నీటి పంపకాలపై ఫిఫ్టీ ఫిఫ్టీ కుదరదన్న కృష్ణాబోర్డ్.. తెలంగాణ వాకౌట్..

కృష్ణానది నీటి పంపకాల విషయంలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశం వాడివేడిగా సాగింది. చివరకు తెలంగాణ అధికారుల వాకౌట్ తో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్టయింది. అయితే గత ఏడాది లాగానే తెలంగాణ 34 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 66 శాతం నీటిని వినియోగించుకొనేలా కృష్ణా బోర్డు నిర్ణయించింది. 50 శాతం నీరు కేటాయించాలన్న తెలంగాణ వాదనను తోసి పుచ్చింది. అదే సమయంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని విద్యుత్ ఉత్పత్తికోసం విచ్చలవిడిగా ఉపయోగించుకునే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ప్రాజెక్ట్ దిగువన […]

Advertisement
Update:2021-09-02 02:13 IST

కృష్ణానది నీటి పంపకాల విషయంలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశం వాడివేడిగా సాగింది. చివరకు తెలంగాణ అధికారుల వాకౌట్ తో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్టయింది. అయితే గత ఏడాది లాగానే తెలంగాణ 34 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 66 శాతం నీటిని వినియోగించుకొనేలా కృష్ణా బోర్డు నిర్ణయించింది. 50 శాతం నీరు కేటాయించాలన్న తెలంగాణ వాదనను తోసి పుచ్చింది. అదే సమయంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని విద్యుత్ ఉత్పత్తికోసం విచ్చలవిడిగా ఉపయోగించుకునే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ప్రాజెక్ట్ దిగువన సాగు, తాగు అవసరాల మేరకే విద్యుదుత్పత్తి జరగాలని బోర్డు ఛైర్మన్‌ చెప్పడంతో తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఏకపక్ష నిర్ణయమంటూ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.

నీటి వినియోగంపై జరిగిన సుదీర్ఘ చర్చలో రెండు రాష్ట్రాలు తమ వాదనలు బలంగా వినిపించాయి. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-2 తీర్పు వచ్చేవరకు బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ కు కేటాయించిన 811 టీఎంసీలలో ఏపీ 512, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకునేలా 2015లో తాత్కాలిక ఏర్పాటు చేశారు. అంటే ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం నీటిని వాడుకోవచ్చు. అయితే తెలంగాణ ఇప్పుడు 50శాతం నీటివాటాకోసం పట్టుబట్టింది. ఏపీ 70శాతం కావాలంటోంది. దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. చివరకు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ మాత్రం 66, 34 శాతం నీటి వాటాలకే కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది.

తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర అభ్యంతరం..
శ్రీశైలం ప్రాజెక్ట్ లోని నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ కిందకు వదిలేయడంతో.. ఆ నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. దీన్ని ఆపేసేలా తెలంగాణను అడ్డుకోవాలంటూ గతంలో పలుమార్లు కేఆర్ఎంబీకి ఏపీ లేఖలు రాసింది. అయినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత బోర్డ్ సమావేశంలో కూడా ఇదే అంశంపై వాడి వేడి చర్చ జరిగింది. శ్రీశైలంను జల విద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రణాళికాసంఘం ఆమోదం తెలిపిందని, బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పిందని, తాము విద్యుదుత్పత్తి కొనసాగిస్తామని, అవసరమైతే ఏపీ కూడా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని తెలంగాణ అధికారులు చెప్పారు. సాగు, తాగు అవసరాల ప్రకారమే విద్యుదుత్పత్తి చేయాల్సి ఉందంటూ ఏపీ అధికారులు అడ్డుపడ్డారు. తక్షణం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వాదనలు విన్న తర్వాత సాగు, తాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుదుత్పత్తిని నిలిపివేయాలంటూ తెలంగాణ అధికారులకు స్పష్టం చేశారు బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్. దీంతో తెలంగాణ అధికారులు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. మొత్తమ్మీద కృష్ణా జలాల వాటాలపై ఉన్న వివాదం సామరస్యంగా పరిష్కారమయ్యే మార్గం కనపడటంలేదు.

Tags:    
Advertisement

Similar News