పునీత్ మరణం.. గుండె వైద్యుల దగ్గరకు పరిగెడుతున్న యువతరం..
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ 46ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్ట్ తో మరణించడం సంచలనంగా మారింది. పర్ఫెక్ట్ ఫిజిక్ తో ధృఢంగా కనిపించే పునీత్ కి సడన్ గా గుండె సమస్య ఎందుకొచ్చిందనే ప్రశ్న అందరినీ ఆలోచనలో పడేసింది. అతి వ్యాయామం అని కొందరు అంటుంటే, అలాంటిదేమీ లేదనేది మరికొందరి వాదన. అయితే కారణం ఏదయినా.. 40ఏళ్ల వయసువారు, అందులోనూ పైకి ధృఢంగా కనిపించేవారు కూడా గుండె విషయంలో జాగ్రత్తగా ఉండాలనే ప్రచారం మొదలైంది. […]
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ 46ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్ట్ తో మరణించడం సంచలనంగా మారింది. పర్ఫెక్ట్ ఫిజిక్ తో ధృఢంగా కనిపించే పునీత్ కి సడన్ గా గుండె సమస్య ఎందుకొచ్చిందనే ప్రశ్న అందరినీ ఆలోచనలో పడేసింది. అతి వ్యాయామం అని కొందరు అంటుంటే, అలాంటిదేమీ లేదనేది మరికొందరి వాదన. అయితే కారణం ఏదయినా.. 40ఏళ్ల వయసువారు, అందులోనూ పైకి ధృఢంగా కనిపించేవారు కూడా గుండె విషయంలో జాగ్రత్తగా ఉండాలనే ప్రచారం మొదలైంది. దీంతో బెంగళూరులో హార్ట్ స్పెషలిస్ట్ లకు చేతినిండా పనిదొరికింది. గుండె సంబంధిత ఆస్పత్రులకు జనం క్యూ కడుతున్నారు. ముఖ్యంగా 30నుంచి 45 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు ఆస్పత్రులకు వస్తున్నట్టు తెలుస్తోంది. గత మూడు రోజులుగా వైద్య పరీక్షలకోసం ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య మూడింతలు పెరిగింది.
బెంంగళూరులోని జయదేవ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియో వాస్కులర్ సైన్సెస్ కు సోమవారం ఒక్కరోజే 1200మంది వచ్చారు వీరిలో వెయ్యిమంది 40ఏళ్లకు కాస్త అటు ఇటుగా ఉన్నవారే. అందరిదీ ఒకటే సమస్య గుండెల్లో నొప్పి. తమకి ఈమధ్య ఆందోళన పెరిగిపోయిందని, హార్ట్ బీట్ లో తేడా వచ్చేసిందంటూ ఆస్పత్రులకు పరిగెత్తుకొస్తున్నారు. ఆదివారం సెలవు రోజయినా కూడా 550మంది యువత ఈ ఆస్పత్రికి వచ్చారని చెబుతున్నారు ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ సిఎన్ మంజునాథ్.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఇదే సీన్..
బెంగళూరు సహా కర్నాటకలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా గుండె సంబంధిత సమస్యలపై అనుమానంతో చాలామంది చెకప్ ల కోసం వస్తున్నారు. పునీత్ మరణం తర్వాత సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం వల్లే ఇలా యువత ఎక్కువగా ఆందోళనకు గురవుతోందని, అందుకే పరీక్షల కోసం ఆస్పత్రులకు వస్తున్నారని చెబుతున్నారు నిపుణులు. ఇలా ఆస్పత్రులకు రావడం ఒకరకంగా మంచిదేనంటున్నారు. అనవసర భయాలతో వచ్చినవారికి ముందుగా కౌన్సెలింగ్ ఇస్తున్నామని, ఆ తర్వాత అవసరం అనుకుంటే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు వైద్యులు.