విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు.. ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ వరాల వరద..
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. అన్నీ తానై అక్కడ పార్టీని నడిపిస్తున్న ప్రియాంక గాంధీ.. ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే 40శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తున్నామంటూ ప్రకటించిన ప్రియాంక.. తాజాగా విద్యార్థినులకు స్కూటర్లు, స్మార్ట్ ఫోన్లు అంటూ మరో ఆసక్తికర హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే యూపీలో ఇంటర్ పూర్తి చేసిన బాలికలందరికీ స్మార్ట్ ఫోన్లు అందిస్తామని చెప్పారు ప్రియాంక గాంధీ. స్మార్ట్ ఫోన్లు ఉంటే ఆడపిల్లలకు […]
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. అన్నీ తానై అక్కడ పార్టీని నడిపిస్తున్న ప్రియాంక గాంధీ.. ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే 40శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తున్నామంటూ ప్రకటించిన ప్రియాంక.. తాజాగా విద్యార్థినులకు స్కూటర్లు, స్మార్ట్ ఫోన్లు అంటూ మరో ఆసక్తికర హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే యూపీలో ఇంటర్ పూర్తి చేసిన బాలికలందరికీ స్మార్ట్ ఫోన్లు అందిస్తామని చెప్పారు ప్రియాంక గాంధీ. స్మార్ట్ ఫోన్లు ఉంటే ఆడపిల్లలకు భద్రత ఉన్నట్టేనని అన్నారు. వారి భద్రతకోసం, అపాయంలో వారు వెంటనే పోలీసుల్ని కానీ, బంధువుల్ని కానీ సంప్రదించేందుకు స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడతాయని చెప్పారు ప్రియాంక.
ఫోన్లతోపాటు స్కూటీలు కూడా..
ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెబుతున్న ప్రియాంక, డిగ్రీ చదువుతున్న యువతులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర పరిస్థితులపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ వరాలు ప్రకటిస్తున్నట్టు తెలిపారామె. మేనిఫెస్టో కమిటీ ఆమోదం మేరకే వీటిని ప్రకటించామని చెప్పారు. యూపీలో ఈ దఫా ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే ఆశతో కాంగ్రెస్ ఉంది. యోగీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా అదంతా పూర్తిగా కాంగ్రెస్ కే అనుకూలిస్తుందని చెప్పలేం. అక్కడ ఎస్పీ, బీఎస్పీ కూడా అధికారం కోసం ఆశపడుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత తమకి లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే అధికార బీజేపీ ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ విడుదల చేసింది. అటు అఖిలేష్ యాదవ్, మాయావతి కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ అన్నీ తానై చూసుకుంటున్నారు. లఖింపూర్ ఖేరీ ఘటన తర్వాత ఆమె పూర్తిగా యూపీలోనే ఉంటున్నారు. యూపీలో తిరిగి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తామని నమ్మకంగా చెబుతున్నారు ప్రియాంక.