల్ని మూసివేయించారు. ఫుట్ పాత్ పక్కన చికెన్, మటన్ అమ్మకాలు, మాంసాహారంతో చేసిన ఆహారం అమ్మకాలు నిషిద్ధం అని స్థానిక సంస్థలు ప్రకటించాయి. అక్కడ ఇప్పుడు చికెన్, మటన్ షాపులు వెదికినా కనిపించవు. అదో చాటుమాటు వ్యవహారంలా మారింది. అసలు మాంసాహారంపై వీరికి ఎందుకింత పగ అని ప్రశ్నిస్తున్నారు సగటు ప్రజలు. వెజిటేరియనిజం అనే పేరుతో నిరంకుశ నిర్ణయాలను తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. గుజరాత్ లో అడుగడుగునా మద్యం ఏరులై పారుతుంది. మహాత్ముడు పుట్టిన రాష్ట్రంలో మాంసాన్ని లేకుండాచేయడం కంటే ముందు.. మద్యం షాపులు మూసివేయొచ్చు కదా అని ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి.
ఎందుకీ ఏకపక్ష నిర్ణయాలు..?
గుజరాత్ లో మాంసాహారాన్ని విక్రయించేవారిలో ఎక్కువమంది మైనార్టీలు, ఇతర వెనుకబడిన కులాల వారు ఉన్నారు. వారందరికీ ఈ నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు. అందుకే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో.. బ్రాహ్మణులు, బనియాలు, పటేల్ ల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. వీరు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో మాంసాహార అమ్మకాలపై పూర్తి స్థాయిలో నిషేధం ఉంది. అయితే బీజేపీ మంత్రులు, ఇతర రాష్ట్ర నాయకులు మాత్రం దీన్ని ప్రజల ఆరోగ్యం కోసం తీసుకున్న నిర్ణయంగా చెబుతున్నారు. రోడ్డు పక్కన నిర్వహించే చికెన్, మటన్ షాపుల వల్ల ప్రజలు కలుషిత ఆహారం తినాల్సి వస్తోందని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని అంటున్నారు.