మార్చి 28న యాదాద్రి పునః ప్రారంభం..

తెలంగాణలోని ప్రముఖ లక్ష్మీనరసింహ క్షేత్రం యాదగిరి గుట్ట ఇకపై యాదాద్రిగా వినుతికెక్కనుంది. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం యాదాద్రి ఆలయాన్ని 2022 మార్చి 28న పునః ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్.;

Advertisement
Update:2021-10-19 14:58 IST
Sri Lakshmi Narasimha Swamy Temple
  • whatsapp icon

తెలంగాణలోని ప్రముఖ లక్ష్మీనరసింహ క్షేత్రం యాదగిరి గుట్ట ఇకపై యాదాద్రిగా వినుతికెక్కనుంది. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం యాదాద్రి ఆలయాన్ని 2022 మార్చి 28న పునః ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇదివరకే ఈ మహూర్తాన్ని చినజీయర్ స్వామి ఖరారు చేసినా.. అధికారికంగా యాదాద్రిలో సీఎం కేసీఆర్ నేడు ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణ ఉంటుందని తెలిపారు. వివిధ పీఠాలకు ఆహ్వానం పంపించబోతున్నట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని తెలిపారు.

సమైక్య పాలనలో ఆధ్యాత్మిక అంశాల్లో కూడా తెలంగాణ నిరాదరణకు గురైందని అన్నారు సీఎం కేసీఆర్. గతంలో పుష్కరాలు కూడా తెలంగాణలో నిర్వహించేవారు కాదని, ఉద్యమ సమయంలో గోదావరి పుష్కర శోభ ప్రపంచానికి తెలియజేశామని చెప్పారు. జోగులాంబ శక్తిపీఠానికి గతంలో ప్రాచుర్యం కల్పించలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణలో ఆలయాలను ప్రాచుర్యంలోకి తెచ్చామని చెప్పారు. యాదాద్రి అభివృద్ధికి ఐదేళ్ల క్రితం బీజం వేసినట్టు గుర్తు చేసిన కేసీఆర్.. యాదాద్రి వైభవాన్ని నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం చేపట్టామని అన్నారు. చినజీయర్‌ స్వామి సూచనలతో అభివృద్ధి పనులు చేపట్టామని, సిద్ధాంతులు, వాస్తు నిపుణులతో చర్చలు జరిపి పునర్నిర్మాణం చేపట్టామని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్‌ సిటీ నిర్మాణం జరిగిందని చెప్పారు కేసీఆర్.

అంతకు ముందు ఆలయ పునఃప్రారంభ ముహూర్త పత్రికను స్వామి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఆలయ పునః నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రింగ్‌ రోడ్డులో స్థలాలు కోల్పోయిన వారిని ఆదుకుంటామని తెలిపారు. బాధితులకు ఉచితంగా దుకాణాలు నిర్మించి ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Tags:    
Advertisement

Similar News