ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది కరోనా రోగుల సజీవ దహనం..!
మహారాష్ట్రలో శనివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మద్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగడంతో 11 మంది కరోనా రోగులు సజీవ దహనమయ్యారు. 10 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారని జిల్లా కలెక్టర్ రాజేంద్ర బోసలే తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 17 మంది కరోనా రోగులు ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. శనివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో […]
మహారాష్ట్రలో శనివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మద్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగడంతో 11 మంది కరోనా రోగులు సజీవ దహనమయ్యారు. 10 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారని జిల్లా కలెక్టర్ రాజేంద్ర బోసలే తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 17 మంది కరోనా రోగులు ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
శనివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మాట్లాడారు. ‘అహ్మద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. ఆసుపత్రిలో ఫైర్ అడిట్ జరిగిందో లేదా పరిశీలిస్తాం. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తుంది’ అని మాలిక్ తెలిపారు.
కాగా మహారాష్ట్రలోని ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని సివిల్ హాస్పిటల్‌లో జరిగిన హృదయ విదారక ప్రమాదం తనను తీవ్ర వేదనకు గురిచేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతితో పాటు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.